Begin typing your search above and press return to search.

సొంత ఎమ్మెల్యేలపైన జగన్‌ నిఘా!

By:  Tupaki Desk   |   20 March 2023 4:03 PM GMT
సొంత ఎమ్మెల్యేలపైన జగన్‌ నిఘా!
X
ఏపీలో మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వైసీపీ ప్రభుత్వానికి, గట్టి షాక్‌ ఇచ్చాయి. తమ ప్రభుత్వంపై క్షేత్ర స్థాయిలో ఉన్న ప్రజాభిప్రాయం ఏంటో వైసీపీ అధిష్టానానికి తెలిసి వచ్చిందని అంటున్నారు. ఈ ఫలితాలతో వైసీపీ హైకమాండ్‌ హైఅలర్ట్‌ అయ్యిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో మార్చి 23న జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటోందని చెబుతున్నారు.

ఎమ్మెల్యేల కోటా కింద మొత్తం ఏడుగురు ఎమ్మెల్సీలు ఎన్నిక కావాల్సి ఉండగా ఖాళీ అయిన ఏడు స్థానాలకు వైసీపీ అభ్యర్థులను నిలబెట్టింది. అయితే తెలుగుదేశం పార్టీ తమ తరఫున విజయవాడ మాజీ మేయర్, పార్టీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధను బరిలోకి దింపింది.

వాస్తవానికి ఏడు స్థానాలను గెలుచుకోవడానికి వైసీపీకి బలం లేదు. లేకపోయినా ఏడుగురి అభ్యర్థులను బరిలో దించింది. ఒక్కో అభ్యర్థి గెలుపొందాలంటే 23 ఎమ్మెల్యేలు ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు వైసీపీకి ముఖ్యమంత్రి జగన్, స్పీకర్‌ తమ్మినేని సీతారాంతో కలిపి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరు 23 మంది చొప్పున ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఓట్లేస్తే ఆరుగురు మాత్రమే గెలవడానికి అవకాశం ఉంది. టీడీపీకి సాంకేతికంగా 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో నలుగురు.. వల్లభనేని వంశీ (గన్నవరం), మద్దాల గిరిధర్‌ (గుంటూరు పశ్చిమ), వాసుపల్లి గణేష్‌ (విశాఖ సౌత్‌), కరణం బలరాం (చీరాల) వైసీపీతో అంటకాగుతున్నారు. ఈ నలుగురు వైసీపీకే ఓట్లేసే అవకాశం ఉంది. అలాగే గత ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున గెలిచిన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు కూడా వైసీపీతోనే అంటకాగుతూ వస్తున్నారు. రాపాక కూడా వైసీపీకే ఓటు వేసే చాన్సు ఉంది.

అయితే టీడీపీ తమ ఎమ్మెల్యేలందరికీ విప్‌ జారీ చేసింది. ఇందులో భాగంగా నలుగురు రెబల్‌ ఎమ్మెల్యేలకు కూడా వ్యక్తిగతంగా, మెయిల్‌ ద్వారా నోటీసులు ఇచ్చింది. ఎవరైనా విప్‌ ధిక్కరిస్తే వారి సభ్యత్వం రద్దయ్యేలా కోర్టును ఆశ్రయించనుంది. దీంతో నలుగురు టీడీపీ రెబల్‌ ఎమ్మెల్యేలు ఇరకాటంలో పడ్డారు.

మరోవైపు వైసీపీలో ఇద్దరు రెబల్‌ ఎమ్మెల్యేలు... ఆనం రాంనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి టీడీపీకి ఓటేసే చాన్సు ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ కూడా తమ సభ్యులందరికీ విప్‌ జారీ చేసింది. రెబల్‌ ఎమ్మెల్యేలే కాకుండా వైసీపీలో వచ్చే ఎన్నికల్లో సీట్లు దక్కవనుకుంటున్న కొంతమంది ఎమ్మెల్యేలు కూడా తమకు ఓట్లేస్తారని టీడీపీ ఆశలు పెట్టుకుంది.

ఈ నేపథ్యంలో సీఎం జగన్‌ సొంత ఎమ్మెల్యేలపైనే నిఘా పెట్టారని తెలుస్తోంది. ఇంటెలిజెన్స్‌ వర్గాలు వైసీపీ ఎమ్మెల్యేలను డేగ కళ్లతో గమనిస్తున్నాయని అంటున్నారు. ప్రతి ఓటూ కీలకమైనందున అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో కొందరి కదలికలను ఇంటెలిజెన్స్‌ సిబ్బందితో పర్యవేక్షిస్తున్నట్లు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో టికెట్‌ కష్టం అనే పరిస్థితి ఉన్నవారు, పార్టీ అదనపు సమన్వయకర్తలను నియమించిన నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, పార్టీపై అసంతృప్తితో ఉన్నవారు, కొంతకాలంగా పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా ఉండని వారిపై సీఎం జగన్‌ ప్రధానంగా దృష్టి సారించారని పేర్కొంటున్నారు.

ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు వైసీపీకి, సీఎం జగన్‌ కు అగ్నిపరీక్ష. ఇందులో కూడా ఓడిపోతే జగన్‌ ప్రతిష్ట మరింత కిందకు దిగజారుతుంది. ఇప్పటికే మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో షాకుతో వైసీపీ కక్కలేక, మింగలేక అన్నట్టు ఉంది. ఈ నేపథ్యంలో మార్చి 23న జరిగే పోలింగ్‌ కు ముందుగానే వైసీపీ మాక్‌ పోలింగ్‌ నిర్వహించింది. తమ ఎమ్మెల్యేలంతా సరిగా పార్టీ అభ్యర్థులకే ఓట్లేసేలా ట్రయల్‌ నిర్వహించింది.

ఇలా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాజయం నేపథ్యంలో ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ చిన్న పొరపాటూ జరక్కుండా అధికార వైకాపా తీవ్ర కసరత్తు చేస్తోంది. పార్టీ తరఫున బరిలో దింపిన ఏడుగురు అభ్యర్థులకు ఒక్కొక్కరికీ 22 మంది ఎమ్మెల్యేల చొప్పున కేటాయించింది. వీరిని ఏడు బృందాలుగా విడగొట్టింది. ప్రతి బృందానికీ ఒక ఎమ్మెల్యేలను సమన్వయకర్తగా నియమించింది.

ఈ బృందాల్లో టీడీపీ నలుగురు ఎమ్మెల్యేలు, జనసేన ఎమ్మెల్యే కూడా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యేలు ఆనం రాంనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డిలను ఈ బృందాల్లో చేర్చలేదని అంటున్నారు. అభ్యర్థులవారీగా విభజించిన ఎమ్మెల్యేల బృందాల్లో ఇద్దరు లేదా ముగ్గురు మంత్రులు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు.

కాగా మాక్‌ పోలింగ్‌లో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు పొరపాట్లు చేసినట్లు గుర్తించారు. ఇలాంటి పొరపాట్లు మార్చి 23న జరిగే అసలైన పోలింగ్‌లో దొర్లితే ఇబ్బందులు తప్పవనే ఉద్దేశంతో మళ్లీ అభ్యర్థుల వారీగా మాక్‌ పోలింగ్‌ నిర్వహించారు. ఎమ్మెల్యేలకు ఎలా ఓట్లేయాలో అవగాహన కల్పించారు. మార్చి 20న కూడా మూడోసారి మాక్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారని తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.