సారుకు మోడీ టైమివ్వలేదు కానీ జగన్ కు ఇస్తున్నారే?

Fri Dec 06 2019 10:18:03 GMT+0530 (IST)

ప్రధాని మోడీ దర్శనం చేసుకోవటం అంత తేలికైన వ్యవహారం కాదు. సినీ స్టార్స్.. క్రీడాకారులు.. అవసరమైతే సామాన్యులు కొందరు మోడీని ఇట్టే కలవగలుగుతారు కానీ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా ఉండే వారికి మాత్రం సమయం చిక్కని పరిస్థితి. మొన్ననే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఢిల్లీ టూర్ లో ప్రధాని మోడీని కలిసేందుకు ప్రయత్నం చేసినా.. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కారణంగా ఆయనకు ప్రధాని అపాయింట్ మెంట్ ఫిక్స్ కాలేదు.దీంతో ప్రధానిని కలవకుండానే తెలంగాణ ముఖ్యమంత్రి హైదరాబాద్ కు తిరిగి వచ్చేశారు. కేసీఆర్ కు ఫిక్స్ కాని అపాయింట్ మెంట్ అనూహ్యంగా ఏపీ ముఖ్యమంత్రికి కన్ఫర్మ్ కావటం ఆసక్తికరంగా మారింది. కడప జిల్లాలో ఈ నెల 23న జరగనున్న ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ శంకుస్థాపనకు ప్రధాని మోడీ.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను ఆహ్వానించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు.

ఇందులో భాగంగా ప్రధాని మోడీ.. హోంమంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రయత్నించగా.. సఫలమయ్యారు. ఢిల్లీ నుంచి వచ్చిన సమాచారంతో గురువారం సాయంత్రానికి దేశ రాజధానికి చేరుకున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు మోడీషాలతో భేటీ అవుతారని తెలుస్తోంది. ఏమైనా.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు కన్ఫర్మ్ కానీ మోడీ అపాయింట్ మెంట్ జగన్మోహన్ రెడ్డికి కావటం ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.