సిట్ దూకుడు పెంచిందా ?

Sat Apr 01 2023 10:08:44 GMT+0530 (India Standard Time)

Is SIT Investigation on Paper Leak Increased

ప్రశ్నపత్రాల లీకేజీ దర్యాప్తులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) దూకుడు పెంచినట్లే అనిపిస్తోంది. అనుమానితులను నిందితులను ఒకవైపు విచారిస్తునే మరోవైపు పరీక్షలు నిర్వహించిన టీఎస్ పీఎస్సీ బోర్డుకు కూడా నోటీసులు ఇచ్చింది. బోర్డు అంటే ఛైర్మన్ జనార్ధనరెడ్డితో పాటు మరో ఏడుగురు సభ్యులకు నోటీసులు పంపినట్లు సమాచారం. బోర్డు నిర్వహించిన చాలా ప్రవేశపరీక్షల ప్రశ్నపత్రాలు లీకేజీ అయ్యాయనే గోల అందరికీ తెలిసిందే.



ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని బయటపడగానే మూడు పరీక్షలను బోర్డు రద్దుచేసింది. అయితే అంతకుముందు జరిగిన పరీక్షల మాటేమిటి అనే గందరగోళం పెరిగిపోతోంది. ఎందుకంటే ఇపుడు ప్రశ్నపత్రం లీకేజీలో కీలక పాత్ర ఉన్నవారే గడచిన ఏడేళ్ళుగా బోర్డులో పనిచేస్తున్నారు.

అందుకనే గడచిన ఏడేళ్ళుగా బోర్డు నిర్వహించిన అన్నీ పరీక్షల ప్రశ్నపత్రాలు లీకయ్యాయనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. గ్రూప్ 1 పరీక్షలతో పాటు మరో రెండు పరీక్షలను బోర్డు రద్దుచేయటంతో పరీక్షలు రాసిన అభ్యర్ధులు నిరుద్యోగులు రాజకీయపార్టీలు నానా రచ్చ చేస్తున్నాయి.

అయితే ఈ విషయమై ఇంతవరకు బోర్డు ఛైర్మన్ నోరిప్పలేదు. పరీక్షల రద్దుపైన  అధికారికంగా  కేసీయార్ లేదా ఒక మంత్రి లేదా బోర్డు ఛైర్మన్ ఒక్క మీడియా సమావేశం కూడా నిర్వహించలేదు. ఎంతసేపు లీకులు లేదా ప్రకటనలు జారీతోనే ప్రభుత్వం సరిపెడుతోంది.

ఇందుకనే రోజురోజుకు గోల పెరిగిపోతోంది. బాధ్యులపై ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు. పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతు బోర్డును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

గవర్నర్ ను కలిసినపుడు కూడా వీళ్ళు ఇదే రిక్వెస్టుచేశారు. సిట్ డీజీపీ బోర్డు ఛైర్మన్ చీఫ్ సెక్రటరీలను తన దగ్గరకు వచ్చి ప్రశ్నప్రతాల లీకేజీపై నివేదిక ఇవ్వమని గవర్నర్ ఆదేశించారు. మరి వీళ్ళేమి చేశారో ఎవరికీ తెలీదు. ఈ నేపధ్యంలోనే బోర్డు ఛైర్మన్ సభ్యులకు సిట్ నోటీసులు ఇవ్వటం కీలకంగా మారింది. బోర్డులోని కీలక వ్యక్తుల సహకారం లేకుండా ఇంతపెద్ద కుంభకోణాన్ని కిందస్ధాయి వ్యక్తి ఒక్కళ్ళే నడిపించలేరనే ఆరోణలు పెరిగిపోతున్నాయి. మరి ఛైర్మన్ బోర్డు సభ్యుల విచారణలో సిట్ ఏమి తేలుస్తుందో చూడాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.