ఏపీలో ఆ వైసీపీ ఎమ్మెల్యేను ఫాలో అయితే మంచిది

Mon May 03 2021 11:00:01 GMT+0530 (IST)

It would be better to follow that YCP MLA in AP

చూస్తుండగానే ఏపీలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఆదివారం ఒక్కరోజులో ఏపీలో 24వేల కేసులు నమోదయ్యాయంటే.. ఎంతటి దారుణ పరిస్థితి నెలకొందన్నది ఇట్టే అర్థమవుతుంది. ఆసుపత్రుల్లో బెడ్ల కొరత.. అవసరమైన ఆక్సిజన్ లేకపోవటం.. ఇలా చెప్పుకుంటూ పోతే సమస్యలు చాంతాడంతగా ఉన్నాయి. గతంలో ఎప్పుడు ఎదురుకాని ఇబ్బందుల్ని ప్రజలు ఎదుర్కొంటున్నారు.పెరిగిపోతున్న కేసుల నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన అంతకు రెట్టింపుగా ఉంటోంది. ఇలాంటివేళ.. తెనాలి వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ వినూత్నంగా వ్యవహరిస్తున్నారు. తానుస్వయంగా రంగంలోకి దిగి.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకుంటున్నారు. ఆసుపత్రుల్లో సౌకర్యాలు ఎలా ఉన్నాయి? బాగా చూస్తున్నారా? మందులు ఇస్తున్నారా? భోజనం ఎలా ఉంది? లాంటి వివరాల్ని తెలుసుకుంటూ వారికి ధైర్యం చెబుతున్నారు.

ఎవరైనా తమకు ఫలానా సమస్య ఉందని చెబితే.. వారి సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తున్న వైనం అందరిని ఆకర్షిస్తోంది. ప్రతిరోజు గంట పాటు కొవిడ్ బాధితులతో స్వయంగా మాట్లాడే కార్యక్రమాన్ని ఆయన నిర్వహిస్తున్నారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి ఫోన్ నెంబర్లను సేకరించి.. వారిలో ధైర్యం నూరటానికి ప్రయత్నిస్తున్నారు. తన నియోజకవర్గ పరిధిలో తెనాలి ఎమ్మెల్యే చేపట్టిన చర్యలు అందరిని ఆకర్షిస్తున్నాయి. కేసుల సంఖ్య అంతకంతకూ ఎక్కువ అవుతున్న వేళ.. మిగిలిన ఎమ్మెల్యేలు కూడా ఇలాంటి విధానాల్ని అమలు చేయటం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.