ప్రశాంత్ కిశోర్...పరిచయం అవసరం లేనంతగా పాపులర్ అయిపోయిన ఎన్నికల వ్యూహకర్త! 2014 ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ గెలుపు వెనుక ఉన్న కీలక శక్తుల్లో ఈయన ఒకరు. అయితే వివిధ కారణాల వల్ల ఆయన బీజేపీకి దూరమయ్యారు. అనంతరం బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ శతవిధాల ప్రయత్నించినా జేడీయూ నేత నితీశ్‌కుమార్ గెలుపొందడానికి దోహదం చేశారు. అలాంటి సత్తా గల ప్రశాంత్ కిశోర్ ఆంధ్రప్రదేశ్ లో ఈసారి వైఎస్ ఆర్ కాంగ్రెస్ విజయానికి వ్యూహరచన చేశారు. వైసీపీకి భారీ విజయం కట్టబెట్టారు. అనంతరం - ఈ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. అయితే మళ్లీ ఈ ఇద్దరు కొత్త టాస్క్ తో తెరమీదకు వచ్చారని అంటున్నారు.
2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు వైసీపీని సమాయత్తం చేయడంలో ప్రశాంత్ కిశోర్ పాత్ర చాలా కీలకమైనదనే చెప్పాలి. పాదయాత్ర నుంచి మేనిఫెస్టో రూపకల్పన దాకా వైసీపీ విజయ ప్రస్థానంలో ప్రశాంత్ కిశోర్ కీలక పాత్ర పోషించారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పెద్దగా జగన్ పాలన వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం లేదు. కాగా ఆయన అవసరం మరో రూపంలో జగన్ కు వచ్చి పడిందంటున్నారు. అదే ఇటీవల తనపై జాతీయ మీడియాలో వస్తున్న వ్యతిరేక కథనాలకు బ్రేక్ వేయడం. ఇప్పటికే ఈ టార్గెట్ కోసం తన టీం పనిచేస్తున్నప్పటికీ...అది సరిపోకపోవడంతో...జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
వాస్తవంగా ఏపీ సర్కారు లోటు బడ్జెట్ లో ఉన్నప్పటికీ....జగన్ తన ముద్ర వేసుకునేలా భారీ ఎత్తున్నే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. అయితే గత కొద్దికాలంగా - జగన్ సర్కారుకు వ్యతిరేకంగా - జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున్నే కథనాలు వస్తున్నాయి. వీటిని డీల్ చేసేందుకు సీనియర్ జర్నలిస్టులు దేవులపల్లి అమర్ - అరవింద్ యాదవ్ లకు జగన్ అప్పగించారు. అయితే జగన్ ఆశించిన ఫలితం రావడం లేదట. జాతీయ స్థాయిలో తనపై అసమర్థ పాలకుడనే ముద్రను పడుతోందని గమనించిన వైసీపీ అధినేత ఈ మేరకు ప్రశాంత్ కిశోర్ సలహాలను - సూచనలను అడిగినట్లు తెలుస్తోంది. జగన్ పిలుపు నేపథ్యంలో...పీకే ఇప్పటికే జగన్ సర్కారులో వివిధ రూపాల్లో సేవలు అందిస్తున్న తన టీంలోని సభ్యులతో చర్చలు జరిపినట్లు సమాచారం. వారి దగ్గరి నుంచి సమాచారం సేకరించిన సమాచారం ఆధారంగా ప్రశాంత్ కిశోర్ తన కార్యాచరణను రూపొందించారని అంటున్నారు. త్వరలోనే ఈ మేరకు పీకే ముద్ర ఉంటుందని చెప్తున్నారు.