Begin typing your search above and press return to search.

బీఆర్ఎస్ కు సన్ స్ట్రోకులు తప్పవా ?

By:  Tupaki Desk   |   29 May 2023 11:37 AM GMT
బీఆర్ఎస్ కు సన్ స్ట్రోకులు తప్పవా ?
X
రాబోయే ఎన్నికల్లో కేసీయార్ కు భిన్నకోణాల్లో సమస్యలు తప్పేట్లు లేదు. పొంచి ఉన్న అనేక సమస్యల్లో సన్ స్ట్రోకులు కూడా కీలకమైనదే అని టాక్ నడుస్తోంది. చాలామంది మంత్రులు, ఎంఎల్ఏల వారసులు రాబోయే ఎన్నికల్లో పోటీచేయటానికి రెడీ అవుతున్నారు. తండ్రుల పదవులను అడ్డంపెట్టుకుని కొందరు వారసులు తమ నియోజకవర్గాల్లో మొత్తం ఊడ్చిపారేస్తున్నారట. దాంతో మంత్రులతో పాటు వారసులపైన కూడా నియోజకవర్గాల్లో విపరీతమైన వ్యతిరేకత పెరిగిపోతోందన్న విషయం సర్వేల్లో బయపడిందట.

అందుకనే వారసులకు టికెట్లు కావాలని పట్టుబడుతున్న చాలామందికి కేసీయార్ నో చెప్పేస్తున్నట్లు సమాచారం. తాను చేయించుకున్న సర్వేల్లో వారసులకు బాగా బ్యాడ్ ఇమేజి ఉందని అందుకని టికెట్ ఇచ్చినా గెలుపు కష్టం కాబట్టి ఈసారికి మీరే పోటీచేయాలని మంత్రులకు కేసీయార్ గట్టిగా చెబుతున్నారట. అసెంబ్లీ స్పీకర్, శాసనమండలి ఛైర్మన్ గా ఉన్న పోచారం శ్రీనివాసులరెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా వారసులకు టికెట్లివ్వాలని పట్టుబడుతున్నారు.

అయితే వారసులకు టికెట్లిచ్చేది లేదని చెప్పి పోచారంనే పోటీచేయమన్నారట కేసీయార్. గుత్తా విషయంలో కూడా కేసీయార్ నో చెప్పినట్లు సమాచారం. వీళ్ళు కాకుండా వరంగల్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని మంత్రులు కూడా వారసులకు టికెట్లు ఇవ్వాలని గట్టిగానే పట్టుబడుతున్నారట. అయితే అందుకు కేసీయార్ ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది.

రాబోయే ఎన్నికలు పార్టీకి చాలా కీలకమైనవని కాబట్టి వారసులకు టికెట్లిచ్చి గెలుపులో ఛాన్స్ తీసుకునే సమస్యేలేదని కేసీయార్ తెగేసి చెబుతున్నారట.

మరికొందరికైతే సర్వే రిపోర్టును చూపిస్తున్నారట. వాళ్ళ వారసులకు ఉన్న ఇమేజి ఏమిటో వివరించి చెబుతున్నారట. దాంతో ఇటు కేసీయార్ ను కన్వీన్స్ చేయలేక అటు వారసుల ఒత్తిళ్ళను తట్టుకోలేక మంత్రులు, ఎంఎల్ఏలు నానా అవస్తలు పడుతున్నారు. ఒక మంత్రయితే అల్లుడికి ఎంపీ టికెట్, కొడుకుల్లో ఒకళ్ళకు ఎంఎల్ఏ టికెట్ ఇవ్వాలని కేసీయార్ ను పదేపదే అడుగుతున్నారట.

వరంగల్ జిల్లాలోని ఇంకో సీనియర్ ఎంఎల్ఏ కూడా కొడుక్కి టికెట్ కావాలని అడిగితే ఇప్పటికే కుటుంబంలో రెండు టికెట్లిచ్చిన కారణంగా కొడుక్కి ఎంఎల్ఏ టికెట్ ఇవ్వటం సాధ్యంకాదని చెప్పేశారట. చూస్తుంటే బీఆర్ఎస్ కు సన్ స్ట్రోకులు తప్పేట్లు లేదు.