Begin typing your search above and press return to search.

జనసేనలోకి ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు?

By:  Tupaki Desk   |   24 Jan 2023 1:43 PM GMT
జనసేనలోకి ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు?
X
బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పార్టీ మారే యోచనలో ఉన్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా తప్పుకున్న తర్వాత కన్నాకు బీజేపీ అధిష్టానం ఏ బాధ్యతలు అప్పగించలేదు. అలాగే ప్రస్తుత అధ్యక్షుడు సోము వీర్రాజు తనను కలుపుకుపోవడం లేదనే బాధ కూడా కన్నాలో ఉందని అంటున్నారు. వివిధ ముఖ్యమైన సమావేశాలకు, ముఖ్య నిర్ణయాలు తీసుకోవడంలో తనకు ప్రాధాన్యత ఉండటం లేదనే అసంతృప్తి కన్నా లక్ష్మీనారాయణలో ఉందని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో కన్నా లక్ష్మీనారాయణ గుంటూరులో ఇటీవల తన ముఖ్య అనుచరులతో సమావేశం నిర్వహించడం కలకలం రేపింది. భవిష్యత్‌ పరిమాణాలపై ఆయన వారితో చర్చించినట్టు సమాచారం. జనసేన పార్టీలో చేరాలనే యోచనలో కన్నా లక్ష్మీనారాయణ ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

దివంగత నేత వంగవీటి మోహన్‌రంగా అనుచరుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించిన కన్నా లక్ష్మీనారాయణ గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగుసార్లు (1989, 1994, 1999, 2004) కాంగ్రెస్‌ పార్టీ తరఫున గెలుపొందారు. 2009లో గుంటూరు పశ్చిమ నుంచి విజయం సాధించారు. ఇలా వరుసగా ఐదుసార్లు గెలిచిన రికార్డు సొంతం చేసుకున్నారు.

నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, వైఎస్‌ రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గాల్లో సుదీర్ఘకాలంగా మంత్రిగా కన్నా లక్ష్మీనారాయణ పనిచేశారు. 2014లో ఆయన కాంగ్రెస్‌ అభ్యర్థిగా గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేసి తొలిసారి ఓడిపోయారు. 2019 ఎన్నికల ముందు వైఎస్సార్సీపీలోకి చేరడానికి నిర్ణయించుకుని.. చివరి నిమిషంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

దీంతో ఆయనకు బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా ఆ పార్టీ అధిష్టానం నియమించింది. కన్నా లక్ష్మీనారాయణ, ప్రస్తుత బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సైతం కాపు సామాజికవర్గానికి చెందినవారే. అయితే బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ అంత చురుగ్గా పార్టీని నడిపించలేకపోయారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆ పార్టీ అధిష్టానం ఆయనను పదవి నుంచి తప్పించి సోము వీర్రాజుకు పదవిని కట్టబెట్టింది. కన్నాకు జాతీయ స్థాయిలో పదవి లభిస్తుందని వార్తలు వచ్చినా అవి నిజం కాలేదు. దీంతో కొంత కాలం సైలెంట్‌గా ఉన్న కన్నా ఎట్టకేలకు పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్టు గాసిప్స్‌ వినిపిస్తున్నాయి.

అందులోనూ జనసేన–టీడీపీ పొత్తు ఖాయమని అంటున్నారు. ఈ నేపథ్యంలో జనసేనలో చేరితే సులువుగా విజయం సాధించవచ్చని కన్నా భావిస్తున్నారు. అలాగే సామాజిక సమీకరణాలు కలిసి వస్తే మరోసారి మంత్రి కావచ్చనే భావనలో ఉన్నారు. పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి నుంచి కన్నా లక్ష్మీనారాయణ జనసేన తరఫున బరిలోకి దిగుతారని అంటున్నారు. మరికొద్ది రోజుల్లో జనసేనలో చేరడానికి ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నారని చెబుతున్నారు.

జనవరి 26న కన్నా లక్ష్మీనారాయణ జనసేనలో చేరతారని అంటున్నారు. దీనికి సంబంధించిన ప్రాథమిక చర్చలు ముగిశాయని సమాచారం. ప్రస్తుతం సత్తెనపల్లి ఎమ్మెల్యేగా అంబటి రాంబాబు ఉన్నారు. అంబటి సైతం కాపు సామాజికవర్గానికి చెందినవారే. మరోవైపు కన్నా లక్ష్మీనారాయణ కూడా కాపు సామాజికవర్గానికే చెందినవారే కావడంతో సత్తెనపల్లి పోరు ఆసక్తి రేపనుంది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.