Begin typing your search above and press return to search.

ఆంధప్రదేశ్ చరిత్ర లో ఇది బ్లాక్‌ డే : మంత్రి బుగ్గన

By:  Tupaki Desk   |   23 Jan 2020 5:41 AM GMT
ఆంధప్రదేశ్ చరిత్ర లో ఇది బ్లాక్‌ డే : మంత్రి బుగ్గన
X
ఏపీలో మూడు రాజధానుల అంశంపై పరిణామాలు క్షణక్షణం మారిపోతున్నాయి. సీఆర్డీఏ రద్దు, రాజధాని వికేంద్రీకరణ బిల్లులను మండలి ఛైర్మన్ షరీఫ్ సెలెక్ట్ కమిటీకి పంపించడం పై తీవ్ర దుమారం రేగుతోంది. ఈ నేపథ్యంలో మండలిలో నెలకొన్న పరిణామాలపై మంత్రులు బొత్స నారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి ఇవాళ బ్లాక్ డే కంటే ఘోరమైన రోజని అన్నారు రాజేంద్ర నాథ్. చంద్రబాబు గ్యాలరీ లో కూర్చొని కౌన్సిల్‌ను ప్రభావితం చేశారన విరుచుకుపడ్డారు. ఛైర్మన్ రూల్స్‌కి విరుద్ధంగా సెలెక్ట్ కమిటీకి పంపించారని మండి పడ్డారు.

కాగా, మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపాలని మండలి చైర్మన్ షరీఫ్ నిర్ణయించారు. తనకున్న విచక్షాధికారాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చైర్మన్ షరీఫ్ వెల్లడించారు. అయితే, చైర్మన్ నిర్ణయాన్ని అధికార వైసీపీ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతో మండలిలో తీవ్ర గందరగోళం నెలకొంది.ఇక బుధవారం శాసనమండలిలో ఏపీ వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్‌ కమిటీ కి పంపిన అనంతరం అసెంబ్లీ వద్ద మీడియాతో మాట్లాడిన మంత్రి బుగ్గన టీడీపీ నేతలపై , చంద్రబాబు పై మండిపడ్డారు. చట్టసభలపై ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకు ఏమాత్రం గౌరవం లేదు. శాసనమండలి గ్యాలరీ నుంచి చైర్మన్‌కు డైరెక్షన్‌ ఇచ్చి, వికేంద్రీకరణ బిల్లును అడ్డుకున్నారు అంటూ ఆరోపణలు చేసారు.

వంద సంవత్సరాల చరిత్ర చూసి.. ప్రభుత్వం రెండు బిల్లులను తీసుకొచ్చింది. శాసనసభ ఆమోదించినా మండలి వ్యతిరేకించడం రాజ్యాంగ విరుద్ధం అని అన్నారు. అన్ని ప్రాంతాలకూ సమానంగా పాలన వ్యవస్థ ఉండాలనుకున్నామంటూ ఆలస్యం చేసేందుకే బీఏసీ నిర్ణయాన్ని విస్మరించారని టీడీపీపై విమర్శలు గుప్పించారు. బిల్లులను ఉద్దేశ పూర్వకంగానే సెలెక్ట్‌ కమిటీకి పంపారన్నారు. రూల్‌- 71ని అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలు డ్రామాలు ఆడారన్న ఆయన, వాస్తవానికి రూల్‌ 71 అనేది ఎక్కడా లేదని తెలిపారు. అలాగే 13 జిల్లాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చిత్తశుద్ధి తో నిర్ణయం తీసుకున్నారు.. ఆ తర్వాత శాసనసభలో 90 శాతం మెజారిటీతో ఆమోదించిన బిల్లులను మండలిలో ఎలా అడ్డుకుంటారు? అని బుగ్గన మండి పడ్డారు.