అయ్యో రామచంద్రా : వైసీపీకి అంత వీజీ కాదుట...

Thu Jun 30 2022 13:00:01 GMT+0530 (IST)

It is Not Easy For YSRCP Party

వచ్చే ఎన్నికల్లో 151 సీట్లేంటి మరీ చీప్ గా ఏకంగా 175 సీట్లూ మా సొంతమే. ఇది గత కొన్నాళ్ళుగా బడా వైసీపీ నేతల నోట వినిపిస్తున్న మాట.  ఏ పార్టీలోనైనా నాయకులకు నమ్మకం ఉండాలి  కానీ అది అతి నమ్మకంగా మారుతోంది అని ఇపుడు వైసీపీలోనే అంతా అంటున్నారు. వైసీపీ గెలుపు విషయంలో ఇప్పటికే సీనియర్ మోస్ట్ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇండైరెక్ట్ గా అధిష్టానానికి గట్టి సూచనలు చేశారు. ఒక విధంగా ఆయన తన అనుభవాన్ని రంగరించి మరీ కొన్ని విషయాలు చెప్పి వార్నింగ్ బెల్స్ పంపించారు.చంద్రబాబును ఏ మాత్రం తక్కువ అంచనా వేయవద్దు. ఆయన ఎన్నికల్లో గెలుపు కోసం ఏమైనా చేస్తారు అందువల్ల  వైసీపీ పెద్దలు అప్రమత్తంగా ఉండాలి అని భీష్మాచార్యుని తరహాలో పెద్దాయన జగన్ కి సలహా ఇచ్చారు. అంతా బాగుంది అని ధీమా అసలు పనికి రాదు అని కూడా మేకపాటి వారు చెప్పుకొచ్చారు. అంతా కష్టపడితేనే వచ్చే ఎన్నికల్లో విజయం అని కూడా ఆయన అంటున్నారు.

ఇపుడు దానికి కొనసాగింపుగా మరో సీనియర్ నేత మూడున్నర దశాబ్దాల రాజకీయ జీవితాన్ని పండించుకున్న నేత వైసీపీ ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య కూడా ఇంచుమించుగా అదే మాట చెప్పారు. జగన్ సొంత గడ్డ కడప గడపలోనే రామచంద్రయ్య  అన్న మాటలు వింటే వైసీపీ నేతలు అంతా ఒకసారి ఆలోచించుకుంటారు అనిపిస్తోంది.

ఉమ్మడి కడప జిల్లా రాయచోటిలో తాజాగా  జరిగిన పార్టీ ప్లీనరీ వేదికగా రామచంద్రయ్య మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు అంత సులభం కాదని తేల్చేశారు. వచ్చే ఎన్నికల్లో విజయం కోసం అతి పెద్ద యుద్ధమే జరుగుతుందని ఆయన చెప్పుకొచ్చారు. పోలింగ్ బూతుల వద్ద జరిగే ఆ యుద్ధం మామూలుగా ఉండదని కూడా ఆయన అంటున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ గెలవడం అన్నది సింపుల్ గా జరిగే పని కాదని ఆయన అన్నారు. వైసీపీ వచ్చే ఎన్నికల్లో గెలవాలీ అంటే పార్టీ నాయకులు క్షేత్ర స్థాయిలో ప్రజలతో మమేకం కావాలని ప్రభుత్వం మీద పార్టీ మీద వారు నమ్మకం కలిగించాలని రామచంద్రయ్య సూచించారు.

ఆయన మరో మాట కూడా అన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షమే లేదని ఇదే పరిస్థితి దేశంలో కూడా ఉందని ఉదహరించారు. అయితే అసలు సమస్యల్లా ప్రజలు వారి కోరికలేనని విశ్లేషించారు. ప్రజలు ఎక్కువ అయ్యారు. వారి కోరికలు కూడా బాగా పెరిగాయి. ఈ సమయంలో వాటిని తీర్చడం ఎవరికైనా కష్టసాధ్యమే అని కూడా రామచంద్రయ్య పేర్కొన్నారు.

ఏది ఏమైనా రామచంద్రయ్య విశేష అనుభవం ఉన్న వారు. పెద్ద మనిషి. ఏదో రాజకీయం కోసమో ఎవరి మెప్పు కోసమో అల్లరిగా చిల్లరగా ఆయన మాట్లాడరు అందువల్ల ఆయన అన్న మాటలను ఒకటిని పదిసార్లు వైసీపీ అధినాయకత్వం ఆలోచించాల్సిందే అంతే తప్ప 175 సీట్లు మావే అని చంకలు గుద్దుకుంటే మాత్రం ముక్కు గోడకు గుద్దేయడం ఖాయమని వైసీపీ శ్రేయోభిలాషులు కూడా సలహా ఇస్తున్నారు.