అమరావతి ఉద్యమం టీడీపీ-బీజేపీ నేతలను కలుపుతోందా

Wed Nov 24 2021 14:00:01 GMT+0530 (IST)

Is The Amravati Movement Uniting Tdp Bjp Leaders

ఎక్కడో స్విచ్ నొక్కితే ఇంకెక్కడో బల్బు వెలిగినట్లుగా అమరావతి ఉద్యమం టీడీపీ-బీజేపీ నేతలను కలుపుతోందా అనే అనుమానాలు మొదలయ్యాయి. మొన్నటి 4వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తిరుపతికి వచ్చి వెళ్ళిన తర్వాత అమరావతి కోసం ఆందోళనకారులు చేస్తున్న మహా పాదయాత్ర లో బీజేపీ నేతలు కూడా పాల్గొంటున్నారు. నెల్లూరు జిల్లాలో జరుగుతున్న పాదయాత్రలో బీజేపీ ముఖ్య నేతలు అధ్యక్షుడు సోము వీర్రాజు పురందేశ్వరి ఎంపీలు సుజనా చౌదరి సీఎం రమేష్ జీవీఎల్ నరసింహారావు తదితరులందరూ పాదయాత్రలో పాల్గొంటున్నారు.నిజానికి పాదయాత్రలో మొదటి నుంచి కొందరు స్థానిక నేతలు పాల్గొంటునే ఉన్నారు. కాకపోతే షా చెప్పిన తర్వాత అగ్రనేతలు అందరు పార్టిసిపేట్ చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో జరుగుతున్న పాదయాత్రకు రెండు పార్టీలకు చెందిన నేతల్లో అత్యధికులు కలిసే పాల్గొంటున్నారు. స్ధానికులు రెండు పార్టీలకు చెందిన నేతలకు మంగళహారతులిస్తున్నారు. వీర తిలకం దిద్దుతున్నారు. పాదయాత్ర జరిగినంతసేపు రెండు పార్టీల నేతలు కలిసే ఉంటున్నారు.

రెండు పార్టీల నేతల మధ్య ఇపుడు మొదలైన ఈ బంధం కొద్దిరోజులకు మరింతగా బలపడే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటి వ్యవహారం రేపటి రోజున రెండు పార్టీల మధ్య పొత్తుకు వేదికగా నిలిచే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఒకవైపు బీజేపీతో పొత్తుకు చంద్రబాబు నాయుడు ఆసక్తిగానే ఉన్నారు. ఇదే సమయంలో వైసీపీ-టీడీపీలతో సమదూరం పాటించాలని కేంద్ర హోంశాఖ మంత్రి స్పష్టంగా చెప్పారు.

షా చెప్పిన మాటల ప్రకారం టీడీపీతో పొత్తుకు దూరంగా ఉండాలని తమ నేతలకు చెప్పినా రేపేమవుతుందనే విషయాన్ని ఎవరూ చెప్పలేరు. ప్రజల్లో ఏ పార్టీకి మద్దతు ఉంటే బీజేపీ గాలి అటే మళ్లుతుంది. ఎలాగూ టీడీపీతో పొత్తు కుదిర్చేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారనే ప్రచారం అందరికీ తెలిసిందే. బీజేపీ+జనసేన ఎలాగు మిత్రపక్షా లే. ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా బీజేపీ+చంద్రబాబు పొత్తుకు తన వంతుగా కృషి చేస్తారనటంలో సందేహం లేదు.

ఏదేమైనా క్షేత్ర స్ధాయిలో ప్రస్తుతం మూడు పార్టీల పరిస్థితి దాదాపుగా ఒకటేగా ఉంది. కాకపోతే మిత్రపక్షాలకన్నా టీడీపీ పరిస్థితి మెరుగ్గా ఉందంతే. ఇలాంటి నేపథ్యంలో మూడు పార్టీలు కలిస్తే బాగుంటుందని కలవాలనుకునే నేతలు మూడు పార్టీల్లోను ఉన్నారు. కాబట్టి న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్రే మూడు పార్టీల పొత్తుకు వేదికగా మారుతుందనే ప్రచారం మొదలైంది. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.