Begin typing your search above and press return to search.

గంటాకు షోకాజ్ నోటీస్ ఇచ్చే ఆస్కారం ఉందా?!

By:  Tupaki Desk   |   4 April 2021 10:00 PM IST
గంటాకు షోకాజ్ నోటీస్ ఇచ్చే ఆస్కారం ఉందా?!
X
గంటా శ్రీనివాస‌రావు. రాజ‌కీయంగా ఏ ఎండ‌కు ఆ గొడుగు ప‌ట్టే నాయ‌కుడుగా ఆయ‌న పేరు తెచ్చుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న మూడు పార్టీలు మారారు. టీడీపీతో రాజ‌కీయం ప్రారంభించిన ఆయ‌న అన‌కాప‌ల్లి నుంచి ఎంపీగా గెలిచారు. ఆ త‌ర్వాత ప్ర‌జారాజ్యం పార్టీ రావ‌డంతో త‌న కాపు సామాజిక వ‌ర్గం నేత చిరంజీవికి మ‌ద్ద‌తివ్వ‌డం ధ‌ర్మం అంటూ.. ఆ పార్టీలోకి చేరిపోయారు. ఆ త‌ర్వాత ప్ర‌జారాజ్యాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేసిన‌ప్పుడు లాబీయింగ్ చేసుకుని మంత్రి ప‌ద‌విని ద‌క్కించుకున్నారు. ఇక‌, రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత .. మ‌ళ్లీ సొంత గూటికి చేరుకున్నారు. చంద్ర‌బాబు హ‌యాంలో 2014 నుంచి మంత్రిగా ప‌నిచేశారు.

ఇక‌, గ‌త ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న విశాఖ ఉత్త‌ర నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ టికెట్‌పై విజ‌యం సాధించారు.అయితే, ఆయ‌న‌కంటూ.. నిల‌క‌డ‌గా ఒక నియోజ‌క‌వ‌ర్గం లేదు. ఒక పార్టీలేదు.. అనే పేరుంది. ఆయ‌న ఎక్క‌డ నుంచి పోటీ చేసినా గెలుస్తున్నారు. ఏ పార్టీ టికెట్ ఇచ్చినా గెలుపు గుర్రం ఎక్కుతున్నారు. దీంతో పార్టీల‌ను, పార్టీ అధినేత‌ల‌ను కూడా ఆయ‌న ప‌క్క‌న పెడుతున్నారు. ఐదేళ్లు మంత్రిగా చేసే అవ‌కాశం క‌ల్పించిన టీడీపీని, గత ఎన్నిక‌ల్లో టికెట్ ఇచ్చిన చంద్ర‌బాబును కూడా ఇప్పుడు ఆయ‌న లెక్క చేయ‌డం లేదు. పైగా.. పార్టీ కార్య‌క్ర‌మాల‌ను కూడా ఆయ‌న ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు 22 నెల‌లు గ‌డిచినా.. పార్టీ త‌ర‌ఫున వాయిస్ వినిపించ‌లేదు. చంద్ర‌బాబు అనేక ప్ర‌భుత్వ వ్య‌తిరేక కార్య‌క్ర‌మాల‌ను తెర‌దీసినా.. ఒక్క కార్య‌క్ర‌మానికి కూడా హాజ‌రుకాలేదు.

పైగా పార్టీ మారుతున్నార‌ని.. వైసీపీలోకి చేరుతున్నార‌నే లీకులు ఇస్తూ.. రాజ‌కీయాల‌ను హీటెక్కిస్తున్నారు. ఇక‌, ఇటీవ‌ల విశాఖ ఉక్కు ఉద్య‌మానికి మ‌ద్ద‌తంటూ.. ఏకంగా ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేశారు. క‌ట్ చేస్తే.. ఇటీ వ‌ల జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న స‌త్తా చూపించ‌లేదు. ఉద్దేశ పూర్వ‌కంగా ఆయ‌నే త‌ప్పుకొన్నార‌ని ఉత్త‌ర నియోజ‌క‌వ‌ర్గంలో టాక్ న‌డుస్తోంది. నిజానికి గంటా నిల‌బ‌డి ఉంటే.. 17 వార్డుల‌కు 15 టీడీపీ ప‌రం అయ్యేవ‌ని.. ఫ‌లితంగా విశాఖ కార్పొరేష‌న్ .. టీడీపీకి ద‌క్కేద‌ని ఒక అంచ‌నా ఉంది. అయిన‌ప్ప‌టికీ.. త‌న వ్య‌క్తిగ‌త రాజ‌కీయాల కోసం.. త‌న ప‌ద‌వుల కోసం .. ఆయ‌న టీడీపీని తొక్కేస్తున్నార‌నే టాక్ వినిపిస్తోంది. గంటా శ్రీనివాసరావు కాడి వదిలేయడంతోనే ఉత్తరంలో వైసీపీ మొత్తం 17 వార్డులకు గానూ 15 గెలుచుకుంది.

ఇక‌, ఇప్పుడు ఆయ‌న ఏం చేయాల‌ని అనుకుంటున్నారు? అనే విష‌యాన్ని ప‌రిశీలిస్తే. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి గ‌ట్టి హామీ వ‌స్తే.. వైసీపీలోకి వెళ్లే అవ‌కాశాలు మెండుగా క‌నిపిస్తున్నాయి. ఒక‌వేళ అలా కాని ప‌క్షంలో జ‌న‌సేన‌లో చేరిపోయి.. తూర్పు గోదావ‌రి నుంచి పోటీ చేయాల‌ని భావిస్తున్న‌ట్టు స‌మాచారం. తాను ఎక్క‌డ నుంచి ఏ పార్టీ త‌ర‌ఫున పోటీ చేసినా గెలుస్తాన‌నే ధీమానే ఆయ‌న‌ను ఈ విధంగా మార్చుతోంద‌న్న‌ది విశ్లేష‌కుల మాట‌. అందుకే ఆయ‌న వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తూ.. టీడీపీని తొక్కేస్తూ.. త‌న ఎదుగుద‌ల‌కు సంబంధించిన మార్గాన్వేష‌ణ‌లో ఉన్నార‌ని అంటున్నారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్న టీడీపీ అధిష్టానం.. ఆయ‌న‌కు షోకాజ్ నోటీ సులు జారీ చేస్తుందా? ఆయ‌న నుంచి `ఇలా చేయ‌డ‌మేంటి?` అంటూ.. వివ‌ర‌ణ కోరుతుందా? అనేది ఆస‌క్తిగా మారింది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.