Begin typing your search above and press return to search.

ఏపీ వ్యాక్సినేషన్ లో జగన్ మార్క్.. ప్రైవేటులో అలా జరిగిందా?

By:  Tupaki Desk   |   21 July 2021 12:42 AM GMT
ఏపీ వ్యాక్సినేషన్ లో జగన్ మార్క్.. ప్రైవేటులో అలా జరిగిందా?
X
మొదట్లో నెమ్మదిగా.. మందగొడిగా మొదలైన కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం.. సెకండ్ వేవ్ పుణ్యమా అని వేగంగా పుంజుకోవటం తెలిసిందే. తొలుత టీకాలు వేసుకోవటానికి ప్రజలు ఆసక్తి చూపించకపోవటం తెలిసిందే. సెకండ్ వేవ్ దెబ్బకు టీకాలు వేయించుకోవటానికి వ్యాక్సినేషన్ కేంద్రాలకు జనాలు పరుగులు తీస్తే.. టీకాలు లేక అధికారులు కిందామీదా పడాల్సి వచ్చింది. పెద్ద ఎత్తున డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో.. అందుకు తగ్గట్లు టీకా సరఫరా లేకపోవటంతో.. కొరత ఏర్పడిన పరిస్థితి. దీంతో కేంద్రం మీద పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.

దీంతో మేల్కొన్న కేంద్ర సర్కారు యుద్ధ ప్రాతిపదికన తీసుకున్న చర్యల కారణంగా.. వ్యాక్సినేషన్ కార్యక్రమం సాగుతోంది. దేశ వ్యాప్తంగా సాగుతున్న ఈ డ్రైవ్ లో.. మిగిలిన రాష్ట్రాలకు భిన్నంగా ఏపీలోని జగన్ సర్కారు నిలిచింది. వ్యాక్సినేషన్ సందర్భంగా డోసుల వేస్టేజ్ ఎక్కువగా ఉంటుంది. అందుకు భిన్నంగా పక్కా ప్రణాళికతో ఈ వేస్టేజీకి అడ్డుకట్ట వేస్తూ.. పెద్ద ఎత్తున వ్యాక్సిన్లను ఆదా చేసి క్రెడిట్ మాత్రం ఏపీ ప్రభుత్వానికి దక్కుతుంది.
వ్యాక్సిన్ వెయిల్ లో పది మందికి టీకాలు వేసేంత మందు ఉంటుంది. అయితే.. పది మందికి ఒకేసారి వేసేందుకు వీలు లేక చాలా సందర్భాల్లో వేస్ట్ అవుతూ ఉంటుంది. మొదట్లో ఈ వేస్టేజీ ఎక్కువగా ఉండేది. దీనికి చెక్ పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం పలు జాగ్రత్తలు తీసుకుంది. ఈ ప్రయత్నాలు ఫలించాయి. తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. వ్యాక్సిన్ వేస్టేజీ లేకుండా చూసుకోవటం ద్వారా ఏకంగా 11 లక్షల డోసుల్ని ఆదా చేసిన విషయాన్ని ఏపీ ప్రభుత్వం తాజాగా వెల్లడించింది.

అంతేకాదు.. ఐదేళ్ల లోపు పిల్లల తల్లులందరికి వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసింది. 45 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సినేషన్ పూర్తి అయ్యాక ప్రాధాన్యతగా ఉపాధ్యాయులకు టీకాలు ఇవ్వాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉంది. ఇప్పటివరకు ఏపీలో  రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన వ్యాక్సిన్ డోసులు 1.80కోట్లు కాగా.. వినియోగించాల్సిన డోసులు ప్రభుత్వం చేతిలో 8.65 లక్షలు ఉన్నాయి. సమర్థ నిర్వహణ కారణంగా వ్యాక్సిన్లు వృథా కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో 11 లక్షల డోసులు ఆదా చేయగలిగారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఏపీలో ప్రైవేటు ఆసుపత్రులకు 35 లక్షల డోసుల్ని కేటాయిస్తే కేవలం 4.63లక్షల డోసుల్ని మాత్రమే వినియోగించారు. ప్రభుత్వం వద్ద వ్యాక్సిన్ వేయించుకునేందుకే ఏపీ ప్రజలు ఎక్కువ ఆసక్తి ప్రదర్శించటం గమనార్హం. దీంతో.. ప్రైవేటులో వ్యాక్సినేషన్ కార్యక్రమం పెద్దగా సాగని పరిస్థితి.దీంతో.. వారి వద్ద పెద్ద ఎత్తున టీకాలు మిగిలిపోతున్నాయి. వాటిని ప్రభుత్వానికి డైవర్టు చేయాలని నిర్ణయించారు.

ప్రస్తుతం గర్భిణులకు పూర్తి స్థాయిలో వ్యాక్సిన్లు వేయాలని.. వారికి టీకా కార్యక్రమం మీద అవగాహన కల్పించాలన్న ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. ఏపీలో మొత్తం వ్యాక్సినేషన్ పూర్తి అయిన వారు 1.41 కోట్లు ఉంటే.. అందులో సింగిల్ డోసులు పూర్తి అయిన వారు కోటి మంది కాగా.. రెండు డోసులు పూర్తి అయిన వారు 41.07లక్షలుగా చెబుతున్నారు. మొత్తంగా టీకా కార్యక్రమాన్నిసమర్థంగా నిర్వహించటంతో పాటు.. లక్షిత వర్గాలకు చేరేలా చేయటంతో ఏపీ ప్రభుత్వం సక్సెస్ అయ్యింది. అదే సమయంలో.. లక్షలాది టీకా డోసుల్ని వేస్టు కాకుండా జాగ్రత్తలు తీసుకోవటంలో ఏపీ రికార్డును చాలా రాష్ట్రాలు దగ్గరకు కూడా రాలేవని చెబుతున్నారు.