మరో రెడ్డికి కేసీఆర్ పెద్ద పీట?!

Mon Feb 17 2020 12:30:47 GMT+0530 (IST)

Is Kcr Offered Rajyasabha Seat For Ponguleti Srinivasa Reddy

తెలంగాణలో రెడ్లకు గట్టి ప్రాధాన్యతను ఇస్తూ వస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. అసెంబ్లీ ఎన్నికలప్పుడు టికెట్ల కేటాయింపులు అయితేనేం..మంత్రివర్గంలో స్థానాల విషయంలో అయితేనేం.. రెడ్లకు కేసీఆర్ గట్టి ప్రాధాన్యతను ఇస్తున్నారు. కేసీఆర్ కు మొదటి నుంచి వెంట ఉన్న ఒకరిద్దరు రెడ్లు ఈ మధ్యకాలంలో కొంత ప్రాధాన్యతను కోల్పోయి ఉండవచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీకి ఆ సామాజికవర్గాన్ని పూర్తిగా దూరం చేయడానికే అనో.. వారికి ప్రాధాన్యత ఇవ్వక తప్పదనే భావనతోనో.. కేసీఆర్ వారికి గట్టి ప్రాధాన్యత ను అయితే ఇస్తున్నారు. ఈ క్రమంలో మరో రెడ్డికి కేసీఆర్ ఒక నామినేటెడ్ ఎంపీ పోస్టును ఇస్తున్నారని భోగట్టా.అది మరెవరికో కాదు పొంగులేటి శ్రీనివాస రెడ్డికి. ఏపీ రాజకీయాలకు కూడా ఈయన పేరు పరిచయమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 2014లో ఖమ్మం నుంచి ఎంపీగా నెగ్గారు శ్రీనివాసరెడ్డి. అనంతరం తెలంగాణ రాష్ట్ర సమితిలోకి ఫిరాయించారు. అయితే ఏనాడూ జగన్ ను పల్లెత్తు మాట అనలేదు. పైపెచ్చూ జగన్ తో సన్నిహిత సంబంధాలు నెరిపారు. ఇటీవలే శ్రీనివాసరెడ్డి ఇంటి శుభకార్యానికి కూడా జగన్ హాజరయ్యారు. అలా జగన్ తో సన్నిహిత సంబంధాలు నెరుపుతున్న శ్రీనివాస రెడ్డి కేసీఆర్ కోరిక మేరకు గత ఎన్నికలప్పుడు ఎంపీ సీటును త్యాగం చేశారు.

ఈ నేఫథ్యంలో ఆయనకు రాజ్యసభ అవకాశాన్ని ఇవ్వనున్నారట కేసీఆర్. టీఆర్ఎస్ కోటాలోని రాజ్యసభ సీట్లలో ఒకటి పొంగులేటికి ఖరారు చేసినట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. లోక్ సభ ఎన్నికలప్పుడే పొంగులేటి కి కేసీఆర్ ఆ హామీ ఇచ్చారని ఆ మేరకు ఇప్పుడు ఆయన రాజ్యసభ సభ్యుడు కాబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అటు తను ఇచ్చిన హామీకి మరోవైపు రెడ్డి సామాజిక వర్గానికి మరింత ప్రాధాన్యత ఇచ్చినట్టుగా పొంగులేటికి కేసీఆర్ పదవిని ఇవ్వబోతున్నారని భోగట్టా.