Begin typing your search above and press return to search.

బాబుకు జగన్ షాక్..వేలానికి ప్రజావేదిక పరికరాలు

By:  Tupaki Desk   |   24 Feb 2020 3:20 PM GMT
బాబుకు జగన్ షాక్..వేలానికి ప్రజావేదిక పరికరాలు
X
ఏపీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... టీడీపీ అధినేత - విపక్ష నేత నారా చంద్రబాబునాయుడుకు షాకుల మీద షాకులిచ్చేస్తున్నారు. ఇప్పటికే జగన్ ఇస్తున్న షాక్ లతో బిక్కచచ్చిపోయిన చంద్రబాబు... ఇప్పుడు తాజాగా జగన్ ఇచ్చిన షాక్ కు మింగలేక కక్కలేక అవస్థలు పడుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయినా బాబుకు జగన్ ఇచ్చిన తాజా షాక్ ఏమిటంటే... టీడీపీ హయాంలో సర్కారీ సమావేశాల కోసమంటూ చంద్రబాబు ముచ్చటపడి కట్టించుకున్న ప్రజావేదికకు చెందిన పరికరాలను వేలం వేసేస్తారట. ఈ మేరకు సోమవారం సీఆర్డీఏ సంచలన నిర్ణయం తీసుకుంది.

ప్రజావేదికను తమ పార్టీ సమావేశాలకు - తన క్యాంపు కార్యాలయం కోసం కేటాయించాలంటూ చంద్రబాబు చేసిన వినతిని బుట్టదాఖలు చేసిన జగన్... అది అక్రమ కట్టడమని నిర్ధారించేసి కూల్చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రజావేదికను కూల్చిన తర్వాత దానిలోని పరికరాలను ఏం చేయాలన్న విషయంలో ఇప్పటిదాకా జగన్ సర్కారు ఆలోచనే చేయలేదు. తాగాజా దీనిపై దృష్టి సారించిన జగన్ సర్కారు. ప్రజావేదికలో ఏర్పాటు చేసిన పరికరాలన్నింటినీ తిరిగి ఎక్కడో ఒక చోట వినియోగించుకునే విషయాన్ని పక్కనపెట్టేసి... సదరు పరికరాలను ఏకంగా వేలం వేయాలని తీర్మానించింది. ఆ మేరకే సీఆర్డీఏ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వేలానికి సంబంధించిన వివరాలల్లోకి వెళితే... మార్చి 3వ తేదీలోగా వేలం పత్రాలను సీఆర్డీఏ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌ లోడు చేసుకోవాలట. మార్చి 4వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంటకు వేలం ప్రారంభం అవుతుందట.

అయినా ప్రజావేదికను కూల్చేశాక - దానిలోని పరికరాలను ఏం చేస్తే... బాబుకు వచ్చే నష్టమేంటి? అన్న వాదన కూడా వినిపిస్తోంది. ఇక్కడే అసలు సిసలు లాజిక్ ఉందని చెప్పాలి. ఎందుకంటే... ఈ పరికరాలను ఏం చేసినా బాబుకు వచ్చే నష్టం ఏమీ లేదు గానీ... తన హయాంలో ఏర్పాటు చేసిన ప్రజావేదికను కూల్చేయడంతో పాటుగా దానిలోని పరికరాలను ఇప్పుడే వేలం వేసేందుకు తన హయాంలో ఏర్పాటు చేసిన సీఆర్ డీఏ ద్వారానే వేలం వేయిస్తుండటం బాబుకు ఇబ్బందే కదా. అంటే... బాబు అపురూపంగా కట్టుకున్న ప్రజావేదిక పరికరాలను బాబు హయాంలో బాబు తనకు అనుగుణంగా పనిచేసేందుకు ఏర్పాటు చేసుకున్న సీఆర్డీఏ ద్వారానే జగన్ వేలం వేయిస్తున్నారన్న మాట.