ఎర్రకోట నుంచి మోడీ స్పీచ్ సొంతమేనా? లేదంటే టెలిప్రాంప్టర్?

Tue Aug 16 2022 10:09:55 GMT+0530 (IST)

Is Modi speech from Red Fort his own Or teleprompter

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేరు విన్నంతనే గుర్తుకు వచ్చేవి రెండే రెండు.. అందులో మొదటిది మనసును హత్తుకునేలా మాట్లాడటం.. రెండోది ఎప్పటికప్పుడు అందరిని ఆకర్షించేలా.. తన గురించి మాట్లాడుకునేలా ఉండే ఆహార్యం. ఈ రెండింటి విషయంలో మాత్రం ఆయన తగ్గేదేలే.. అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. అయితే.. ఆయన ప్రసంగం మొత్తం డొల్ల అని.. ఆయన మాట్లాడే మాటలు మొత్తం స్క్రీన్ మీద కనిపిస్తూ.. టెలి ప్రాంప్టర్ సాయంతో మాట్లాడతారన్న మాట ఈ మధ్యన ఎక్కువగా వినిపిస్తోంది.స్వాతంత్ర్య వజ్రోత్సవాల్ని పురస్కరించుకొని జాతీయ జెండాను ఎగురవేసిన ప్రధాని నరేంద్రమోడీ.. జాతిని ఉద్దేశించి 83 నిమిషాల పాటు ప్రసంగించటం తెలిసిందే. వరుసగా తొమ్మిదో ఏడాది ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ఆయన.. ఎప్పటిలానే తన జోష్ ను కొనసాగిస్తూ సుదీర్ఘంగా ప్రసంగించారు. ఇంతకూ మోడీ అంతసేపు మాట్లాడిన మాటలన్ని ఆయన సొంతమేనా? లేదంటే టెలీ ప్రాంప్టర్ సాయంతో చేశారా? అన్న ప్రశ్నను కొందరు సంధిస్తున్నారు.

అయితే.. విమర్శకులు లేవనెత్తిన టెలీ ప్రాంప్టర్ మాటలో నిజం లేదని.. అదేమీ వాస్తవం కాదంటున్నారు. జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించిన సుదీర్ఘ ప్రసంగం మొత్తం టెలీ ప్రాంప్టర్ లేకుండానే సాగినట్లు స్పష్టంచేస్తున్నారు. తాను చేసే ప్రసంగాన్ని  పాత పద్దతిలో పేపర్ నోట్స్ నే వాడుకున్నారు. 2014లో కూడా ఆయన చేసిన తొలి ప్రసంగం కూడా ఆయన పేపర్ మీద కొన్ని ముఖ్యాంశాల్నిరాసుకొని.. అందుకు తగ్గట్లుగా తన స్పీచ్ ఇచ్చినట్లు చెబుతారు. తాజా ప్రసంగం కూడా అదే రీతిలో సాగినట్లుగా స్పష్టం చేస్తున్నారు. 83 నిమిషాల పాటు మాట్లాడటం ఒక ఎత్తు అయితే.. దాన్ని ఆసక్తికరంగా మల్చుకోవటంలో మోడీ టాలెంట్ ఏమిటో ఇట్టే అర్థమవుతుంది. మోడీనా మజాకానా?