రివర్స్ పై ముందుకే..జగన్ వ్యూహం ఇదేనా...?

Sat Aug 24 2019 20:21:34 GMT+0530 (IST)

Jagan Strategy On about Reverse Tendering

ఏపీ సీఎంగా ప్రమాణం చేయడానికి ముందుగానే రాష్ట్రంలోని పలు ప్రాజెక్టుల్లో చోటు చేసుకున్న అవినీతిని వెలికి తీసే క్రమంలో ఖచ్చితంగా తాము ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఇప్పుడున్న టెండర్లను రద్దు చేసి - రివర్స్ టెండరింగ్ కు వెళ్లామంటూ.. వైసీపీ అధినేత - ప్రస్తుత సీఎం జగన్ చేసిన ప్రకటన గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఆయన అదే బాటలో ప్రయాణం చేస్తున్నారు. ముఖ్యంగా అటు కేంద్రం - ఇటు రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సహా బీజేపీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా.. కూడా జగన్ పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు విషయంలో రివర్స్ టెండరింగ్ దిశగానే అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పోలవరం విద్యుత్ ప్రాజెక్టు - పోలవరం సాగునీటి ప్రాజెక్టుల్లో నామినేషన్ ప్రాతిపదికపై 2018లో పనులు పొందిన నవయుగను తప్పిస్తూ.. జగన్ ప్రభుత్వ రివర్స్ టెండర్ ను ఆహ్వానించింది.అయితే నవయుగ కంపెనీ ఈ నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేసింది. తాము నిబంధనల మేరకు పనులు చేస్తున్నామని - తమకు అప్పగించిన పనిలో 98 శాతం సాగునీటి ప్రాజెక్టు పనులు - 78% విద్యుత్ ప్రాజెక్టు పనులను కూడా పూర్తి చేశామని - మరికొన్ని పనులను సబ్ కాంట్రాక్ట్ పద్దతిలో కొన్ని సంస్థలకు అప్పగించామని - ఇప్పటికిప్పుడు తమతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయడం భావ్యం కాదని - దీనివల్ల తాము ఆర్థికంగా - పరువు పరంగా కూడా తీవ్రంగా నష్టపోతామని హైకోర్టుకు తెలిపింది. అంతేకాదు అసలు జగన్ ప్రభుత్వానికి తమ ఒప్పందానికి సంబంధం లేదని కూడా పేర్కొంది. తమతో విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించి విద్యుత్ ఉత్తత్తి చేసే ప్రభుత్వ రంగ సంస్థ జెన్కో ఒప్పందం చేసుకుందని తెలిపింది.

ఈ ఒప్పందంలో ప్రభుత్వం థర్డ్ పార్టీయేనని - వేలు పెట్టేందుకు ఎట్టి పరిస్థితిలోనూ వీలు లేదని కూడా నవయుగ పేర్కొంది. మొత్తంగా ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు  విద్యుత్ ప్రాజెక్టు ఒప్పందం విషయంలో నవయుగ ఒప్పందాన్ని రద్దు చేయడాన్ని తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్టు(స్టే) ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఇంకేముందు జగన్ నిర్ణయం బెడిసి కొట్టిందని - ఇక - జగన్ కు అనుభవం లేని విషయం ఈ దెబ్బతో రుజువైందని పెద్ద ఎత్తున హడావుడి చేయడం ప్రారంభించారు. ఇక జగన్ వ్యతిరేక మీడియా దీనిని చిలవలు పలవలు చేసి మరీ రాసేసింది.

అయితే అసలు విషయం తెలుసుకున్న మేధావులు మాత్రం కేవలం పోలవరం విద్యుత్(హైడల్) ప్రాజెక్టు విషయంలో హైకోర్టు స్టే మాత్రమే ఇచ్చిందని - మిగిలిన పనుల రీటెండరింగ్ కు ఎలాంటి ఇబ్బంది కూడా లేదని అంటున్నారు. ఇదే విషయాన్ని తాజాగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు. హైకోర్టు స్టే కేవలం నవయుగ కంపెనీ చేపట్టి హైడెల్ ప్రాజెక్టుకే పరిమితమని - తమ విధాన నిర్ణయమైన రివర్స్ టెండరింగ్ పై హైకోర్టు ఎలాంటి ఆదేశాలూ జారీ చేయలేదని - సో.. మేము రివర్స్ విషయంలో వెనక్కి తగ్గేదిలేదని చెప్పారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.