పాలనలో జగన్ పెద్ద ఫెయిల్యూర్: ఉండవల్లి

Sat Nov 27 2021 16:00:00 GMT+0530 (IST)

Jagan Big Failure In Governance Undavalli

కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మరోసారి బరస్ట్ అయ్యారు. కాంగ్రెస్ నుంచే పుట్టిన వైఎస్ జగన్ పై విరుచుకుపడ్డారు. ఏపీ సీఎం జగన్ పాలనలో ఘోర వైఫల్యం చెందారని ఆడిపోసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఉండవల్లి అరుణ్ కుమార్ ‘అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోతే ప్రజాస్వామ్యం లేనట్లేనని’ అన్నారు. అంతేకాకుండా కేంద్రం షరతులకు అనుగుణంగా పన్నులు పెంచి అప్పులు తీసుకున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటేనన్నారు.ఏపీ ప్రభుత్వానికి అప్పులపై నియంత్రణ లోపించిందని ఉండవల్లి ఆరోపించారు. రెండేళ్లలో వైసీపీ ప్రభుత్వం రూ.3 లక్షల కోట్ల అప్పులు చేసిందని దుయ్యబట్టారు. ‘సీఎం జగన్ ఇంత ఘోరంగా విఫలమవుతారని ఊహించలేదు. 3 రాజధానుల బిల్లు ఉపసంహరించుకొని మళ్లీ పెడుతాం అనడం ప్రభుత్వ వైఫల్యమే. ప్రతిపక్షం సలహాలు తీసుకుంటేనే ప్రభుత్వానికి పేరు వస్తుందని.. చంద్రబాబును ఉద్దేశించి అగౌరంగా మాట్లాడుతుంటే జగన్ ఏం చేస్తున్నారని’ ప్రశ్నించారు. ప్రతిపక్షం లేకుండా చేయాలనుకుంటే అంత అవివేకం ఇంకోటి లేదన్నారు.

ఇసుక మద్యం పెట్రోల్ కరెంట్.. ఇలా అన్ని ధరలు పెంచుకుంటూ పోయారని..అప్పులు పెరుగుతున్నాయి కానీ ఆస్తులు మాత్రం అసలేం ఏర్పడడం లేదన్నారు. ఉన్నన్నీ నాళ్లు అప్పులపై నెట్టుకొచ్చి ఆ తర్వాత రాష్ట్రాన్ని రోడ్డుపై పడేయడమే వైసీపీ ఉద్దేశమన్నారు.

ఇప్పటివరకూ చేసిన అప్పులు తీర్చడానికి కూడా మళ్లీ అప్పులు తెస్తామని చెప్పడం.. దీనిపై ఎఫ్ఆర్.బీఎం చట్టాన్ని ఇష్టారీతిన సవరించడం దుర్మార్గమన్నారు.

రావాల్సిన నిధులపై కేంద్రాన్ని అడగడానికి కేసుల భయం వెంటాడుతోందని.. అఖిల భారత సర్వీసు అధికారులు సైతం ప్రస్తుత పరిస్థితిపై నిర్ఘాంత పోతున్నారని ఉండవల్లి అన్నారు.