Begin typing your search above and press return to search.

ఉత్తరాంధ్రాలో ఫ్యాన్ గాలి తగ్గిపోతోందా....?

By:  Tupaki Desk   |   17 March 2023 9:16 AM GMT
ఉత్తరాంధ్రాలో ఫ్యాన్ గాలి తగ్గిపోతోందా....?
X
ఉత్తరాంధ్రా జిల్లాలు అంటేనే తెలుగుదేశానికి కంచుకోటలు. వైఎస్సార్ లాంటి చరిష్మాటిక్ లీడర్ నాయకత్వంలో కాంగ్రెస్ వేవ్ 2004లో ఉమ్మడి ఏపీలో బలంగా వీచినపుడు కూడా ఉత్తరాంధ్రా జిల్లాలలో టీడీపీ తన స్థానాన్ని పదిలం చేసుకుంది, కాంగ్రెస్ కి చోటిస్తూనే టీడీపీ కూడా గట్టిగా నిలబడింది. అలాంటి టీడీపీని ఏమీ కాకుండా అరడజన్ సీట్లకు పరిమితం చేసిన ఘనత జగన్ దే.

ఎలా అంటే 2019 ఎన్నికల్లో జగన్ వేవ్ లో ఉత్తరాంధ్రాలో సైకిల్ కి పంక్చర్లు పడిపోయాయి. విజయనగరం జిల్లాలో అయితే ఖాతా తెరవలేదు. విశాఖ రూరల్ జిల్లాలో ఒక్క సీటు దక్కలేదు. ఇక ఏజెన్సీ అయితే రెండు సీట్లూ వైసీపీ పరం అయ్యాయి. శ్రీకాకుళంలో పదికి రెండు మాత్రమే టీడీపీకి దక్కాయి. అలా ఫ్యాన్ ప్రభంజనం సాగింది.

అయితే విశాఖ సిటీ మాత్రం టీడీపీ పరువుని కాపాడింది. దిగ్గజ నేతలు అంతా ఇక్కడ ఉన్నారు. ఇక 2021 కి వచ్చేటప్పటికి లోకల్ బాడీ ఎన్నికల్లో గంటా శ్రీఎనివాసరావు లాంటి నాయకులు సైలెంట్ కావడంతో వైసీపీ హవా మళ్ళీ సాగి విశాఖ మేయర్ పీఠం కైవశం అయింది అని అంటారు. అయితే ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ టీడీపీ బిగ్ షాట్స్ అంతా ఏకం అవుతున్నారు. అదే టైం లో ప్రభుత్వ వ్యతిరేకత బాగా పెరుగుతోంది.

మరో వైపు చూస్తే సామాజికవర్గం పరంగా ఒక బలమైన వర్గం వైసీపీకి దూరం అవుతోంది.ఈ పరిణామాలు అన్నీ బేరీజు వేసుకుంటే ఉత్తరాంధ్రా ఫ్యాన్ గాలి బాగా తగ్గిపోతోంది అని అంటున్నారు. ఇక ఇంకో విషయం చెప్పుకోవాలీ అంటే వైసీపీకి సీనియర్ నాయకులు ఉన్నా ఎవరి దారి వారిదే అన్నట్లుగా తీరు ఉంటోందన్న విమర్శలు ఉన్నాయి. వైసీపీకి ఉత్తరాంధ్రా బాధ్యతలు చూసిన వి విజయసాయిరెడ్డి ఉన్నపుడు పార్టీ ఒక విధంగా పద్ధతిగా నడిచేది.

ఇపుడు ఆ లోటు స్పష్టంగా ఉందని అంటున్నారు. వైవీ సుబ్బారెడ్డి పార్టీని లీడ్ చేయలేకపోతున్నారనే అంటున్నారు. ఆయనకు పట్టభద్రుల ఎమ్మెల్సీ అన్నది ఒక కఠిన పరీక్ష గా మారుతోంది. ఈ పరీక్షలో నెగ్గితే ఆయన కంటిన్యూ అవుతారని లేకపొతే మార్పులూ చేర్పులూ తప్పవని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో డైనమిక్ లీడర్ షిప్ ఉండాలన్న ఆలోచన కూడా పార్టీలో ఉంది.

ఇక స్థానికంగా ఉన్న నాయకులకు బాధ్యతలు అప్పగించి వారిని బాధ్యులను చేయాలన్న మాట కూడా ఉంది. ఎంతసేపూ పై నుంచి ఆదేశాలు రావడం ఏ సుబ్బారెడ్డో మరొక నేతనో మాత్రమే అంతా చేయాలనుకోవడం కుదరదు అని అంటున్నారు. లోకల్ గా ఉన్న వారికి వాస్తవాలు గ్రౌండ్ రియాలిటీస్ తెలుస్తాయని వారిని ముందు పెట్టి పార్టీని ఒక డైరెక్షన్ లో నడిపిస్తేనే ఫలితాలు వస్తాయని అంటున్నారు. ఏది ఏమైనా ఉత్తరాంధ్రాలో గాలి అయితే మారుతోంది అన్న సంకేతాలు అయితే ఉన్నాయి. వైసీపీ మాత్రం మేలుకోకపోతే గట్టి సవాల్ ఎదురైనా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.