Begin typing your search above and press return to search.

రూపాయి జీతం తీసుకునే సీఎం జగన్ ఇంటి దగ్గర హెలిప్యాడ్ కు ప్రజల డబ్బులా?

By:  Tupaki Desk   |   1 April 2023 9:53 AM GMT
రూపాయి జీతం తీసుకునే సీఎం జగన్ ఇంటి దగ్గర హెలిప్యాడ్ కు ప్రజల డబ్బులా?
X
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీతం అక్షరాల రూపాయి మాత్రమే. ప్రజలకు సేవ చేసేందుకు పదవిని చేపట్టిన ఆయన.. కోట్లాది మంది జీవితాల్ని బాగు చేయటం.. వారి తలరాతల్ని మార్చేయటమే తన లక్ష్యమని చెబుతారు. తన మాటల్లో వినిపించే ఆదర్శాల మధురిమ చేతల్లోనూ ఉంటుందన్న విషయాన్ని తెలిసేలా చేయటం కోసం నెలకు రూపాయి మాత్రమే జీతం తీసుకోవాలని డిసైడ్ కావటం తెలిసిందే. మరి.. రూపాయి జీతం తీసుకునే ముఖ్యమంత్రి.. ప్రజల సొమ్మును మరెంత జాగ్రత్తగా తీసుకోవాలి?

కానీ.. కాలు కదిపితే ప్రత్యేక విమాన సౌకర్యాన్ని మాత్రమే వినియోగించుకునే జగన్.. రాజ ప్రసాదం లాంటి తన ఇంటికి మార్పులు చేర్పుల కోసం భారీ మొత్తాన్ని ఖర్చు చేసిన వైనంపై విమర్శలు వెల్లువెత్తటం తెలిసిందే. అయితే.. ఇలాంటి వాటిని పెద్దగా పట్టించుకోని ఆయన.. తాజాగా తన ఇంటి ఆవరణలో హెలిప్యాడ్ ను నిర్మిస్తున్న వైనం ఆసక్తికరంగా మారింది.

దీని కోసం ప్రజల సొమ్మును భారీగా ఖర్చుపెట్టిస్తున్నవైనం కొత్త చర్చకు తెర తీసింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రూపాయి మాత్రమే జీతం తీసుకునే జగన్.. మరీ ఖర్చు మొత్తాన్ని తానే భరించి ఉంటే మరింత ఆదర్శంగా నిలిచేవారు కదా? అన్నది ప్రశ్న.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తాడేపల్లిలోని నివాసానికి.. క్యాంప్ కార్యాలయానికి కొత్తగా కిటికీలు.. తలుపులు అమర్చేందుకు రూ.73లక్షలు ఖర్చు చేసిన వైనం అప్పట్లో హాట్ టాపిక్ గా మారటం తెలిసిందే. ఆ తర్వాత కూడా సెక్యూరిటీ కోసం అత్యాధునిక పరికరాల్ని వినియోగించేందుకు ఇప్పటికే భారీగా ఖర్చు చేసినట్లుగా విమర్శలు ఉన్నాయి.

తాజాగా తన నివాసంలో హెలిప్యాడ్ ఏర్పాటు కోసం రూ.1.89కోట్ల మొత్తాన్ని మంజూరు చేస్తూ జీవో జారీ అయ్యింది. హెలిప్యాడ్.. దాని ఫెన్సింగ్ కోసం రూ.40 లక్షలు.. హెలిపాడ్ వద్ద గార్డు రూం.. ఇతర సదుపాయాల కోసం రూ.13.50 లక్షలు.. సీఎం నివాసం వద్ద శాశ్విత ఇనుప చట్రాలతో బారికేడింగ్ కోసం రూ.75 లక్షలు.. సీఎం నివాసంలోనే పోలీస్ బ్యారెక్.. సదుపాయాల కోసం రూ.30 లక్షలు.. సెక్యూరిటీ పోస్ట్ సెక్యూరిటీ గేట్స్ పోర్టబుల్ క్యాబిన్ కోసం రూ.31 లక్షల చొప్పున ఖర్చు చేసేందుకు వీలుగా అనుమతులు రావటం గమనార్హం.

ఇంతా చేస్తే.. కేవలం ఏడాది మాత్రమే ఎన్నికలకు గడువు ఉన్న వేళలో.. ఇంత భారీ ఖర్చుకు వెళ్లటం ఏమిటన్న ప్రశ్నలు వస్తున్నాయి. "మన ప్రభుత్వం" అంటూ నిత్యం చెబుతూ.. ఇంట్లో మనిషి చనిపోతే డెడ్ బాడీని ఊరికి తీసుకెళ్లేందుకు అంబులెన్సు సౌకర్యం లేని రాష్ట్రంలోని ముఖ్యమంత్రి సొంతింటికి ఏర్పాటు చేసే హెలిప్యాడ్ కోసం ఇంత భారీ ఖర్చా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.