Begin typing your search above and press return to search.

అర్థరాత్రి వేళ వైజాగ్ లో అంత ఆరాచకం జరిగిందా?

By:  Tupaki Desk   |   5 Jun 2023 12:22 PM GMT
అర్థరాత్రి వేళ వైజాగ్ లో అంత ఆరాచకం జరిగిందా?
X
విశాఖపట్నంలో ఒక ఖరీదైన స్థలంలో అధిపత్యం కోసం రెండు వర్గాలు చేసిన ప్రయత్నాలు అరాచకాన్ని తలపించేలా మారాయని చెబుతున్నారు. అత్యంత విలువైన స్థలంలో ఆదివారం అర్థరాత్రి వరకు సాగిన పరిణామాలు షాకింగ్ గా మారాయి. అన్నింటికి మించి అంత జరుగుతున్నా పోలీసులు కిమ్మనకుండా ఉండిపోయినట్లు చెబుతున్నారు.

దీంతో.. సదరు భూమి చుట్టు ఉన్న ప్రాంతాల్లోని వారు తీవ్రమైన భయాందోళనకు గురైనట్లుగా చెబుతున్నారు. ఇంతకూ అసలేం జరిగింది? అంతటి అరాచకం జరిగిన ప్రాంతం ఏమిటి? అన్న వివరాల్లోకి వెళితే..

విశాఖలోని 98వ వార్డు షిప్ యార్డు లేఅవుట్ లోని ఒక వివాదాస్పద స్థలం ఉంది. దీనికి సంబంధించి ఒక వర్గం వారు సిమెంట్ స్తంభాల్ని పాతారు. దీంతో.. ఈ విషయాన్ని తెలుసుకున్న కొందరు యువకులు టీంలుగా ఏర్పడి అక్కడ పాతిన సిమెంట్ స్తంభాల్ని తొలగించి.. కరెంటు లైట్లను పగలగొట్టి.. అక్కడే ఉన్న జనరేటర్ ను తగలబెట్టిన వైనం షాకింగ్ గా మారింది. ఆదివారం రాత్రి నుంచి అర్థరాత్రి వరకు ఈ ఆరాచకం సాగినా పోలీసులు పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి.

ఇదే స్థలంలో మే 31 కూడా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మే 31న మంత్రి అమర్ నాత్.. ఎమ్మెల్యే అదీప్ రాజ్ అనుచరులమని చెప్పుకుంటూ కొందరు బీభత్సాన్ని క్రియేట్ చేయగా.. అర్థరాత్రి దాటిన తర్వాత రోటీన్ రౌండ్స్ కు వచ్చే పోలీసుల్ని చూసి పరారయినట్లుగా చెబుతున్నారు. ఈ వివాదాస్పద స్థలంలో ఆదివారం ఉదయాన్నే ఇరు వర్గాల వారు తమ అనుచరులతో చేరుకున్నారు.

ఒక వర్గం వారు ఉదయం నుంచి సాయంత్రం వరకు టెంట్ వేసుకొని కూర్చున్నారు. ప్రొక్లెయిన్ తీసుకొచ్చి స్థలాన్ని చదును చేసేందుకు ప్రయత్నిస్తే.. మరో వర్గం వారు అడ్డుకున్నారు.

దీంతో వాగ్వాదం చోటు చేసుకుంది. సాయంత్రం 4 గంటల వేలలో సదరు వర్గం వారు పెద్దసంఖ్యలో చేరుకొని ఇతరులను అడ్డుకున్నారు. ఇదిలా ఉంటే.. రాత్రి పదిన్నర వేళలో మరో వర్గానికి చెందిన వారు అక్కడకు వచ్చి.. పాతినస్తంభాల్ని.. జనరేటర్ ను కాల్చేశారు.

దీంతో.. ఈ స్థలం మీద వివాదం కోర్టులో ఒక కొలిక్కి వచ్చే వరకు.. ఎలాంటి దారుణాలు చోటు చేసుకోకుండా పోలీసులు పికెట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. అయితే.. పోలీసుల వెర్షన్ మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఘర్షణకు సంబంధించి తమకు ఎలాంటి కంప్లైంట్ అందలేదని.. ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని పెందుర్తి సీఐ అప్పారావు చెప్పటం గమనార్హం.