కేసీఆర్ సెంటిమెంటు రాజకీయం చేస్తున్నారా ?

Fri Mar 17 2023 10:00:41 GMT+0530 (India Standard Time)

Is KCR doing sentimental politics?

పార్టీ లేదా ప్రభుత్వం ఎప్పుడు కష్టాల్లో ఉన్నట్లు అనిపించినా కేసీయార్ వెంటనే సెంటిమెంటు రాజకీయాలు మొదలుపెడతారు. గడచిన తొమ్మిదేళ్ళలో ఈ విషయం అనేకసార్లు రుజువైంది. ఇపుడు జరుగుతున్న గోల కూడా అలాగే అనిపిస్తోంది. తొందరలోనే సాధారణ ఎన్నికలు రాబోతున్నాయి. షెడ్యూల్ ఎన్నికలు డిసెంబర్లో జరగాలి. ప్రభుత్వంతో పాటు పార్టీపైన జనాల్లో బాగా వ్యతిరేకత పెరిగిపోతోందని సర్వేలు చెబుతున్నాయి. అలాగే చాలామంది ఎంఎల్ఏలపైన వ్యక్తిగతంగా పెద్దఎత్తున అవినీతి ఆరోపణలున్నాయి.ఈ పరిస్ధితిల్లో వచ్చేఎన్నికల్లో బీఆర్ఎస్  గెలుపు కష్టమనే అనుకుంటున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే రెండు అంశాలు తెరపైకి వచ్చాయి. మొదటిదేమో బీఆర్ఎస్ ఎంఎల్ఏలను కొనేందుకు బీజేపీ పావులు కదుపుతోందనేది. బీఆర్ఎస్ ఎంఎల్ఏలను కొనేసి తన ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు బీజేపీ కుట్రచేస్తోందని కేసీయార్ కొద్దిరోజులు గోలగోల చేశారు. అయితే దాన్ని జనాలు ఎవరూ పట్టించుకోలేదు. ఎందుకంటే కేసీయార్ కూడా కాంగ్రెస్ టీడీపీ ఎంఎల్ఏలను ప్రలోభాలు పెట్టి లొంగదీసుకున్న విషయం జనాలందరికీ గుర్తంది.

కాబట్టే కేసీయార్ ఎంత ప్రయత్నించినా  ప్రభుత్వాన్ని కూల్చటమనే సెంటిమెంట్ రాజుకోలేదు. సరిగ్గా ఈ సమయంలోనే ఢిల్లీ లిక్కర్ స్కామ్ బయటపడింది. తీగలాగితే డొంక కదిలినట్లు అది వచ్చి వచ్చి చివరకు కేసీయార్ కూతురు కల్వకుంట్ల కవిత దగ్గర ఆగింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సౌత్ గ్రూపులో కవితే సూత్రదారని ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అనుమానించి విచారణకు నోటీసులిచ్చింది.
 
ఇక్కడే కేసీయార్ సెంటిమెంట్ డ్రామా మొదలుపెట్టారు. ఈడీ మహిళలను వేధిస్తోందని సెంటిమెంటు మొదలుపెట్టారు. దర్యాప్తుసంస్ధలను అడ్డంపెట్టుకుని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతిపక్షాల నేతలను విచారణ పేరుతో ఇబ్బందులు పెడుతోందంటు కేసీయార్ గోల చేస్తున్నారు. లిక్కర్ స్కామ్ లో తనను అన్యాయంగా ఇరికించారని కవిత కూడా ఆరోపణలు మొదలుపెట్టారు. నిజంగానే కవితకు ఇందులో ప్రమేయం లేకపోతే విచారణకు ఎందుకు భయపడుతున్నారు. తాజాగా కవిత తాను మహిళను ఈడీ ఆఫీసులో విచారణకు హాజరుకాలేనని మహిళలకు ప్రత్యేక హక్కులున్నాయంటు గోల చేస్తున్నారు. ఈ గోల వెనుక బీజేపీ మహిళలను వేధిస్తోందనే సెంటిమెంటును రాజేయటమే అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.