Begin typing your search above and press return to search.

జాక్ మా కు డ్రాగన్ షాక్ తప్పదా ?

By:  Tupaki Desk   |   14 Jan 2021 1:30 AM GMT
జాక్ మా కు డ్రాగన్ షాక్ తప్పదా ?
X
ఆలీబాబా కంపెనీల వ్యవస్ధాపకుడు జాక్ మా కు చైనా ప్రభుత్వం తొందరలోనే అతిపెద్ద షాక్ ఇవ్వబోతోందని సమాచారం. ఆలీబాబా కంపెనీతో పాటు యాంట్ గ్రూపులోని కంపెనీలన్నింటినీ డ్రాగన్ ప్రభుత్వం జాతీయం చేసేయబోతోందని తెలుస్తోంది. ఆయన ఆథ్వర్యంలో నడుస్తున్న కంపెనీలన్నింటినీ జాతీయం చేసేసేందుకు చైనా ప్రభుత్వం అవసరమైన చర్యలను తీసుకుంటోంది . జాక్ మా అంటే చైనాలోని అత్యంత సంపదపరుల్లో రెండోవ్యక్తిగా చాలా పాపులారిటి ఉన్నా వ్యక్తి.

ఇటువంటి అపర కుబేరుడి కంపెనీలను చైనా ప్రభుత్వం జాతీయం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ? ఏమొచ్చిందంటే ఆమధ్య మాట్లాడుతూ చైనా ప్రభుత్వంతో పాటు బ్యాంకుల పనితీరుపైన నెగిటివ్ వ్యాఖ్యలు చేశారు. బ్యాంకుల రుణాలు, వాసూళ్ళు తదితరాలపై ప్రభుత్వ పెత్తనం నడుస్తోందని జాక్ చేసిన వ్యాఖ్యలు చైనాలో సంచలనంగా మారింది. అంతేకాకుండా చైనా బ్యాంకింగ్ రెగ్యులేటరీ సంస్ధను ముసలోళ్ళ క్లబ్బుగా అభివర్ణించారు.

మామూలుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా, తీవ్రమైన ఆరోపణలు చేసినా ఆ తర్వాత నుండి సదరు వ్యక్తి జనజీవనస్రవంతిలో ఎక్కడా కనబడరనే ప్రచారం అందరికీ తెలిసిందే. కరోనా వైరస్ నేపధ్యంలో చైనాలోని ల్యాబులపై అనుమానాలు వ్యక్తం చేసిన డాక్టర్లు, శాస్త్రవేత్తల్లో కొందరు గడచిన ఎనిమిది మాసాలుగా అడ్రస్సే కనబడటం లేదట. అలాగే కరోనా వైరస్ కు చైనా ప్రభుత్వమే కారణమని ఆరోపణలు చేసిన ఒకరిద్దరు పాత్రికేయులు కూడా మళ్ళీ ఎక్కడా కనబడలేదు.

ఇటువంటి నేపధ్యంలోనే ప్రభుత్వంతో పాటు బ్యాంకింగ్ వ్యవస్ధలపై జాక్ మా చేసిన ఆరోపణలు, వ్యాఖ్యలు సంచలనంగా మారింది. మరి ఆ తర్వాత ఏమైందో ఎవరికీ తెలీదు కానీ జాక్ మా మాత్రం గడచిన మూడు నెలలుగా ఎక్కడా కనబడటం లేదు. ఆఫీసులకు రావటం లేదు. ముందుగానే నిర్ణయమైన కార్యక్రమాలు కూడా రద్దయిపోయాయి. విదేశాలకు వెళ్ళినట్లు కూడా ఎక్కడా ఆధారాలు లేవు. జాక్ మా కూడా మాయమైపోయారా అనే చర్చలు జోరుగా సాగుతున్న నేపధ్యంలోనే ఆయన కంపెనీలను చైనా ప్రభుత్వం జాతీయం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించటం సంచలనంగా మారింది.