Begin typing your search above and press return to search.

జూనియర్ మేకపాటి వైసీపీని వీడుతున్నారా...?

By:  Tupaki Desk   |   1 April 2023 2:00 PM GMT
జూనియర్ మేకపాటి వైసీపీని వీడుతున్నారా...?
X
వైసీపీలో ఇపుడు ఏది నిజం ఏది అబద్ధం అన్నది తెలియడంలేదు. గుండె చప్పుడు కూడా జగన్ అనే వినిపిస్తుంది అని అన్న వారు పార్టీకి ఝలక్ ఇచ్చి దూరం అయ్యారు. వైసీపీ జెండాను నా శవం మీద కప్పాలి అని అన్న వారూ వైసీపీని వీడారు. పార్టీలో ఆది నుంచి ఉన్న వారు కూడా రివర్స్ అవుతున్న నేపధ్యం ఉంది. ఈ పరిస్థితులలో మరో పేరు నెల్లూరు జిల్లా నుంచి వస్తోంది.

ఇప్పటికే నెల్లూరు నుంచి ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు బయటకు వెళ్ళారు. అయినా అదే జిల్లా నుంచి రూమర్స్ అయితే అలా సాగుతూనే ఉన్నాయి. ఈసారి పేరు ఆత్మకూరు నుంచి గత ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచిన మేకపాటి విక్రం రెడ్డి. ఆయన మాజీ ఎంపీ, వైసీపీ వ్యవస్థాపకులలో ఒకరైన మేకపాటి రాజమోహన్ రెడ్డి రెండవ కుమారుడు. అంతే కాదు, వైసీపీ ప్రభుత్వంలో మూడేళ్ల పాటు కీలక మంత్రిత్వ శాఖలను చూసిన మేకపాటి గౌతం రెడ్డి సోదరుడు.

ఇంకా చెప్పాలీ అంతే ఉదయగిరి వైసీపీ సస్పెండ్ ఎమ్మెల్యే అయిన మేకపాటి చంద్రశేఖరెడ్డి అన్న కొడుకు. మేకపాటి ఫ్యామిలీ వైసీపీలో ఒకనాడు కీలకంగా ఉండేది బలంగా ఉండేది. అదంతా ఇపుడు గతం అవుతోంది. వారధిగా సారధిగా ఉన్న మేకపాటి గౌతం రెడ్డి మరణంతోనే వైసీపీకి దూరం అవుతున్న చాయలు కనిపించాయి.

జగన్ కి మళ్లీ గెలిచే అవకాశాలు ఉన్నాయని, అయితే ఆయన జాగ్రత్తగా అన్నీ చూసుకోవాలని అప్పట్లోనే మేకపాటి రాజమోహన్ రెడ్డి కామెంట్స్ చేసినట్లుగా వచ్చిన వార్తలు సంచలనం రేపాయి. ఇక మేకపాటి రాజమోహన్ రెడ్డికి రాజ్యసభ సీటు ఇస్తారని ప్రచారం జరిగినా దక్కలేదు. ఆ అసంతృప్తి ఉందని అంటున్నారు.

అదే విధంగా మేకపాటి గౌతం రెడ్డి మంత్రిగా చనిపోయారు. ఆయన ప్లేస్ లో ఎమ్మెల్యే అయిన విక్రం రెడ్డికి మంత్రి పదవి లెక్క ప్రకారం దక్కాలి కానీ దక్కలేదు అన్న బాధ కూడా మేకపాటి పెద్దాయనలో ఉందా అన్న చర్చ నడుస్తోంది. ఇపుడు చూస్తే అదే ఫ్యామిలీ నుంచి చంద్రశేఖరరెడ్డిని సస్పెండ్ చేసి పంపించారు.

ఇక మిగిలింది ఏకైక నేత ఎమ్మెల్యే విక్రం రెడ్డి. దాంతో ఆయన చుట్టూ ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతోంది. విక్రం రెడ్డి వైసీపీని వీడతారు అన్న దాని మీద వైసీపీలోనూ కలవరం రేగుతోంది. అయితే దాని మీద విక్రం రెడ్డి అయితే తాజాగా వివరణ ఇచ్చారు. తాను వైసీపీని వీడిపోవడం లేదని ఆయన స్పష్టం చేశారు.

తన రాజకీయ ప్రయాణం అంతా జగన్ తోనే అని ఆయన క్లారిటీ ఇచ్చారు. తాను ఏ సమస్య వచ్చినా నేరుగా జగన్నే సంప్రదిస్తాను అని విక్రం రెడ్డి తెలియచేశారు. జగన్ కుటుంబంతో తమ కుటుంబానికి చాలా కాలంగా అనుబంధం ఉందని విక్రం రెడ్డి గుర్తు చేశారు.

వైసీపీ ఏర్పాటులో తమ కుటుంబం కీలక పాత్ర పోషించిందని, జగన్ ఆదేశం మేరకు తన తండ్రి రెండు సార్లు ఎంపీ పదవికి రాజీనామా చేసిన సంగతిని ఆయన గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో ఉన్న పదికి పది సీట్లను తమ పార్టీ కైవశం చేసుకుంటుందని విక్రం రెడ్డి చెప్పారు.

సరే ఆయన వివరణ ఇచ్చారు. కానీ ప్రచారం మాత్రం అలా సాగుతూనే ఉంది. మరి వైసీపీ నుంచి యాభై మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని టీడీపీ చేస్తున్న ప్రచారం లో నిజమెంత మేమంతా జగన్ తోనే అంటున్న ఎమ్మెల్యేల మాటలో విశ్వసనీయత ఎంతా అన్నది కాలమే చెప్పాల్సి ఉంటుంది అని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.