‘తెలంగాణ’ పేరుతో ఊరు ఒకటి ఉందా? ఇప్పుడెక్కడ?

Sun Mar 07 2021 14:00:02 GMT+0530 (IST)

Is there a village named 'Telangana'? Where now?

తెలంగాణ రాష్ట్రం అన్నది ఏర్పడి ఏడేళ్లు కూడా కాలేదు.. తెలంగాణ పేరు మీద ఊరు ఉండటం ఏమిటని వాదించేటోళ్లు.. తమ వాదనల్ని పక్కనున్న గొయ్యిలో పూడ్చిపెట్టాల్సిందే. ఎందుకంటే.. దశాబ్దాల తెలంగాణ కల సాకారం కావటం ఒక ఎత్తు అయితే.. తెలంగాణ పేరు మీద ఒక ఊరు ఉందన్న విషయం తాజాగా చారిత్రక సాక్ష్యాలతో వెలికి తీసిన వైనం ఆసక్తికరంగా మారింది.చరిత్రను పరిశీలిస్తే త్రిలింగ దేశం.. తిలింగ రాజ్యం.. తిలింగ్.. తెలింగ.. ట్రిలింగాన్.. ఇలా చాలా పేర్లను పిలిచిన ప్రాంతమే ఇప్పుడు తెలంగాణ. అయితే.. అప్పుడెప్పుడో 600 ఏళ్ల క్రితమే తెలంగాణ అన్న పేరు మాత్రమే కాదు.. తెలంగాణ పురం అన్న పేరుతో ఒక ఊరు ఉందన్న విషయాన్ని ఒక శాసనం రూపంలో లిఖించటం.. దాన్ని తాజాగా గుర్తించటం ఆసక్తికరంగా మారింది. ఒక విధంగా చెప్పాలంటే.. తెలంగాణ అన్న పదాన్ని తొలిసారి 600 ఏళ్ల క్రితమే వాడారన్న విషయం తాజాగా బయటకొచ్చిన శాసనం స్పష్టం చేస్తోంది.

అంటే.. తెలంగాణ అస్తిత్వానికి తొలి నిదర్శనంగా ఈ శాసనాన్ని చెప్పాలి. ఇంతకీ ఈ శాసనం ఎక్కడ ఉంది? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.. ఎక్కడెక్కడో కాదు భాగ్యనగరి శివారు.. అదేనండి హైదరబాద్ మహానగర శివారు సంగారెడ్డికి దగ్గర్లో ఉండే ఇప్పటి తెల్లాపూరే.. అప్పటి తెలంగాణ పురం కావటం విశేషం. ఇప్పుడిది సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం పరిధిలోకి వస్తుంది. తెలంగాణ అన్న పదం కనిపించిన తొలి తెలుగు శాసనంగా దీన్ని చెప్పాలి.

చరిత్రలోకి వెళితే..బహమనీ సుల్తాన్ ఫిరోజ్ షా తన రాజ్యాన్ని విస్తరించేందుకు 1417లో  విజయనగరరాజు రెండో దేవరాయల అధీనంలో ఉన్న పానగల్లు కోట మీద దాడికి బయలుదేరాడు. దారిలో కనిపించిన హిందూ సంప్రదాయ కట్టడాలను ధ్వంసం చేయటం పనిగా పెట్టుకొంది అతడి సైన్యం. ఆ సమయంలో తెల్లాపూర్ ప్రణాళికా బద్దంగా ఎదిగిన పట్టణం. తెలంగాణ పురం పేరుతో ఉన్న ఈ ప్రాంతంలో కొందరు విశ్వ కర్మలు.. మంచి పనిమంతులైన శిల్పులు ఉండేవారు. వారు నగలతోపాటు నగర ప్రణాళికల రూపుకల్పనలోనూ నేర్పు ఉన్న వారు.

ఆ ప్రాంతంలో కొండమీది మల్లోజు.. అతని కొడుకులు నాగోజు.. అయ్యలోజు.. వల్లబోజు తదితరులు పెద్ద మామిడి తోటను నిర్వహించేవారు. తమ ప్రాంతాన్ని ధ్వంసం చేయకుండా ఉండేందుకు ఫిరోజ్ షా భార్యకు బంగారు పూదండలు..  ంగారు గాజులు అందంగా తయారు చేసి బహుమతిగా ఇచ్చారు. ఈ విషయాల్ని వివరిస్తూ మల్లోజు వంశస్తులు చెక్కిన శాసనంలో.. ‘తెలంగాణ పురం’ అంటూ తమ ప్రాంతాన్ని పేర్కొన్నారు. ఈ అచ్చ తెలుగు శాసనాన్ని తెలంగాణ అస్తిత్వానికి నిదర్శనంగా భావించి.. పర్యాటక ప్రాంతంగా డెవలప్ చేయించాల్సిన బాధ్యత సీఎం కేసీఆర్ పైన ఉందని చెప్పక తప్పదు.