వైసీపీ మీద ఇంత వ్యతిరేకత ఉందా....?

Fri Mar 17 2023 15:00:01 GMT+0530 (India Standard Time)

Is there so much Negativity to YCP?

తెలియడం లేదు కానీ వైసీపీ మీద ఒక రేంజిలో జనాల్లో వ్యతిరేకత అయితే  ఉంది. సర్వేలు పలు రకాలుగా దాన్ని ఎక్కడో ఒకచోట ప్రతీ రోజూ బయట పెడుతూనే ఉన్నాయి. అయితే అవన్నీ విపక్షాలు సొంత సర్వేలు అని కొట్టిపారేసినా కూడా ఇపుడు ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితాలు చూస్తే కచ్చితంగా అధికార వైసీపీకి జనంలో ఊపిరాడని సీన్ ఉందని అర్ధం అవుతోంది. వైసీపీ నాలుగేళ్ల పాలన పూర్తి అయింది.ఇపుడు స్పష్టమైన మార్పు అయితే కనిపిస్తోంది. విద్యావంతులు అయితే ఇక సహించలేము భరించలేము అంటూ ఏకంగా పోలింగ్ బూతుల వెంట బట్టారు. ఎపుడూ పోలింగ్ కోసం ఓటింగ్ కి రాని విద్యావంతులు ఎర్రటి ఎండలో గంటల తరబడి నిలబడి ఓటేసినపుడే ఏదో జరుగుతోంది అన్న సంకేతాలు అయితే కనిపించాయి.

ఇపుడు ఫలితాలు చూస్తూంటే కచ్చితంగా అధికార పార్టీ మీద యువజనులు మంటెక్కిపోతున్నారు అని అర్ధం అవుతోంది. అంతే కాదు చదువుకుని వివిధ కొలువులలో పనిచేస్తున్న వారు పదవీ విరమణ చేసినవారు. డిగ్రీలు అందుకున్న మహిళలు మేధావులు ఇలా అంతా కూడా ఓటెత్తి తమ సత్తా ఏంటో చూపించారు. ఈ కారణంగానే వైసీపీకి ఇంతటి భంగపాటు ఎదురయింది అని అంటున్నారు.

ఏపీలో మూడు పట్టభద్రుల ఎన్నికలు జరిగితే అందులో రెండింట అద్భుతమైన మెజారిటీతో టీడీపీ దూసుకుపోతోంది అంటే దానికి కచ్చితంగా ఆ పార్టీ చేసుకున్న స్వయంకృతాపరాధం అనే అంటున్నారు. ఎన్నికల ముందు హామీలు ఇవ్వడం కాదు ఇచ్చిన వాటిని ఎంతవరకూ నిలబెట్టుకున్నారు అన్న దాన్ని యువత బేరీజు వేసుకుని మరీ ఓటేశారు అని అర్ధం అవుతోంది. జాబ్ క్యాలెండర్ ని ఏటా జనవరిలో రిలీజ్ చేస్తామని చెప్పిన వైసీపీ ఆ హామీని విస్మరించింది.

ఇక తాము అధికారంలోకి వచ్చాక లక్షా పాతిక వేల పోస్టులను సచివాలయాలలో భర్తీ చేశామని చెప్పుకున్నారు. అయితే వారేనా సంతృప్తిగా ఉన్నారా అంటే లేరు అనే ఈ ఫలితాలు చెబుతున్నాయి. వారు కూడా యాంటీగా వైసీపీకి ఓటేశారు అని అంటున్నారు. వారికి జీతాలు తక్కువ పని భారాలు ఎక్కువగా చేసి త్రిశంకు స్వర్గంలో ఉంచడం వల్లనే వారు ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత పెంచుకున్నారని అర్ధం అవుతోంది.

తన మానసపుత్రికలుగా జగన్ భావించే సచివాలయ ఉద్యోగులు లక్షా పాతిక వేల మంది కూదా ప్రభుత్వానికి సపోర్ట్ గా నిలిస్తే పట్టభద్రుల ఎన్నికల్లో విజయం సులువు అయ్యేది అన్న వారూ ఉన్నారు. ఇక ఏపీలో పెట్టుబడులు లేవు ఉన్న పరిశ్రమలు తరలిపోతున్నాయి. అభివృద్ధి లేదు తమ భవిష్యత్తు ఏంటో అర్ధం కాదు దాంతో ఆగ్రహావేశాలతో రగిలిపోతున్న యువతకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఒక చక్కని అవకాశాన్ని ఇచ్చాయని చెప్పాలి.

అందుకే వైసీపీని రెండు చోట్ల దారుణంగా వెనక్కి నెట్టారు. పశ్చిమ రాయలసీమలో ఫలితం దోబూచులాడుతోంది. ఏది ఏమైనా సార్వత్రిక ఎన్నికకు ఏడాది ముందు ఇలాంటి చేదు ఫలితాలు రావడం అంటే వైసీపీ పెద్దలు ఆలోచించుకోవాల్సిందే అని అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.