Begin typing your search above and press return to search.

ఆగస్టు 15 నాటికి వ్యాక్సిన్ సాధ్యమేనా?

By:  Tupaki Desk   |   4 July 2020 2:30 PM GMT
ఆగస్టు 15 నాటికి వ్యాక్సిన్ సాధ్యమేనా?
X
ప్రపంచవ్యాప్తంగా తలపండిన శాస్త్రవేత్తలంతా కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టే పనిలో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ లో కొందరున్నారు. అయినా కూడా మరో ఏడాది వరకు వ్యాక్సిన్ రెడీ అయ్యే సూచనలు కనిపించడం లేదు. ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్.వో) కూడా ఇప్పట్లో వ్యాక్సిన్ రాదు అని ప్రకటన చేసింది. అయితే ఆశ్చర్యకరంగా తాజాగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) కోవిడ్ -19 వ్యాక్సిన్ స్వాతంత్ర్య దినోత్సవమైన ఆగస్టు 15వ తేదీ నాటికి సిద్ధమవుతుందని చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. హైదరాబాద్ కేంద్రంగా గల ఫార్మా కంపెనీ భారత్ బయోటెక్‌ దీన్ని తయారు చేస్తోందని.. భారత వైరాలజిస్టులు దీనికి సహకారం అందిస్తున్నారని.. టీకా అభివృద్ధికి ఆమోదం లభించిందని తెలిపింది.

ఐసిఎంఆర్ ప్రకటన తర్వాత భారత్ బయోటెక్ స్పందించింది. క్లినికల్ ట్రయల్స్ లో ఫలితాన్ని చూపించడానికి కనీసం 15 నెలలు పడుతుందని పేర్కొంది. ఐసిఎంఆర్ నిర్ణయించిన గడువు కేవలం 40 రోజులు మాత్రమే ఉంది. క్లినికల్ ట్రయల్స్ కోసం, క్లినికల్ ట్రయల్ రిజిస్ట్రీ ఆఫ్ ఇండియా (సిటిఆర్ఐ) నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించాలి. భారత్ బయోటెక్ రెండు దశల్లో ఈ ట్రయల్స్ ప్లాన్ చేసింది.

ట్రయల్స్ కోసం హైదరాబాద్ సంస్థకు 1,125 వాలంటీర్లు అవసరం. వారిని గుర్తించడం.. నియమించడం అంత తేలికైన పని కాదు. పూర్తి ఆరోగ్యంగా ఫిట్ గా ఉండాలి. ఇది పూర్తయినప్పటికీ, వలంటీర్లపై వ్యాక్సిన్ ప్రభావం వచ్చే ఆరు నెలల వరకు ఎటువంటి ఫలితాన్ని చూపించదు. ఇవన్నీ ప్రామాణిక విధానాలు. ఐసిఎంఆర్ తన ప్రకటనతో భారత్ బయోటెక్ ను ఇబ్బందుల్లోకి నెట్టే పరిస్థితికి దిగజార్చిందని నిపుణులు అంటున్నారు.

వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసే సంస్థలపై ఐసిఎంఆర్ ఒత్తిడి పెడితే, అది సంభావ్య ప్రమాదానికి.. మరింత గందరగోళానికి దారితీస్తుందని అన్ని నిపుణులందరూ హెచ్చరిస్తున్నారు. ప్రయోగ ఫలితాలు తేడా కొడితే ఆగమాగం రిలీజ్ చేస్తే అందరికీ ప్రమాదమని.. వ్యాక్సిన్ తయారీకి సమయం తీసుకోవాలని సూచిస్తున్నారు.