Begin typing your search above and press return to search.

కేసులు 4 నెలల స్థాయిలో.. మళ్లీ కొవిడ్ భూతం పెట్రేగుతోందా?

By:  Tupaki Desk   |   18 March 2023 10:00 PM GMT
కేసులు 4 నెలల స్థాయిలో.. మళ్లీ కొవిడ్ భూతం పెట్రేగుతోందా?
X
కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి.. అప్రమత్తంగా ఉండంమంటూ మూడు రోజుల కిందట కేంద్ర ప్రభుత్వం తెలంగాణతో పాటు ఆరు రాష్ట్రాలకు లేఖ రాసింది.. అంతకుముందు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి సైతం హెచ్చరించారు. క్షేత్ర స్థాయిలో చూస్తుంటే ఫ్లూ జ్వరాలు చెలరేగుతున్నాయి. ఎన్3 హెచ్2 వ్యాప్తితో ప్రజల్లో భయాందోళనలు కలుగుతున్నాయి. దీనికి తగ్గట్లే దేశంలో కొవిడ్ కేసులు మెల్ల మెల్లగా పెరుగుతూ పోతున్నాయి. గత వారం.. 2022 నవంబరు తర్వాత ఎన్నడూ లేనంత సంఖ్యలో తొలిసారి 400దాటగా.. ఇప్పుడు 500 కూడా మించాయి.

ఈ నాలుగు రాష్ట్రాల్లో కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్.. ఇవీ ప్రస్తుతం కొవిడ్ కేసులు అత్యధికంగా వస్తున్న రాష్ట్రాలు. రెండు రోజుల కిందట తెలంగాణలోనూ పాజిటివ్ రేటు 1 దాటింది. 54 కేసులు నమోదయ్యాయి. ఇక శుక్రవారం నాటి డేటా చూస్తే దేశవ్యాప్తంగా 841 మందికి కొవిడ్ వైరస్ సోకింది. నాలుగు నెలల తర్వాత ఈ స్థాయిలో కేసులు రావడం గమనార్హం. దీంతో మొత్తం యాక్టివ్ కేసులు 5,389కు చేరాయి. నెల కిందటి వరకు యాక్టివ్ కేసుల సంఖ్యతో పోలిస్తే ఇవి దాదాపు రెట్టింపు కావడం గమనార్హం.

2 మరణాలు.. కొవిడ్ కారణంగా కొన్ని నెలలుగా దేశంలో మరణాలు దాదాపు లేవు. అయితే, ఇప్పుడు రెండు (జార్ఖండ్, మహారాష్ట్ర) నమోదయ్యాయి. కేరళలో పాత లెక్కలను సవరించడంతో మరో రెండు మరణాలు జమయ్యాయి. ఇక దేశంలో రోజువారీ కొత్త కేసులు నెల కిందటితో పోలిస్తే ఆరు రెట్లు పెరిగాయి. అంటే.. ఫిబ్రవరి 18న 112 పాజిటివ్ లు రాగా.. నేడు వాటి సంఖ్య 626. దీన్నిబట్టే కొవిడ్ చాపకింద నీరులా పాకుతోందని తెలుస్తోంది. అందుకే.. గత బుధవారం కేంద్రం.. మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటకలను హెచ్చరించింది. టెస్టింగ్, ట్రీటింగ్, ట్రాకింగ్, వ్యాక్సినేషన్ మీద ఫోకస్ పెంచాలని కోరింది. అంతకుముందు శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ రాష్ట్రాలు-యూటీలను కొవిడ్ కట్టడి ఆవశ్యకతను వివరిస్తూ లేఖ పంపారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.