కేజ్రీవాల్ ను చూసి జగన్ కు క్రేజీ ఐడియా?

Sat Apr 01 2023 16:47:35 GMT+0530 (India Standard Time)

Is YS Jagan trying to become Arvind Kejriwal

పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు అన్న సామెత మన తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్. ఎవరో ఒక వ్యక్తి చేసిన పనిని కాపీ కొట్టి...దానికి కొంచెం మార్పులు చేర్పులు చేసి మొదటి వ్యక్తి తరహాలోనే క్రెడిట్ కొట్టేయాలని చూసే సందర్భంలో ఈ సామెతను వాడతారు. ప్రస్తుతం ఈ సామెత ఏపీ సీఎం జగన్ కు అతికినట్టుగా సూట్ అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఢిల్లీ సీఎం మాజీ ఐఏఎస్ అధికారి అరవింద్ కేజ్రీవాల్ పాలన చూసి ఏపీ సీఎం జగన్ వాతలు పెట్టుకోవడానికి సిద్ధమైనట్లుగా ప్రచారం జరుగుతుంది.అత్యంత సమర్థవంతమైన ముఖ్యమంత్రుల జాబితాలో కేజ్రీ పేరు ముందుంటుంది. రాష్ట్ర ఖజానా డబ్బులను పప్పుబెల్లాల్లాగా పంచి పెడుతూ బటన్ నొక్కి జనానికి చేరువైన ముఖ్యమంత్రుల జాబితాలో జగన్ పేరు కూడా ముందు వరుసలోనే ఉంటుంది. అయితే పంచిపెడుతున్న పప్పుబెల్లాలు రాబోయే ఎన్నికలలో తమకు ఓట్లు కురిపించే అవకాశాలు సన్నగిల్లుతున్నాయని గ్రహించిన సీఎం జగన్ తాజాగా ఢిల్లీలో కేజ్రీ అమలుచేస్తున్న పథకాలు వాటి పనితీరును పరిశీలిస్తున్నారని ప్రచారం జరుగుతుంది.

వైసీపీకి చెందిన ఇద్దరు ఎంపీలు గత వారం రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసి అక్కడ కేజ్రీ సర్కార్ అమలు చేస్తున్న పథకాల పనితీరును పరిశీలిస్తున్నారట. ఇక దేశ రాజధాని హస్తినాపురిలో ఒకవైపు హస్తం పార్టీని మరొకవైపు కమలనాధులను కలిసికట్టుగా దీటుగా ఆప్ అధినేత ఎలా ఎదుర్కొంటున్నారు అన్న విషయంపై కూడా వారు ఆరా తీస్తున్నారట.

మొహల్లా క్లినిక్ అంటే ప్రతి వార్డుకు ఒక ఆసుపత్రి కార్పొరేట్ స్కూళ్లను తలపించేలా ప్రభుత్వ స్కూళ్లు..ప్రతి ఇంటికి ప్రతిరోజు 200 లీటర్ల మంచినీరు వంటి పథకాలతో జనానికి కేజ్రీ చేరువయ్యారు.

దీంతో ఢిల్లీ ఫార్ములానే జగన్ కాపీ కొట్టి దానిని ఏపీకి అనుగుణంగా మార్పులు చేర్పులు చేయాలని భావిస్తున్నారట. దాంతోపాటు ప్రజలకు చేరువయ్యేందుకు అవసరమైన అన్ని కాన్సెప్ట్ లను కూడా జగన్ పరిశీలిస్తున్నారట. కానీ ఇక్కడ జగన్ ఒక విషయాన్ని మర్చిపోతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆప్ మంత్రులు అడ్డంగా బుక్ అయినా సరే కేజ్రీవాల్ పై ఈగ కూడా వాలలేదు.

కానీ ఇక్కడ ఏపీలో పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. సాక్షాత్తు సీఎం జగన్ పైనే అవినీతి అక్రమాస్తుల కేసులు ఉన్నాయి. ఇక కేజ్రీవాల్ పై  సొంత పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులలో పెద్దగా అసంతృప్తి లేదు. కానీ వైసీపీలో జగన్ పై కొందరు ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారనేది అక్షర సత్యం. ఇటువంటి పరిస్థితుల్లో కేజ్రీవాల్ వంటి పులిని చూసి నక్క మాదిరిగా జగన్ వాతలు పెట్టుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి.       


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.