Begin typing your search above and press return to search.

ఈటల రాజేంద‌ర్ అవి పంచుతున్నారా?

By:  Tupaki Desk   |   13 Sep 2021 5:28 AM GMT
ఈటల రాజేంద‌ర్ అవి పంచుతున్నారా?
X
తెలంగాణ రాష్ట్ర స‌మితి నేత హ‌రీష్ రావు బీజేపీ నేత ఈట‌ల రాజేంద‌ర్ పై ఆస‌క్తిదాయ‌క‌మైన ఆరోప‌ణ‌లు చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేప‌థ్యంలో ఈటల రాజేంద‌ర్ పై హ‌రీష్ రావు ధ్వ‌జ‌మెత్తుతూ.. ఉప ఎన్నిక‌ల కోసం రాజేంద‌ర్ అప్పుడే పంప‌కాలు స్టార్ట్ చేశారంటూ ఆరోపించారు. బీజేపీలో చేరిన ఈట‌ల రాజేంద‌ర్ ప్ర‌జ‌ల‌కు ఏమీ చేసింది లేద‌ని, అందుకే ఉప ఎన్నిక‌ల నేప‌థ్యంలో.. బొట్టు బిల్ల‌లు, గోడ గ‌డియారాలు, కుట్టుమిష‌న్లు, గ్రైండ‌ర్లు పంచుతున్నారంటూ హ‌రీష్ రావు అంటున్నారు. ప్ర‌జ‌లు వాటిని ప‌ట్టించుకోకుండా ఎవ‌రి గెలిపిస్తే అభివృద్ధి జ‌రుగుతుందో ఆలోచించి ఓటేయాల‌ని హ‌రీష్ పిలుపునిచ్చారు.

మ‌న దేశంలో ఎన్నిక‌ల సంద‌ర్భంగా రాజ‌కీయ పార్టీల నేత‌లు ఇలాంటి పంప‌కాలు చేయ‌డం రొటీనే. క్రికెట్ కిట్ల‌తో మొద‌లుపెడితే ముక్కుపుడ‌క‌ల వ‌ర‌కూ ర‌క‌ర‌కాలుగా ఓట‌ర్ల‌ను ప్ర‌లోభ పెట్ట‌డానికి నేత‌లు పంప‌కాల‌ను చేప‌డుతూ ఉంటారు. ఈ క్ర‌మంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక కూడా అందుకు మిన‌హాయింపు కాక‌పోవ‌చ్చు. ఇలాంటి ప్ర‌తిష్టాత్మ‌క ఉప ఎన్నిక‌లు వ‌చ్చిన‌ప్పుడే నేత‌లు మ‌రింత హ‌డావుడి చేస్తూ ఉంటారు. డ‌బ్బులు, గిఫ్ట్ లు పంచుతూ ఉంటారు. అయితే అవ‌న్నీ పోలింగ్ కు స‌మ‌యం ఆస‌న్నం అయిన‌ప్పుడు జ‌రిగేవి. అయితే ప్ర‌స్తుతానికి ఇంకా హుజూరాబాద్ ఉప ఎన్నిక‌కు షెడ్యూలే రాలేదు. ఇప్ప‌టికే పార్టీలు రాజ‌కీయ విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌లు అయితే చేసుకుంటున్నాయి. కానీ.. పంప‌కాలు కూడా జ‌రుగుతున్నాయ‌ని నేత‌లు ఆరోపించుకుంటూ ఉండటం గ‌మ‌నార్హం.

ఇప్పుడే పంప‌కాలు చేసేస్తే... తీరా ఓటింగ్ స‌మ‌యానికి ప్ర‌జ‌లు తాము తీసుకున్న వాటిని కూడా మ‌రిచిపోవ‌చ్చు. ఒక‌వేళ పంచాల‌నుకునే వారికి కూడా ఈ మాత్రం తెలియ‌కుండా ఉండ‌దు. కానీ హ‌రీష్ రావు మాత్రం ఇప్పుడే ఆరోప‌ణ‌లు చేసేస్తూ ఉన్నారు. ఇలాంటి ఆరోప‌ణ‌లు రొటీనే అయినా..మ‌రీ ఇంత మందుగానే పంప‌కాల ఆరోప‌ణ‌లు కూడా చేసుకుంటూ ఉన్న‌ట్టున్నారు. మ‌రి ఈ ఆరోప‌ణ‌ల‌కు ఈట‌ల వ‌ర్గం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.

టీఆర్ఎస్ వాళ్లకు ప్ర‌భుత్వ‌మే చేతులో ఉండ‌టంతో హుజూరాబాద్ పోల్ సంద‌ర్భంగా ద‌ళిత‌బంధు వంటి ప‌థ‌కాల‌ను ప్రారంభించార‌ని, అది కూడా ఓట‌ర్ల‌కు ఎర వేయ‌డ‌మే అనే ఆరోప‌ణ‌లు లేక‌పోలేదు. అయినా ఈ బై పోల్ కు ఇంకా స‌మ‌యం మిగిలే ఉండ‌టంతో.. ఇంకా ఎవ‌రెవ‌రు ఏమేం పంచుతారో అని హుజూరాబాద్ ప్ర‌జ‌లు కూడా ఆస‌క్తితో ఎదురుచూస్తూ ఉండ‌వ‌చ్చు!