టీడీపీ మినీ మహానాడు వాయిదా వేసింది అందుకేనా?

Tue Jun 28 2022 17:58:27 GMT+0530 (IST)

Is that why the TDP has postponed the mini Mahanadu?

సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూసిన గుడివాడ మినీ మహానాడును ఆ పార్టీ వాయిదా వేసింది. గత కొద్ది రోజులుగా మినీ మహానాడును నిర్వహిస్తామని టీడీపీ ప్రకటించినప్పటి నుంచి గుడివాడ రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. గుడివాడ మాజీ మంత్రి వైఎస్సార్సీపీ నేత కొడాలి నాని నియోజకవర్గం కావడమే ఇందుకు కారణం.టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు నారా లోకేష్ పై నిప్పులు చెరగడంలో కొడాలి నాని శైలే వేరు. ఈ విషయంలో కొడాలి నానికి సాటి వచ్చేవారే లేరని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో మినీ మహానాడు నిర్వహిస్తామని అనగానే ఒక్క గుడివాడలోనే కాకుండా ఏపీలోనే రాజకీయాలు వేడెక్కాయి.

ఓవైపు కొడాలి నాని ఆయనకు మద్దతుగా మంత్రి జోగి రమేష్ మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు మరోవైపు అంతే గట్టిగా టీడీపీ నేతల ప్రతిసవాళ్లతో గుడివాడ హీటెక్కింది. అయితే ఒక్కసారిగా మినీ మహానాడును వాయిదా వేస్తున్నామని వీటిపై టీడీపీ చప్పున నీళ్లు చిలకరించేసిందని అంటున్నారు.

కొద్ది రోజులుగా గుడివాడ ప్రాంతంలో భారీ ఎత్తున వర్షాలు పడుతున్నాయి. దీంతో మినీ మహానాడు ప్రాంగణమంతా బురదమయం అయిపోయిందని.. అందుకే మినీ మహానాడును వాయిదా వేస్తున్నామని టీడీపీ చెబుతోంది. వర్షాలు తగ్గాక మరికొద్ది రోజుల్లోనే మినీ మహానాడును నిర్వహిస్తామని అంటోంది.

వాస్తవానికి మినీ మహానాడును నిర్వహించి తమకు ఏకుకు మేకుగా మారిన కొడాలి నానికి గట్టి షాక్ ఇవ్వాలని టీడీపీ తలపోసిందని అంటున్నారు. ఇందుకు తగ్గట్టే పక్కా ప్రణాళికతో ముందుకు కదిలిందని చెబుతున్నారు. భారీ జనసమీకరణ నేతలు కార్యకర్తలు హాజరయ్యేలా చేసి ఎన్టీఆర్ పుట్టిన గడ్డ మీద కొడాలి నానికి తమ సత్తా ఏంటో చూపించాలనుకుందని పేర్కొంటున్నారు.

కాగా ఇంకో వాదన కూడా వినిపిస్తోంది. మినీ మహానాడుకు సంబంధించి ఫ్లెక్సీల ఏర్పాటులో గుడివాడ నియోజకవర్గ టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు విభేదాలతోనే మినీ మహానాడును వాయిదా వేశారని వార్తలు వస్తున్నాయి. గతంలో గుడివాడ నుంచి పోటీ చేసిన రావి వెంకటేశ్వరరావు కొత్తగా పార్టీలోకి వచ్చిన శిష్టా లోహిత్ మధ్య ఫ్లెక్సీల ఏర్పాటులో విబేధాలు తలెత్తాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో తాము కొడాలి నాని గట్టి షాక్ ఇవ్వాలనుకుంటే పార్టీ నేతల మధ్యే విబేధాలు తలెత్తడంతో మినీ మహానాడును చంద్రబాబు వాయిదా వేశారని అంటున్నారు.