కుప్పం కొడదామన్న వేళ.. పులివెందుల కొట్టుకుపోయిందే?

Sun Mar 19 2023 11:00:01 GMT+0530 (India Standard Time)

Jagan Focus only on Kuppam

ఆశ మంచిదే. అత్యాశ మంచిది కాదు. అందరు బాగుండాలి. అందులో మనం ఉండాలన్న మాటను ఎవరు మాత్రం తప్పు పడతారు. గెలుపు కోరుకోవటం తప్పు కాదు. అందుకు తగ్గట్లు శ్రమించటాన్ని తప్పు పట్టరు. కానీ.. గెలుపు రందిలో పడి.. వెనుకా ముందు చూసుకోకుండా గెలుపు మాత్రమే ముఖ్యం.. మిగిలినవేమైనా ఫర్లేదన్న ధోరణితోనే అసలు సమస్యంతా. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయంలోనూ ఇలాంటి పరిస్థితే. విపక్ష నేత చంద్రబాబు సొంత అడ్డా అయిన కుప్పంలో వైసీపీ జెండా ఎగురవేయాలన్న ఆలోచనను తప్పు పట్టలేం. అధికార పార్టీ అధినేతగా ఆయనకు ఆ కోరిక ఉంటాన్ని వేలెత్తి చూపలేం.అయితే.. కుప్పంలో పార్టీ జెండా సగర్వంగా ఎగరాలన్న తన కలను నెరవేర్చుకోవటం కోసం.. ఇష్టా రాజ్యంగా వ్యవహరించే ధోరణితో నే సమస్యంతా. ఎదుటి వాడి ఓటమిని వెకిలిగా.. వెటకారంగా చూపించే ధోరణి ని తెలుగు ప్రజలు పెద్దగా ఇష్టపడరు. కొంత మేర ఓర్చుకున్నా.. అలాంటి ధోరణి అంతకంతకూ ఎక్కువ అవుతుంటే మాత్రం అంగీకరించరు సరికదా.. అలాంటి ధోరణి కి తాము వ్యతిరేకమన్న విషయాన్ని తమ మాటతో కాకుండా ఓటుతో చెప్పేస్తుంటారు.

కుప్పంలో వైసీపీ జెండా ఎగరాలన్న ఉద్దేశంతో స్థానిక సంస్థల ఎన్నికల వేళ.. జగన్ అండ్ కో చేసిన ప్రయత్నాల గురించి వచ్చిన వార్తలు అన్ని ఇన్ని కావు. చేతిలో ఉన్న అధికారం మొత్తాన్ని విపక్ష నేత ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని స్థానిక సంస్థల ఎన్నికల కోసం వాడాల్సిన అవసరం ఏముంది? అంత సీరియస్ గా తీసుకోవాల్సిందేముంది? అన్నది ప్రశ్నగా మారింది. దీనికి సరైన సమాదానం ఇచ్చేటోళ్లు కనిపించు. ఎదుటోడి ఇంటి మీద ఎక్కువ ఫోకస్ చేయటం అంటే.. తన సొంతింటి మీద ఫోకస్ తగ్గుతుందన్న విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. కానీ.. అదేమీ లేని వేళలో షాకులు తప్పవు. ఇప్పుడు అలాంటి పరిస్థితే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఎదురైందా? అన్నది చర్చగా మారింది.

కుప్పం కొట్టటమే తన లక్ష్యమన్నట్లుగా ముఖ్యమంత్రిస్థానంలో ఉన్న వైఎస్ జగన్ అనుకోవటం ఏమిటి? తన అభిలాషను ఆయన మనసులో ఉంచుకున్నా ఫర్లేదు. కానీ.. ఓపెన్ గా అదేపనిగా వ్యాఖ్యానించటం కాస్త ఇబ్బందే. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి విపక్ష నేత ప్రాతినిద్యం వహించే నియోజకవర్గం మీద అంత పట్టుదలను ప్రదర్శించాల్సిన అవసరం ఏముంది? వైఎస్.. చంద్రబాబుల మధ్య రాజకీయ విబేధాలు ఎన్ని ఉన్నా.. వారు వారి గీతల్నిదాటి వచ్చే వారు కాదు. ఎందుకంటే.. వారికి పరిమితుల విషయంలో స్పష్టమైన అవగాహన ఉంది. కానీ.. ఇప్పటి రాజకీయం తీరే వేరు.

తమ చేతికి అందిన విజయాన్ని అస్వాదించే కన్నా.. ఇంకా అందని వాటి గురించి ఆరాటపడిపోవటం కనిపిస్తుంది. ఎలాగైనా అన్నీ తమకే సొంతం కావాలన్న పట్టుదల కనిపిస్తుంది. ఇది పాజిటివ్ గా కాకుండా నెగిటివ్ గా రిఫ్లక్ట్ కావటంతోనే సమస్య. తాజాగా అలాంటి పరిస్థితే నెలకొందంటున్నారు. కుప్పం కొట్టాలి.. కుప్పం మీద వైసీసీ జెండా ఎగురవేయాలి.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం కుప్పంతోనే షురూ కావాలంటూ విషయాన్ని పెద్దది చేసిన జగన్.. తన ఫోకస్ మొత్తాన్ని కుప్పం మీద పెట్టటం తెలిసిందే.

అదే సమయంలో తాను ప్రాతినిధ్యం వహించే పులివెందుల మీద ఫోకస్ తగ్గటాన్ని ఆయన మర్చిపోయారు. ఇదే.. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను ప్రాతినిధ్యం వహించే పులివెందులలో పార్టీ అభ్యర్థికి ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి కంటే తక్కువగా ఓట్లు పోల్ కావటానికి కారణమైందన్నది వాస్తవం. జరిగిందేదో జరిగింది. ఇప్పటికైనా కళ్లు తెరిచి..కుప్పం కొట్టాలన్న ఆశను పక్కనపెట్టి.. పులివెందుల కొట్టుకుపోకుండా ఏమేం చర్యలు తీసుకోవాలన్న దానిపై ఫోకస్ పెడితే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరేం జరుగుతుందో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.