Begin typing your search above and press return to search.

వైసీపీలో పరిణామాలపై వైఎస్‌ జగన్‌ ప్లాన్‌ ఇదేనా?

By:  Tupaki Desk   |   4 Feb 2023 5:00 AM GMT
వైసీపీలో పరిణామాలపై వైఎస్‌ జగన్‌ ప్లాన్‌ ఇదేనా?
X
వైసీపీకి కంచుకోట జిల్లాల్లో ఒకటైన నెల్లూరు జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం జగన్‌ దృష్టి సారించారు. గత ఎన్నికల్లో పదికి పది అసెంబ్లీ స్థానాలను నెల్లూరు జిల్లాలో వైసీపీ గెలుచుకుంది. అలాంటి జిల్లాలో తన సొంత సామాజికవర్గానికే చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు అసంతృప్తి బాటపట్టడం, నేరుగా ప్రభుత్వాన్ని, పార్టీ అధిష్టానాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తుండటంపై జగన్‌ అప్రమత్తమయ్యారు.

వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు సాధించాలని లక్ష్యంగా జగన్‌ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ దిశగా ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు కార్యాచరణ నిర్దేశించారు. ఎన్నికలకు చాలా ముందుగానే ఆరు నెలల క్రితమే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించేశారు. ఎమ్మెల్యేలను, నియోజకవర్గ ఇంచార్జులను గడప గడపకు పంపుతున్నారు. మరోవైపు జగన్‌ సైతం వివిథ పథకాల లబ్ధిని జమ చేయడానికి వివిధ జిల్లాల్లో పర్యటించి భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మరోమారు తమకు అఖండ విజయం చేకూర్చాలని ప్రజలను కోరుతున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో సొంత పార్టీలోనే, అందులోనూ సొంత సామాజికవర్గం రెడ్ల నుంచే ప్రభుత్వంపైన, తనపైన వ్యక్తమవుతున్న వ్యతిరేకతపై సీరియస్‌ గా దృష్టి సారించాలని జగన్‌ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది, ఈ నేపథ్యంలోనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆనం రామనారాయణరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరికి నేదురుమల్లి రాంకుమార్‌ రెడ్డిని, కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నెల్లూరు రూరల్‌ కు ఆదాల ప్రభాకర్‌ రెడ్డిని ఇంచార్జులుగా ప్రకటించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాలను కూడా వీళ్లే నిర్వహిస్తారని తద్వారా తేల్చిచెప్పినట్టయింది.

మరోవైపు వైసీపీ ముఖ్య నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డిలతోపాటు 26 జిల్లాలకు సంబంధించి వైసీపీ కోఆర్డినేటర్లతో సీఎం జగన్‌ తాజాగా సమావేశమయ్యారు.

ఇటీవల నిర్వహించిన 'జయహో బీసీ' సదస్సు తరహాలోనే మిగతా కులాల సదస్సులను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని జగన్‌ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పలు విషయాల్లో వారిని అప్రమత్తం చేశారు. జయహో బీసీ తరహాలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సదస్సుల నిర్వహణపై యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించాలని ఆదేశించారు.

పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని పార్టీ రీజినల్‌ కోఆర్డినేటర్లకు సూచించారు. గతంలో నిర్దేశించుకున్న మేరకు సాధ్యమైనంత త్వరగా గృహ సారథులు, సచివాలయ కన్వీనర్ల నియామకాలు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రక్రియలో వెనకబడిన నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని కోరారు. ఈ మేరకు స్థానిక నేతలతో సమావేశాలు ఏర్పాటు చేసి.. నియామకాలు పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని నిర్దేశించారు. ముఖ్యంగా నియోజకవర్గాల్లో పార్టీ పరంగా నెలకొన్న చిన్నచిన్న అంతర్గత లోపాలను పరిష్కరించడంపై దృష్టి సారించాలని చెప్పారు.

అప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోతే తన దృష్టికి తీసుకురావాలని నేతలకు జగన్‌ దిశానిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలంటే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు మరింత సీరియస్‌గా తీసుకోవాల్సిందేనని జగన్‌ తేల్చిచెప్పారు.

ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ విధానాలను ప్రజలకు చేరువ చేసేందుకు ప్రచార కార్యక్రమాలపై కూడా దృష్టి పెట్టాలని సూచించారు. ఈ విషయంలో పార్టీ నాయకులు, యంత్రాంగం చురుగ్గా పని చేసేలా చూడాలని ఆదేశించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.