ప్యాకేజీ స్టార్ అని ఎందుకంటారో తెలుసా ?

Thu Oct 28 2021 13:48:34 GMT+0530 (IST)

Is Pspk Package  Star

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను అధికార వైసీపీ నేతలు ముద్దుగా ప్యాకేజీ స్టార్ అని పిలుస్తుంటారు. వాళ్ళు అలా ఎందుకు పిలుస్తుంటారు అనేందుకు తాజాగా ఓ ఉదాహరణ బయటపడింది. ఆ అవకాశం పవనే తనంతట తానుగా వాళ్ళకు అందించారు. తాజాగా పవన్ ట్విట్టర్ వేదికగా డ్రగ్ మాఫియాపై అనేక అంశాలను బయటపెట్టారు. ఏపీ నార్కోటిక్ డ్రగ్స్ కు కేంద్రంగా మారిపోయిందని ఆందోళన వ్యక్తంచేశారు. డ్రగ్ మాఫియా రాష్ట్రంలో రాజ్యం ఏలుతోందంటు మండిపోయారు.దేశంలోని యువతపై ఏపి నుండి సరఫరా అవుతున్న డ్రగ్స్ ప్రభావం చూపుతోందంటు తెగ బాధపడిపోయారు. ముఠా కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో అంతర్రాట్ర టాస్క్ ఫోర్సు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్ రవాణా వ్యాపారం యువత బానిసలవటంపై పవన్ ఆందోళనను అర్ధం చేసుకోదగ్గదే. అయితే పవన్ కు ఈ విషయాలన్నీ ఎలా తెలుసు. ఎందుకంటే చంద్రబాబునాయుడు అండ్ కో జగన్మోహన్ రెడ్డి పాలనకు వ్యతిరేకంగా గోల మొదలుపెట్టిన తర్వాతే పవన్ నోరిప్పారు.

చంద్రబాబు అండ్ కో జగన్ పై ఏదైతే ఆరోపణలు చేస్తున్నదో అవే ఆరోపణలను పవన్ కూడా చేయటం గమనార్హం. ఇక్కడ గమనించాల్సిందేమంటే 2018లోనే పవన్ కు ఈ విషయం తెలుసట. అప్పట్లో వైజాగ్ జిల్లాలో చేసిన పోరాట యాత్రలోనే తాను ఈ విషయాన్ని గమనించినట్లు ట్విట్టర్లో చెప్పారు. 2018లోనే రాష్ట్రంలో గంజాయివ్యాపారం జోరుగా జరుగుతున్నట్లు గమనిస్తే 2021లో ఎందుకు ప్రస్తావించినట్లు ? అప్పట్లోనే ఈ విషయంపై పవన్ ఎందుకు మాట్లాడలేదు. 2018లో ముఖ్యమంత్రి చంద్రబాబే కదా.

వైజాగ్ జిల్లాలోని ఆంధ్రా ఒడిస్సా బార్డర్ (ఏవోబీ)లో వేలాది ఎకరాల్లో గంజాయి సాగు దశాబ్దాలుగా జరుగుతోందన్న విషయం అందరికీ తెలిసిందే. గంజాయి సాగు రవాణా వ్యాపారం 2014-19లో చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు కూడా జరిగింది. కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే గంజాయి సమస్య మొదలైనట్లు చంద్రబాబు సొల్లు చెబుతున్నారు. సరే చంద్రబాబు మాటలను ఎవరు నమ్మటంలేదు. చంద్రబాబు పీరియడ్ లో వైజాగ్ ప్రాంతంలో పండే గంజాయి దేశం మొత్తానికి సరఫరా అవుతోందని అప్పట్లో మంత్రిగా పనిచేసిన గంటా శ్రీనివాసరావే స్వయంగా చెప్పారు.

వాస్తవాలు ఇలాగుంటే చంద్రబాబుకు మద్దతుగా పవన్ ఇపుడు గంజాయి గురించి మాట్లాడటం విచిత్రంగా ఉంది. కాకపోతే పవన్ ఇపుడు చెప్పిన విషయం మాజీమంత్రి గంటా ప్రకటనకు మద్దతిచ్చేదిగా ఉంది. గంజాయి వ్యాపారం చంద్రబాబు హయాంనుండే జరుగుతున్నా అదేదో ఇపుడే మొదలైనట్లుగా కలరింగ్ ఇవ్వటం వల్లే పవన్ను వైసీపీ నేతలు ప్యాకేజీ స్టార్ అని అంటున్నారు. ఈ ఒక్క విషయమనే కాదు చాలా విషయాల్లో పవన్ వైఖరి ఇలాగే ఉంటోంది. జగన్ ప్రభుత్వంపై ముందు చంద్రబాబు అండ్ కో ఆరోపణలు విమర్శలు చేయటం దాన్ని పవన్ అందుకోవటం అందరికీ తెలిసిందే.