బండి సంజయ్ పై అసమ్మతి మొదలైనట్టేనా?

Sat Apr 01 2023 18:00:01 GMT+0530 (India Standard Time)

Is Disagreement on Bandi Sanjay Started

అసెంబ్లీ ఎన్నికలకు దగ్గర పడుతున్న వేళ తెలంగాణ బీజేపీ అసమ్మతి రాగాలు బయటపడుతున్నాయి. తాజాగా పలువురు సీనియర్లు గళమెత్తడం బండికి మింగుడుపడని వ్యవహారంగా మారింది. ఇప్పటికే కవితపై 'ముద్దు ' వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ పై తోటి బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తప్పుపట్టడం తెలంగాణ బీజేపీలో చర్చనీయాంశమైంది. బండి సంజయ్ వ్యాఖ్యలను అరవింద్ తప్పు పట్టి దుమారం రేపారు.



ఇప్పుడు బీజేపీలో కీలకంగా వ్యవహరించే పేరాల శేఖర్ రావు వంటి నేతలు బాహాటంగా బండి సంజయ్ ను టార్గెట్ చేయడం సంచలనమైంది. సోషల్ మీడియా వేదికగా ఆయన పోస్టులు పెట్టి మరీ బండి సంజయ్ ను విమర్శించారు.

బండి సంజయ్ పదవీకాలం ముగిసిందని.. ఆయనను పక్కనపెట్టి కొత్త వారికి అవకాశం ఇవ్వాలంటూ శేఖర్ రావు నిరసనగళం వినిపించడం ద్వారా తెలంగాణ బీజేపీలో చర్చకు దారితీశారు.

అయితే బండి సంజయ్ విషయంలో ఈ దుమారం సీనియర్లలో కూడా వ్యక్తమవుతోందని.. పలువురు సీనియర్లు కూడా బండికి వ్యతిరేకంగా అధిష్టానానికి ఫిర్యాదు చేశారని ఓ ప్రచారం సాగుతోంది. అయితే దీన్ని తెలంగాణ బీజేపీ ఇన్ చార్జి తరుణ్ చుగ్ మాత్రం తోసిపుచ్చి బండి సంజయ్ కు అండగా నిలిచినట్టుగా చెబుతున్నారు.

2024లో పార్టీ సంస్థాగత ఎన్నికలు జరిగే వరకూ బండి సంజయ్ ను తెలంగాణ బీజేపీ చీఫ్ పదవి నుంచి మార్చేలది లేదని తరుణ్ చుగ్ క్లారిటీ ఇచ్చారు. తరుణ్ చుగ్ వ్యాఖ్యలతో బీజేపీ ఈ అసెంబ్లీ ఎన్నికలను బండి సంజయ్ సారథ్యంలోనే వెళ్లబోతోందన్నది స్పష్టంగా అర్థమవుతోంది.

మరి బండి సంజయ్ ను వ్యతిరేకిస్తున్న సొంత పార్టీలోని వర్గాలు రానున్న ఎన్నికల్లో ఆయనకు సహకరిస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.        


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.