Begin typing your search above and press return to search.

టీడీపీ-వైసీపీ మధ్య తేడా ఇదేనా ?

By:  Tupaki Desk   |   19 March 2023 8:00 AM GMT
టీడీపీ-వైసీపీ మధ్య తేడా ఇదేనా ?
X
ఎంఎల్సీ ఎన్నికల గెలుపోటముల్లో స్పష్టంగా తేడా బయటపడింది. టీడీపీ గెలుపులో పట్టుదల, కసి కనిపించాయి. ఇదేసమయంలో వైసీపీలో నిర్లక్ష్యం, ఓవర్ కాన్పిడెన్స్ స్పష్టంగా బయటపడింది. రెండుపార్టీల్లోని ఈ లక్షణాలే గెలుపోటములను నిర్దేశించాయి. 2019 ఎన్నికల్లో గెలుపుతో మొదలైన వైసీపీ విజయయాత్ర స్ధానికసంస్ధల ఎంఎల్సీ ఎన్నికల గెలుపు దాకా సాగింది. ఇదే సమయంలో గ్రాడ్యుయేట్లు, టీచర్ల నియోజకవర్గాల ఎన్నికల్లో విపరీతమైన నిర్లక్ష్యం, ఓవర్ కాన్ఫిడెన్సే పార్టీకి మిశ్రమ ఫలితాలను అందించింది.

ఈ ఐదు ఎన్నికల్లోను కీలకమైనది ఎలక్షనీరింగ్ అనేచెప్పాలి. ఇందులో వైసీపీ ఫెయిలైతే టీడీపీ సక్సెస్ అయ్యింది. ఎలక్షనీరింగ్ అంటే ఓటర్ల జాబితాలను చెక్ చేసుకోవటం, తమకు ఖాయంగా ఓట్లేస్తారని అనుకున్న వాళ్ళ ఓట్లు జాబితాలో ఉండేట్లు చూడటం, ఒకటికి పదిసార్లు ఓటర్లను కలవటం, ప్రచారం చేయటం, పోలింగ్ రోజున ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు వచ్చేట్లుగా చూడటంలో మంత్రులు, ఎంఎల్ఏలు, నేతలంతా ఫెయిలయ్యారనే చెప్పాలి.

రెండు టీచర్ల నియోజకవర్గాల్లో గెలిచిన అభ్యర్ధులు వ్యక్తిగతంగా బలమైన అభ్యర్ధులు. పైన చెప్పిన ఎలక్షనీరింగును వాళ్ళు సొంతంగా చేసుకున్నారు కాబట్టే వైసీపీ గెలిచింది. ఉత్తరాంధ్రలో గ్రాడ్యుయేట్ అభ్యర్ధిగా పోటీచేసిన సీతంరాజు సుధాకర్ కు ఓట్లేసేందుకు వెళ్ళిన చోడవరం ఎంఎల్ఏ కరణం ధర్మశ్రీ కుటుంబం ఓట్లే గల్లంతయ్యాయంటే ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్ధమైపోతుంది. ధర్మశ్రీ కుటుంబంలో 14 ఓట్లున్నాయి. సాక్ష్యాత్తు ఎంఎల్ఏతో పాటు ఆయన కుటుంబం ఓట్లే గల్లంతైపోయాయంటే ఇక మామూలు ఓటర్ల సంగతేమిటి ?

ఇదే సమయంలో టీడీపీ గ్రామస్ధాయి నేత నుండి మాజీమంత్రులు, మాజీ ఎంఎల్ఏలు, నేతలంతా ఒక టీమ్ స్పిరట్ తో పనిచేశారు. పైన చెప్పిన ఎలక్షనీరింగును కచ్చితంగా ఫాలో అయ్యారు. ఈ ఎన్నికల్లో కూడా ఓడిపోతే నేతలు, కార్యకర్తల మోరేల్ దెబ్బతినేస్తుందన్న కారణంతో పట్టుదలగా తమ్ముళ్ళంతా విజయమో వీరస్వర్గమో అన్నట్లుగా పోరాడారు. వీళ్ళ పోరాటానికి అభ్యర్ధుల వ్యక్తిగత ఇమేజి, జనసేన, వామపక్షాల సహకారం, ప్రభుత్వంపై వ్యతిరేకత టీడీపీకి కలిసొచ్చింది. మొత్తానికి ఎంఎల్సీ ఎన్నికల గెలుపోటములో రెండుపార్టీల మధ్య తేడా ఏమిటో అందరికీ తెలిసొచ్చింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.