Begin typing your search above and press return to search.

హాట్ టాపిక్: బైడన్ కు కమలాకు పడటం లేదా?

By:  Tupaki Desk   |   5 Dec 2021 4:38 AM GMT
హాట్ టాపిక్: బైడన్ కు కమలాకు పడటం లేదా?
X
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు ఆ దేశ ఉపాధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న భారత సంతతికి చెందిన కమలాహ్యారీస్ కు మధ్య గ్యాప్ పెరుగుతోందా? ఇంతకాలం కలిసి పని చేసిన వారి మధ్య ఇటీవల కాలంలో కొన్ని విభేదాలు చోటు చేసుకుంటున్నట్లుగా చెబుతున్నారు. ఈ వాదనకు బలం చేకూరేలా తాజాగా ఏఎఫ్ సీ మీడియా సంస్థ తాజాగా ఒక సంచలన కథనాన్ని వెల్లడించింది. వైట్ హౌస్ లో కమలాకు ప్రాధాన్యత తగ్గినట్లుగా చెబుతున్నారు. కీలక పాలనా వ్యవహారాల్లో గతంలో మాదిరి ఆమెకు ప్రాధాన్యతను ఇవ్వటం లేదన్న మాట వినిపిస్తోంది.

అమెరికా చరిత్రలో దేశ ఉపాధ్యక్షుడి స్థానాన్ని సొంతం చేసుకున్న తొలి మహిళా నేతగా రికార్డును క్రియేట్ చేసిన కమలాకు తాజాగా కొత్త సవాళ్లు ఎదురవుతున్నట్లుగా చెబుతున్నారు. ఈ వాదనకు బలపరిచే ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి. కమలాకు కమ్యూనికేషన్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న ఆష్లే ఇటైనీ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లుగా వార్తలు రావటం.. అంతలోనే ఉపాధ్యక్షురాలికి ముఖ్య అధికార ప్రతినిధిగా పని చేస్తున్న సైమోన్ సాండర్స్ ఈ ఏడాది చివర్లో పదవి నుంచి వైదొలగనున్నట్లుగా వార్తలు వచ్చాయి.

అత్యంత ముఖ్యులు.. సీనియర్లు అయిన ఇద్దరు ఒకే సమయంలో కమలా టీం నుంచి దూరం కావటం ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇదేమీ అనుకోకుండా జరిగింది కాదన్నట్లుగా మీడియా కథనాలు వెలువడుతున్నాయి. కమలా హ్యారీస్ కు అంత ప్రాధాన్యత లభించటం లేదన్న మాట వినిపిస్తోంది. రాజకీయంగా తన చేతులు కట్టేసినట్లుగా భావిస్తున్నట్లుగా హ్యారిస్ తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు. ఇదే విషయాన్ని ప్రముఖ మీడియా సంస్థ సీఎన్ఎన్ వెల్లడించటం గమనార్హం.

ఈ అభిప్రాయాన్ని గాలివాటంగా కాకుండా.. కమలా టీంలోని దాదాపు 30 మందితో మాట్లాడిన తర్వాత సదరు మీడియా సంస్థ ఈ అభిప్రాయానికి వచ్చినట్లుగా పేర్కొంది. అయితే.. బైడెన్.. కమలా హ్యరీస్ కు మధ్య గ్యాప్ పెరగటానికి కారణం ఫలానా అన్నవిషయాన్ని స్పష్టంగా వెల్లడి కానప్పటికీ.. ఇరువురు అగ్రనేతల మధ్య దూరం పెరిగిందని మాత్రం చెబుతున్నారు.

వాస్తవానికి.. 79 ఏళ్ల బైడెన్ తాను అధ్యక్ష స్థానాన్ని చేపట్టినప్పుడు కీలకమైన.. సున్నితమైన అంశాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేలాకొన్ని అంశాల్ని హ్యారిస్ కు అప్పజెప్పారు. అయితే.. తర్వాతి కాలంలో మాత్రం ఆమె ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. అయితే.. దేశాధ్యక్షుడు.. ఉపాధ్యక్షురాలి మధ్య గ్యాప్ పెరిగినట్లుగా ఈ మధ్యన మీడియాలో వార్తలు వస్తున్న వేళ.. ఈ ఇద్దరిలో ఏవరో ఒకరు క్లారిటీ ఇచ్చే వరకు ఈ వార్తలు తగ్గవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.