Begin typing your search above and press return to search.

విమానంలో ఇటలీ మహిళ ఓవరాక్షన్.. చివరికి ఏమైంది?

By:  Tupaki Desk   |   31 Jan 2023 5:00 PM GMT
విమానంలో ఇటలీ మహిళ ఓవరాక్షన్.. చివరికి ఏమైంది?
X
విమాన ప్రయాణాలు ఎక్కువగా హైక్లాస్.. ఉన్నత చదువులు చదువుకున్న వారే ఎక్కువగా చేస్తుంటారు. అయితే ఇలాంటి వాళ్లు సైతం ఎర్ర బస్సెక్కే జనాల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవలి కాలంలో విమాన ప్రయాణికులు చేస్తున్న వింత.. అసభ్యకరమైన ఘటనలు చూస్తుంటే ఏంట్రా బాబు.. వీళ్లంతా ఇలా తయారయ్యారు అని అనక మానరు.

ఇటీవల ఓ ప్రయాణీకుడు సీటు కోసం తోటి ప్రయాణికుడిపై ఏకంగా పిడిగుద్దులు గుద్దడం వైరల్ గా మారింది. విమాన సిబ్బంది.. తోటి ప్రయాణికులు వారిని ఆపేందుకు యత్నించిన ఫలితం లేకుండా పోయింది. చివరకు ఆ వివాదం కాస్త పోలీస్ స్టేషన్ కు చేరుకుంది. అలాగే ఎయిర్ ఇండియాలో ఓ వ్యక్తి మహిళపై మూత్ర విసర్జన చేసిన ఘటన సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేసింది.

ఈ సంఘటనలో ఇరువర్గాలను కాంప్రమైజ్ చేసేందుకు ప్రయత్నించి ఎయిర్ ఇండియా విఫలమైంది. దీంతో ఇది కూడా కేసులు.. కోర్టుల వరకు చేరుకుంది. అంతేకుండా ఈ విషయంలో ఎయిర్ ఇండియా నిర్లక్ష్యం వహించినందుకు గాను డీజీసీఏ ఏకంగా 30 లక్షల జరిమానా విధించింది. అంతేకాకుండా ఫైలెట్ ను సస్పెండ్ చేసింది. ఈ ఘటన తర్వాత ఎయిర్ ఇండియా ప్రయాణికులకు ఫైట్లో సరఫరా చేసే మద్యం లిమిట్ అమలు చేసేందుకు నిర్ణయం తీసుకుంది.

తాజాగా ఇలాంటి ఘటన మరోసారి విస్తారా విమానంలో చోటుచేసుకుంది. అబుదాబీ నుంచి ముంబైకి వస్తున్న విస్తారా విమానంలో 45 ఏళ్ల ఇటాలియన్ మహిళ నానా రచ్చ చేసింది. పెరుసియో అనే మహిళ తాను ఎకానమీ క్లాస్ టికెట్ కొని బిజినెస్ క్లాసులో కూర్చునేందుకు ప్రయత్నించింది. అయితే అది సాధ్యం కాకపోవడంతో విమానంలో అసభ్యంగా ప్రవర్తించడంతో అక్కడ ఉన్న వారంతా విస్తుపోయారు.

అర్ధనగ్నంగా విమానంలో అటు ఇటు తిరుగుతూ ఆమె హంగామా చేసింది. విమానంలోని సిబ్బంది ఎంత నచ్చజెప్పినా వినలేదు. అంతేకాకుండా తనను అడ్డుకున్న సిబ్బందిపై దాడికి యత్నించింది. దీంతో విమానం ముంబైకి చేరుకున్న తర్వాత సిబ్బంది ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న ముంబై పోలీసులు ఇటాలియన్ మహిళను అరెస్టు చేశారు. విమానంలోని తోటి ప్రయాణీకుల భద్రతా దృష్ట్యా ఆమెకు విమాన సిబ్బంది నచ్చజెప్పారని అయినా ఆమె వినలేదని వివరించారు. విమానయన సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించడంతో నిబంధనల ప్రకారంగానే ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు విస్తారా సంస్థ పేర్కొంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.