జగన్ ఇంటి దగ్గర ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది?

Fri May 24 2019 14:19:58 GMT+0530 (IST)

Jagan House Filled with Full Crowd

ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఎంతో ఆసక్తితో.. ఉత్కంటతో ఎదురుచూసిన ఫలితాలు.. ఎవరూ ఊహించని విధంగా విడుదలైన ప్రతిఒక్కరిని ఆశ్చర్యానికి గురయ్యేలా చేశాయి. చివరకు ఘన విజయం సాధించిన వారు సైతం ఇంతటి విజయాన్ని వారు ఊహించి ఉండరన్న అభిప్రాయాన్ని జగన్ పార్టీ నేతలు సైతం ఒప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ఏపీలో ఇప్పుడు పండుగ వాతావరణం నెలకొంది.జగన్ అభిమానులు.. కార్యకర్తలు.. నేతలు తమ విజయంపై సంబరాలు చేసుకుంటున్నారు. భారీ మెజార్టీతో గెలుపొందిన వైనంపై భారీ ఎత్తున అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ ఎమ్మెల్యేలు.. ఎంపీలు జగన్ నివాసానికి తరలి వస్తున్నారు. దీంతో.. ఆయన నివాసం ఉన్న తాడేపల్లి వద్ద కోలాహలం నెలకొని ఉంది.

వచ్చిన వారంతా జగన్ కు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇక.. పాలనకు సంబంధించిన కీలక ఐపీఎస్.. ఐఏఎస్ అధికారులంతా జగన్ ను కలిసి అభినందనలు తెలిపేందుకు అధినేత నివాసానికి చేరకుంటున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. జగన్ ను చూసేందుకు.. పెద్ద ఎత్తున ప్రజలు జగన్ నివాసం వద్దకు చేరుకొని నినాదాలుచేస్తున్నారు. వీరందరిని కలిసేందుకుజగన్ ఉదయం 11 గంటల వేళలో ఒకసారి పలుకరించారు. అనంతరం పలువురు అధికారులతో ఆయన సమావేశాలు నిర్వహిస్తున్నారు.

పాలనలో తాను కోరుకుంటున్న మార్పుల్ని అధికారుల వద్ద జగన్ పేర్కొంటున్నట్లుగా తెలుస్తోంది. తనను కలిసిన పార్టీ నేతలను అభినందిస్తున్న జగన్.. బాధ్యతగా వ్యవహరించాలని.. చెడ్డ పేరు రాకుండా జాగ్రత్త పడాలని చెబుతున్నట్లుగా తెలుస్తోంది.

ముఖ్యమంత్రిగా ఈ నెల 30 ప్రమాణస్వీకారం చేయటానికి మరో ఆరు రోజుల సమయం ఉన్న నేపథ్యంలో.. ఆ సమయానికి పాలనా సంబంధమైన అంశాల్లో పట్టు సాధించాలని జగన్ భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో జగన్ నివాసం వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.