జగన్ దర్శనం దొరకాలంటే... ?

Mon Nov 29 2021 22:00:01 GMT+0530 (IST)

Jagan Appears only at assembly meetings

జగన్... వైసీపీకి అధినేత. ఇటు ప్రభుత్వ అధిపతి. ఆయన ఒక విధంగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఆయనను కాదని అటు పార్టీ కానీ ఇటు ప్రభుత్వం కానీ ఒక చిన్న నిర్ణయం తీసుకునే సీన్ లేదు. ఒక విధంగా జగనే సర్వాధిపతి. సార్వత్రిక ఎన్నికలు జరిగి రెండున్నరేళ్లు అయిపోయాయి. మరో రెండున్నరేళ్లలో ఎన్నికలు ఉంటాయి. ఇక వైసీపీ తరఫున గతసారి 22 మంది ఎంపీలు గెలిచారు. వీరిలో రెబెల్ ఎంపీ ఒకరు తప్ప అంతా పార్టీకి వీర విధేయులే. వీరితో పాటుగా ఆరుగురు రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. టోటల్ గా చూసుకుంటే 27 మంది ఎంపీలతో వైసీపీ దేశంలోనే నాలుగవ అతి పెద్ద పార్టీగా ఉంది.ఇక వైసీపీలో జగన్ దర్శకం దొరకడం దుర్లభం అన్న మాట ఎపుడూ ప్రచారంలో ఉంటుంది. 151 మంది ఎమ్మెల్యేలదీ ఇదే బాధ. జగన్ వారికి అసెంబ్లీ సమావేశాలలో మాత్రమే కనిపిస్తారు. ఎంపీల విషయం తీసుకుంటే పార్లమెంట్ సమావేశాలకు ఒకటి రెండు రోజుల ముందు మాత్రమే జగన్ మీటింగ్ పెట్టి అందరికీ కనిపిస్తారు అన్న విమర్శలు ఉన్నాయి. సరే పార్లమెంట్ సమావేశలపుడు వ్యూహాలు అనుసరించవలసిన విధానాలు ప్రతీ పార్టీకి ఉంటాయి. ఆ విధంగా మీటింగ్స్ పెట్టుకోవచ్చు. కానీ మిగిలిన సమయాలలో ఎపుడైనా ఏ ఎంపీకైనా జగన్ అపాయింట్మెంట్ దొరుకుతుందా అంటే అది పెద్ద డౌటే అంటారట.

జగన్ దర్శన భాగ్యం కలగాలీ అంటే పార్లమెంట్ మీటింగ్స్ లోనే అన్న మాట కూడా వైసీపీలో ఉంది. ఏడాది మూడు సార్లు పార్లమెంట్ సమావేశాలు ఉంటే ఆ మూడు సార్లు మాత్రమే ఎంపీలతో జగన్ భేటీలు ఉంటాయని అనుకోవాలి. మరి సాధారణ వేళల్లో ఎంపీలతో సమావేశాలు నిర్వహించి వారి సాధక బాధకాలు నియోజకవర్గ సమస్యలు పార్టీ అధినేతగా జగన్ తెలుసుకుంటున్నార అంటే జవాబు నిరాశగానే ఉంటుంది. ఇక ప్రతీ లోక్ సభ నియోజకవర్గంలోనూ ఎంపీలకు ఎమ్మెల్యేలకు మధ్య విభేదాలు దాదాపుగా ఉన్నాయని టాక్. అంతే కాదు మంత్రులు తమను అసలు పట్టించుకోవడంలేదు అన్న బాధను కూడా చాలా మంది ఎంపీలు వ్యక్తం చేస్తున్నారు.

మరి ఈ తగాదాలు విభేదాలు తీర్చే ఓపిక తీరికా అధినాయకత్వానికి ఉందా అన్నదే ప్రశ్నగా ఉంది మరి. ఈ మధ్యనే రాజమండ్రీ ఎంపీ భరత్ కి ఎమ్మెల్యే జక్కంపూడికి మధ్య విభేదాలు వచ్చి మీడియా ముఖంగానే ఓపెన్ అయిపోయారు. వారిని పిలిచి ఆ పంచాయతీకి జగన్ ఫుల్ స్టాప్ పెట్టారని అంటారు. మరి పరిస్థితి అంతవరకూ రాకుండా తరచూ ఎంపీలతో ఎమ్మెల్యేలతో జగన్ సమావేశాలు పెడితే పార్టీకి ప్రభుత్వానికి కూడా మేలు అన్న మాట ఉంది. ఇక రెబెల్ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు వ్యవహారమే తీసుకుంటే ఆయన కూడా వైసీపీకి దూరం అవడానికి జగన్ అపాయింట్మెంట్ దొరకకపోవడమే అన్న మాటా ఉంది. ఆయన తన బాధను జగన్ తో పంచుకుంటే జగన్ ఇచ్చే సూచనలు సలహాలతో ఆయన తగ్గి ఉండేవారు. ఆ విధంగా ఆయన పార్టీకి దూరం అయ్యే సీన్ ఉండేది కాదన్నది కూడా పార్టీ వర్గాల మాట. ఏతా వాతా పార్టీ జనాలు చెప్పేది ఏంటి అంటే ఎంపీలతో ఎమ్మెల్యేలతో జగన్ తరచూ సమావేశాలు పెట్టాలని వీలైనపుడు అపాయింట్మెంట్లు ఇవ్వడం ద్వారా గ్యాప్ ని లేకుండా చూసుకోవాలని. మరి అది సాధ్యమే. చూడాలి.