జమ్ముకశ్మీర్ విషయంలో మోడీ కొత్త ఆలోచన నిజంగా ఇదేనా?

Mon Jun 14 2021 09:00:04 GMT+0530 (IST)

Is this really Modi new idea in the case of Jammu and Kashmir?

ఇటీవల కాలంలో వార్తల్లో కనిపించకుండా పోయిన జమ్ముకశ్మీర్ రాష్ట్రం రెండు.. మూడు రోజులుగా ప్రధాన వార్తాంశంగా మారటం తెలిసిందే. దశాబ్దాల తరబడి సాగుతున్న కశ్మీర్ ఇష్యూకు సర్జరీ చేసిన చందంగా రాష్ట్రంగా ఉన్న కశ్మీర్ ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చటం.. ఆర్టికల్ 370 సుప్తచేతనావస్తలో ఉంచటం లాంటి సంచలన నిర్ణయాల్ని కేంద్రంలోని మోడీ సర్కారు తీసుకోవటం తెలసిందే.దేశంలోని మరే రాష్ట్రానికి లేని జమ్ముకశ్మీర్ ప్రత్యేక హోదాను పక్కన పెట్టేయటం తెలిసిందే. ఈ నిర్ణయానికి యావత్ దేశం సానుకూలంగా స్పందించింది. జమ్ముకశ్మీర్ లో మాత్రం భిన్నమైన స్పందన లభించింది. జమ్ములో సానుకూలత వ్యక్తమైతే.. కశ్మీర్ వ్యాలీలో మాత్రం వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నిర్ణయాన్ని కశ్మీర్ కు చెందిన ప్రాంతీయ పార్టీలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేయటం తెలిసిందే.

అంతేకాదు.. జమ్ముకశ్మీర్ ప్రత్యేక హోదా తొలగింపును వ్యతిరేకిస్తూ ఇక్కడి ఏడు పార్టీలు కలిసి ‘‘గుప్కార్’’ కూటమిగా ఏర్పడి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళాన్ని వినిపిస్తున్నారు. మోడీ సర్కారు రద్దు చేసిన ఆర్టికల్ 370ను తిరిగి పునరుద్దరించటమే లక్ష్యమని పేర్కొన్నారు. ఈ వాదనపై దేశంలోని మరే పార్టీ స్పందించని వేళ.. తొలిసారి కాంగ్రెస్ సీనియర్ నేత ద్విగ్విజయ్ సింగ్ తాజాగా.. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక హోదాను కల్పించేలా నిర్ణయం తీసుకుంటామని.. మోడీ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటామని చెప్పి కొత్త కలకలానికి తెర తీశారు.

ఇదిలా ఉంటే.. జమ్ముకశ్మీర్ విషయంలో ప్రధాని మోడీ ఆలోచనలు కూడా మారుతున్నట్లుగా కొత్త వాదన ఒకటి మొదలైంది. దీనికి సంబంధించిన కథనాలు తాజాగా జాతీయ మీడియాలో రావటం గమనార్హం. ఇదంతా చూస్తే.. కావాలనే ఇదంతా జరుగుతుందా? లేదంటే కాంగ్రెస్ కు చెక్ పెట్టేందుకు వీలుగా.. వారి బాటలోకి తాము వెళుతున్నట్లుగా లీకులు ఇవ్వటం ద్వారా ప్రజల్లో వచ్చే స్పందన ఆధారంగా నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. నిజానికి జమ్ముకశ్మీర్ విషయంలో ఆర్టికల్ 370 అన్నది ముగిసిన అధ్యాయం. కానీ.. దాన్ని మళ్లీ కెలకటం ద్వారా లేని తలనొప్పిని తెచ్చి పెట్టుకోవటమేనని చెప్పక తప్పదు.

అయితే.. మోడీ సర్కారు జమ్ముకశ్మీర్ కు ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంత హోదా నుంచి రాష్ట్రంగామార్చేందుకు సుముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు. అందులో భాగంగా కశ్మీరీ పార్టీలతో భేటీకి ఆయన సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో.. గుప్కార్ కూటమి కూడా కేంద్రంతో చర్చలకు సుముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి. ఇప్పటికే బ్లాక్ బస్టర్  కొట్టిన మూవీకి కొన్ని మార్పులు చేసి మళ్లీ రిలీజ్ చేస్తామన్నట్లుగా మోడీ తాజా నిర్ణయం ఉంటుందా? అన్నది సందేహంగా మారింది. దీనికి కాలమే సరైన సమాధానం ఇవ్వాలి.