Begin typing your search above and press return to search.

ఆ నాలుగు జిల్లాలో సైకిల్‌ కు కష్టమేనా..?

By:  Tupaki Desk   |   19 April 2019 6:16 AM GMT
ఆ నాలుగు జిల్లాలో సైకిల్‌ కు కష్టమేనా..?
X
ఆంధ్రప్రదేశ్‌ లో పోలింగ్‌ తరువాత ఎవరు గెలుస్తారోనన్న చర్చ ప్రతీ ఇంట్లో జరుగుతోంది. ఓటేసిన సామాన్యులతో పాటు పార్టీల నాయకులు - అభ్యర్థులు తమ గెలుపుపై తీవ్రంగా చర్చించుకుంటున్నారు. ఏపీలోని రెండు ప్రాంతాలను విభజించి ఏ ప్రాంతంలో ఏ పార్టీ వస్తుందో లెక్కలు వేసుకొంటున్నారు. ముఖ్యంగా రాయలసీమలోని కర్నూలు - చిత్తూరు - దక్షిణాంధ్రలోని నెల్లూరు - ప్రకాశంలోపైనే టీడీపీ - వైసీపీల దృష్టి సారించాయి. ఈ జిల్లాలో ఇరు పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మరోవైపు పార్టీల్లో నాయకుల మార్పుల - చేర్పులు తీవ్రమయ్యాయి. దీంతో ఎవరు గెలుస్తారోనన్న చర్చ ఆసక్తిగా మారింది.

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సొంత జిల్లా అయిన చిత్తూరు జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలున్నాయి. 2014 ఎన్నికల్లో ఈ జిల్లాలో టీడీపీ 6 - వైసీపీ 8 స్థానాలు గెలుచుకున్నాయి. వైసీపీ నుంచి గెలిచిన అమర్‌ నాథ్‌ రెడ్డి సైకిల్‌ పార్టీలోకి వెళ్లి మంత్రి పదవి సంపాదించారు. గత ఎన్నికల్లో ఇరు పార్టీలకు ఇంచుమించుగా సమానంగా సీట్లు సాధించిన పార్టీలు ఈసారి ఎన్ని సీట్లు వస్తాయోనన్న ఆసక్తి నెలకొంది.

ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 2014 ఎన్నికల్లో వైసీపీ 6 - టీడీపీ 5 స్థానాల్లో విజయం సాధించాయి. ఆమంచి కృష్ణమోహన్‌ టీడీపీలో కొనసాగినా చివరి సమయంలో వైసీపీలో చేరి చీరాల అసెంబ్లీ సీటు నుంచి బరిలోకి దిగారు. ఇక్కడ ఈయనపై బలమైన కరణం బలరామకృష్ణ మూర్తిని టీడీపీ అధినేత చంద్రబాబు చివరి నిమిషంలో బరిలో దింపారు. ఈ జిల్లాలో కాపు - రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా గెలుపుపై ప్రభావం చూపనుంది. దీంతో సారి ఆ సామాజిక వర్గాలు ఎవరిని ఆదరిస్తారోనన్న ఆసక్తి నెలకొంది. అయితే కాపులో టీడీపీపై ఆగ్రహంగా ఉండడం.. రెడ్డి సామాజికవర్గం వైసీపీవైపు నడవడంతో దాదాపు 80శాతం సీట్లు ప్రకాషం జిల్లాలో వైసీపీకే వస్తాయని రాజకీయ విశ్లేషకులు ఘంటా పథంగా చెబుతున్నారు.

ఆనం ఫ్యామిలీకి కంచుకోటగా ఉన్న నెల్లూరు జిల్లాలో వైసీపీ 7 - టీడీపీ 3 నియోజకవర్గాల్లో 2014 ఎన్నికల్లో విజయం సాధించింది. టీడీపీ నుంచి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి - పొంగూరు నారాయణ వంటి వారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. సోమిరెడ్డి గత ఎన్నికల్లో ఓటమిని చవి చూశారు. ఈసారి ఎన్నికల్లో విజయం సాధిస్తారా..? అనే ఆసక్తి నెలకొంది. ఇక నారాయణకు రాజకీయాలకు కొత్త ఆయన ఎమ్మెల్యేగా బరిలోకి దిగి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. వైసీపీ నుంచి తీవ్ర పోటీని ఎదుర్కొన్నారు.

కర్నూలు రాజకీయం రసవత్తరంగా మారింది. అప్పటి వరకు కాంగ్రెస్‌ లో కొనసాగిన కోట్ల ఫ్యామిలీ - కేఈ ఫ్యామిలీలు టీడీపీలోనే ఉండడంతో ఆ పార్టీకి బలం చేకూరినా వైసీపీ ధీటైన అభ్యర్థులను బరిలోకి దించింది. 2014 ఎన్నికల్లో వైసీపీ 11 గెలుచుకోగా టీడీపీ కేవలం 3 మాత్రమే విజయం సాధించింది. ఇక్కడ శత్రువులుగా ఉన్నవారు పోటీలోకి దిగగా ఇన్నిరోజులు టీడీపీలో కొనసాగిన వారు వైసీపీ తరుపున పోటీ చేస్తున్నారు. దీంతో ఈ జిల్లాలో వైసీపీ ఆధిక్యం స్పష్టంగా కనపడుతోంది. మరి ఫలితాల నాడు ఏం జరుగుతుందనేది వేచి చూడాలి.

ఇలా ప్రస్తుతానికి దక్షిణాంధ్రలోని కర్నూలు - చిత్తూరు - నెల్లూరు - ప్రకాశం జిల్లాల్లో ఓటింగ్ సరళి చూశాక వైసీపీకి స్పష్టమైన ఆధిక్యత లభిస్తుందని క్షేత్రస్థాయి పరిస్థితులు తేటతెల్లం చేస్తున్నాయి. బలమైన వైసీపీ గాలి ఈ జిల్లాల్లో వీచిందంటున్నారు. చూడాలి మరి ఎన్నికల ఫలితాలు మే 23న ఇలానే వస్తాయో లేదో..