Begin typing your search above and press return to search.

ప్రజలకు దూరం అయ్యామా..? కేసీఆర్ లో టెన్షన్? అందుకే మారాడా?

By:  Tupaki Desk   |   27 Jan 2023 9:00 PM GMT
ప్రజలకు దూరం అయ్యామా..? కేసీఆర్ లో టెన్షన్? అందుకే మారాడా?
X
భారతీయ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) బాస్ మారిపోయారా..? గతం కంటే ఇప్పుడు ఆయన పనితీరు డిఫరెంట్ గా ఉందా..? కొన్ని పరిస్థితులు చూస్తే అలాగే అనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ గతంలో ఎక్కువ శాతం ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యేవారు. కానీ ఇప్పుడు నిత్యం ప్రగతి భవన్లోనే ఉంటున్నారు. తనను కలవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి అపాయింట్మెంట్ ఇస్తున్నారు. అటు సభలు, సమావేశాలు నిరంతరం సాగిస్తున్నారు. పలువురు నాయకులతో మీటింగ్ పెడుతూ బిజీ అయ్యారు. మరి ఆయన ఇలా మారడానికి కారణం ఏంటి..? కొన్ని నెలలుగా తనకు ప్రజలు దూరమయ్యారనే భావన ఆయనలో కలిగిందని అనుకుంటున్నారు. అందుకే టెన్షన్ పడుతూ తన వ్యవహారాన్ని మార్చుకున్నారని చర్చిస్తున్నారు.

మరికొద్ది నెలల్లోనే తెలంగాణలో ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ రాజకీయంగా అలర్ట్ అయ్యారు. ఇన్నాళ్లు ప్రతీ పనిని ఫామ్ హౌస్ నుంచే చక్కబెట్టిన ఆయన ఇప్పుడు నిత్యం ప్రగతి భవన్లో దర్శనం ఇస్తున్నారు. గతంలో కేసీఆర్ ను కలవాలంటే ప్రయాస పడాల్సి వచ్చేదని, ఇప్పుడు కలవడం ఈజీ అని కొందరు ఆ పార్టీకి చెందిన నేతలు చెప్పుకుంటున్నారు. అయితే ఎన్నికల సందర్భంగానే ఆయన అప్రమత్తమయ్యారని చర్చించుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టేందుకు తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు తనకు ప్రజలు దూరం అయ్యారనే భావన కేసీఆర్ లో కలిగినట్లు సమాచారం. అందుకే సభలు సమావేశాలు నిరంతరం నిర్వహిస్తున్నారు. గత రెండు నెలల్లో 7 బహిరంగ సభలు నిర్వహించి ప్రత్యేకంగా నిలిచారు.

బహిరంగ సభల ద్వారానే ప్రజల్లో చర్చ ఉంటుందని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ వేగం పెంచారు. అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తూ.. పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తున్నారు. తాజాగా ఉద్యోగుల విషయంలో ఆయన తీసుకున్న అనూహ్య నిర్ణయాలే ఇందుకు నిదర్శనం.

ఇక బీజేపీకి కౌంటర్ ఇచ్చేందుకే కేసీఆర్ పోటీ పడి సభలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈనెల 19న ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన ఉంటుందని తెలుసుకున్న ఆయన 18న ఖమ్మం సభ నిర్వహించారు. అలాగే వచ్చే నెలలో కేంద్ర నాయకుల రాక సందర్భంగా ఫిబ్రవరి 17న సెక్రటేరియట్ ప్రారంభ కార్యక్రమాన్ని ఫిక్స్ చేశారు. ఓ వైపు కేంద్రంపే విమర్శలు చేస్తూనే మరోవైపు బీఆర్ఎస్ చేయబోయే కార్యక్రమాల గురించి వివరిస్తున్నారు.

వచ్చే ఎన్నికల వరకు ప్రజల నుంచి తనకు వ్యతిరేకంగా రాకుండా ఉండడానికే కేసీఆర్ అలర్ట్ అయ్యారని తెలుస్తోంది. ఈ మేరకు మొన్నటి వరకు టెన్షన్ పడ్డఆయన సభలు సక్సెస్ కావడంతో కాస్త కూల్ అయ్యారు. ఇక దేశంలోని పలువురు నాయకులు కేసీఆర్ ను కలుస్తుండడంతో బీఆర్ఎస్ లో మరింత జోష్ పెంచినట్లయింది. దీనిని ప్రచారం చేసేందుకు ఆయన వ్యూహాన్ని రచిస్తున్నారు. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావడానికి కేసీఆర్ చాకచక్యంగా వ్యవహరిస్తున్నారని చర్చించుకుంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.