ఏపీ ప్రజలకు మరో బాదుడు తెచ్చిన జగన్ సర్కార్?

Fri Aug 12 2022 23:00:01 GMT+0530 (India Standard Time)

Built A House On Road Side Will Also pay extra fees To Ap Government

ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలే కాదు.. అంతకు మించిన పథకాలతో మోత పుట్టిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇటీవల కాలంలో తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ఏపీ ప్రజలకు మంట పుట్టిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చెత్త పన్నుకు సంబంధించిన ప్రభుత్వ నిర్ణయంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్న విషయం తెలిసిందే. నిజానికి చెత్త పన్ను ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కంటే కూడా దాని కారణంగా చోటు చేసుకునే రచ్చనే ఎక్కువగా ఉంటుందని చెప్పాలి.



ఇది సరిపోనట్లుగా తాజాగా మరో బాదుడును తీసుకొచ్చిన వైనం కలకలంగా మారింది. ఇప్పటివరకు లేని కొత్త ఫీజును తెచ్చిన జగన్ సర్కారు తీరు సంచలనంగా మారింది.

ఏపీ వ్యాప్తంగా రోడ్ల పక్కనే ఇళ్లను నిర్మించుకునే వారు ప్రస్తుతం వసూలు చేస్తున్న లైసెన్సు ఫీజులు.. ఇతర ఫీజులతో పాటు ఇంపాక్ట్ ఫీజును కూడా చెల్లించాల్సి ఉంటుందని ఏపీ పురపాలక శాఖ  ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ఏపీలోని నగరాలు మొదలు కొని గ్రామాల వరకు రోడ్డు పక్కన ఇంటిని నిర్మించినవారంతా కూడా అదనపు ఫీజు చెల్లంచాల్సి ఉంటుందని చెబుతున్నారు.

తాజాగా వెలువడిన ఉత్తర్వుల ప్రకారం 60 అడుగులు.. అంతకంటే ఎక్కువ వెడల్పు ఉన్న రోడ్ల పక్కన కొత్తగా నిర్మించే వాణిజ్యేతర భవనాలకు ఫీజు వసూలు చేస్తారు. ఇప్పటికే అమల్లో ఉన్న ఫీజులకు ఈ ఇంపాక్టు ఫీజు అదనమని చెబుతున్నారు. ఈ కొత్త ఫీజును మొత్తం నాలుగు కేటగిరిలుగా విభజించారు. అందులో మొదటి కేటగిరిలో.. విజయవాడ గుంటూరు విశాఖపట్నం నగర పాలక సంస్థలు వస్తాయి.

రెండో కేటగిరిలో మిగిలిన నగరాపాలక సంస్థలు రానున్నాయి. మూడో కేటగిరిలో పురపాలక సంఘాలు.. నగర పంచాయితీలు రాగా..నాలుగో కేటగిరిలో నగరాభివృద్ధి సంస్థల పరిధిలోకి వచ్చే పంచాయతీలన్నీ రానున్నాయి.దీంతో.. రోడ్ల పక్కన ఇళ్లను నిర్మించుకునే నిర్మాణదారుల మీద భారం పడేలా తాజా నిర్ణయం ఉంది.

ఈ ఇంపాక్టు ఫీజుగా వసూలు చేసిన మొత్తాలను ప్రత్యేకమైన ఖాతాలో డిపాజిట్ చేసి.. అనంతరంఆయా రోడ్ల నిర్మాణం.. మౌలిక వసతుల కోసం ఖర్చు చేస్తారని చెబుతున్నారు. ఇచ్చే ఉచితాల్ని కాస్త తగ్గించుకొని.. ఈ తరహా ఛార్జీలను వడ్డించకుండా ఉంటే బాగుటుంది కదా జగన్ అన్న మాట పలువురి నోటి నుంచి వస్తోంది.