Begin typing your search above and press return to search.

ఆ కార్డు లేక‌పోతే.. టీడీపీ ఎంపీ ప‌నిచేయ‌రా?

By:  Tupaki Desk   |   20 Oct 2020 3:30 AM GMT
ఆ కార్డు లేక‌పోతే.. టీడీపీ ఎంపీ ప‌నిచేయ‌రా?
X
రాష్ట్రంలో ప్ర‌స్తుతం టీడీపీకి ముగ్గురు పార్ల‌మెంటు స‌భ్యులు ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో భారీగానే ఆశ‌లు పెట్టుకున్నా.. కేవ‌లం ముగ్గురు మాత్ర‌మే విజ‌యం సాధించారు. వీరిలో విజ‌య‌వాడ ఎంపీ.. నిత్యం వివాదాల్లో మునిగితేలుతుంటారు. అటు ప్ర‌త్య‌ర్థి ప‌క్షంపై ఆయ‌న విమ‌ర్శ‌లు చేస్తూనే.. మ‌రోవైపు.. సొంత పార్టీ టీడీపీపై కూడా తీవ్ర అసంతృప్తితో కూడిన వ్యాఖ్య‌లు వినిపిస్తూనే ఉన్నారు. పైగా.. జిల్లాలోని మాజీ మంత్రి దేవినేని ఉమాతో ఆయ‌న‌కు స‌న్నిహిత సంబంధాలు లేక‌పోవ‌డం, తూర్పు నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ కుటుంబంతోనూ రాజ‌కీయ విభేదాలు ఉండ‌డం వంటివి కేశినేనిని పార్టీలో ఒంట‌రి చేసింద‌నే వాద‌న బ‌లంగా ఉంది.

అంతేకాదు, ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో మైనార్టీ నేత‌, గ‌త ఎన్నిక‌ల్లో కుమార్తెకు టికెట్ ఇప్పించుకున్న మాజీ ఎమ్మెల్యే జ‌లీల్ వ‌ర్గంతోనూ కేశినేనికి ప‌డ‌డం లేదు. నిన్న మొన్న‌టి వ‌రకు కేశినేని వ‌ర్గంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా ఇప్పుడు కార‌ణాలు ఏవైనా సైలెంట్ అయ్యారు. దీంతో ప‌ట్టుమ‌ని ప‌ది మంది అనుచ‌రులు, త‌న‌ను స‌మ‌ర్ధించేవారు లేక కేశినేని నాని త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన ప‌రిణామం నాని అనుచ‌రుల‌ను, ఆయ‌నను కూడా తీవ్ర మ‌నోవేద‌న‌కు గురిచేసింది. పార్టీ నేత‌లు అంద‌రూకూడా సైలెంట్ అయ్యారు. దీనికి కార‌ణం విశ్లేషిస్తే.. కేశినేనిపై వారికి ఎంత అక్క‌సు ఉందో అర్ధ‌మ‌వుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

విజ‌య‌వాడ‌లో రెండు కీలక ఫ్లైవోవ‌ర్ల‌కు ఇటీవ‌ల ప్రారంభోత్స‌వాలు జ‌రిగాయి. ఒక‌టి క‌న‌క‌దుర్గ ఫ్లైవోవ‌ర్‌, బెంజిస‌ర్కిల్ ఫ్లైవోర్‌.. ఇవి రెండు కూడా జాతీయ ర‌హ‌దారుల‌కు అనుసంధానంగా ఉన్న ఫ్లైవోర్లు కావ‌డం, కేంద్ర ప్ర‌భుత్వ భాగ‌స్వామ్యం ఉండ‌డం తెలిసిందే. పైగా ఇవి గ‌త చంద్ర‌బాబు హ‌యాంలో మెజారిటీ ప‌నులు పూర్తి చేసుకున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆయా ప్రాజెక్టులకు నిధులు, అనుమ‌తుల విష‌యంలో కేశినేని నాని విజ‌య‌వాడ ఎంపీగా పార్లమెంటులో బాగానే మాట్లాడారు. నిధులను స‌మ‌యానికి తెచ్చుకునేలా ఆయ‌న ఢిల్లీలోనే ఉండి ప్ర‌య‌త్నించిన సంద‌ర్భాలు సైతం ఉన్నాయి.

ఇక‌, ప్రాజెక్టుల ప్రారంభోత్స‌వం నాడు మాత్రం సిట్టింగ్ ఎంపీగానే ఉన్న‌ప్ప‌టికీ.. నానిని ఇటు రాష్ట్ర ప్ర‌భుత్వం, అటు కేంద్రం ప్ర‌భుత్వం కూడా ప‌ట్టించుకోలేదు. ప్రొటోకాల్ ప్ర‌కారం నానిని పిల‌వాల్సి ఉన్న‌ప్ప‌టికీ.. క‌రోనా నిబంధ‌న‌ల పేరుతో ఇంటి నుంచి పాల్గొనాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం సూచించింది. దీంతో అలిగి.. కార్య‌క్ర‌మానికి డుమ్మాకొట్టారు. అయితే, ఈ క్రెడిట్‌ను త‌న ఖాతాలో వేసుకుంటూ.. ప్రెస్‌మీట్ పెట్టి చెప్పారు. ఇంత వ‌రకు బాగానేఉన్నా.. త‌ర్వాత త‌న‌కు మ‌ద్ద‌తుగా పార్టీలో ఏ ఒక్క‌రూ మాట్లాడ‌క‌పోవ‌డం.. మా ఎంపీ కృషితోనే ఇవి సాకార‌మ‌య్యాయ‌ని ఎవ‌రూ ప్ర‌స్థావించ‌క‌పోవ‌డంతో నాని తీవ్రంగా హ‌ర్ట్ అయ్యార‌ని తెలుస్తోంది. మొత్తానికి ఆయ‌న క‌మ్మ‌సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు కాబ‌ట్టి.. ఈ మాత్ర‌మైనా.. మీడియాలో క‌నిపిస్తున్నార‌ని, లేక‌పోయి ఉంటే.. ఎప్పుడో ప‌క్కన పెట్టేవార‌ని అంటున్నారు.