చంద్రబాబుకు ఫోన్ అస్సలు అచ్చిరావట్లేదట.. మరోసారి దెబ్బ

Tue Jul 20 2021 10:32:20 GMT+0530 (IST)

Is Chandrababu not safe from 'phone' shock once again?

తప్పులు చేయటం అలవాటుగా మారితే వచ్చే ఇబ్బందిని టీడీపీ అధినేత చంద్రబాబు ఎదుర్కొంటున్నారా? రాజకీయం చేయాలి. కానీ.. అదంతా సూటిగా ఉండాలే తప్పించి అడ్డదారుల్లోకి వెళ్లకూడదు. ఒకవేళ అలాంటి ప్రయత్నం చేస్తే.. ఒక రోజు కాకుంటే మరో రోజైనా దెబ్బ పడుతుందని చెప్పాలి. పేరుకు హైటెక్ బాబుగా చెబుతారు కానీ.. ఆయన రాజకీయ నిర్ణయాలన్ని కూడా లోటెక్ గా ఉంటాయని చెబుతారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వానికి షాకిచ్చేందుకు ప్రయత్నించి అడ్డంగా బుక్ అయిన చంద్రబాబు అండ్ కో.. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇరుకున పెట్టేందుకు చేసిన ప్రయత్నంలో ఇప్పుడు ఆయనకే బూమ్ రాంగ్ అయిన వైనం సంచలనంగా మారింది.తెలంగాణ రాష్ట్రం ఏర్పడి.. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కొత్తల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగటం.. ఆ సందర్భంగా చోటు చేసుకున్నపరిణామాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. నామినేటెడ్ ఎమ్మెల్యేగా ఉన్న స్టీఫెన్ సన్ కు భారీగా డబ్బులు ఆశ జూపి.. తాము చెప్పిన వారికి ఓటు వేయాలంటూ రేవంత్ ద్వారా చంద్రబాబు రాయబేరాన్ని నడిపినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. అయితే.. ఈ విషయాన్ని ముందుగా పసి గట్టిన కేసీఆర్ అండ్ కో.. బాబు బ్యాచ్ ను అడ్డంగా బుక్ చేయటం తెలిసిందే.

కెమేరాల్ని ఏర్పాటు చేసి.. ముందుగా చెప్పిన ప్రకారం రూ.50లక్షల నగదుతో రేవంత్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడటం.. దానికి ముందు స్టీఫెన్ సన్ తో చంద్రబాబు ఫోన్ సంభాషణ.. ‘మన వాళ్లు బ్రీఫెడ్ మీ’ అన్న ఆయన (?) మాటలు ఎంతలా ఫేమస్ అయ్యాయో తెలుగు ప్రజలందరికి తెలిసిందే. ఆ ఎపిసోడ్ లో బాబు ఫోన్ సంభాషణ ఆయన్ను రాజకీయంగా దెబ్బ తీయటమే కాదు.. పదేళ్ల పాటు హైదరాబాద్ లో ఉండాల్సిన దానికి భిన్నంగా అప్పటికప్పుడు హడావుడిగా భాగ్యనగరిని వదిలేసి అమరావతికి వెళ్లిపోవటం తెలిసిందే.

కట్ చేస్తే.. తాజాగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ ఎపిసోడ్ లోనూ బాబు ‘ఫోన్’ బాధితుడిగా మారటం విశేషం. ఆయన్ను అరెస్టు చేసిన సందర్భంగా రఘురామ ఫోన్ ను సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకోవటం.. దానిలోని డేటాను విశ్లేషించిన అధికారులు సంచలన అంశాల్ని గుర్తించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ న్యాయస్థానంలో దాఖలు చేసిన పిటిషన్ కు సంబంధించిన అంశాల్ని బాబు స్వయంగా పరిశీలించాలరన్న సీఐడీ అధికారుల నివేదిక సంచలనంగా మారింది.

కోర్టులో పిటిషన్ దాఖలు చేయటానికి ముందు.. రఘురామ స్వయంగా ఆ కాపీని చంద్రబాబుకు వాట్సాప్ చేసినట్లుగా అధికారులు గుర్తించారు. అంతేకాదు.. అందులోని మార్పులు చేర్పుల గురించి వారు వాట్సాప్ చాట్ చేసుకున్న వైనాన్ని కూడా గుర్తించినట్లు తెలుస్తోంది. అప్పట్లో ఫోన్ షాక్ తో రాజకీయంగా దారుణమైన ఇమేజ్ డ్యామేజ్ జరిగిన చంద్రబాబుకు.. తాజా ఉదంతంలోనూ మరోసారి ఎదురుదెబ్బ తగిలిందన్న మాట వినిపిస్తోంది. ఈసారి ఫోనే కీ రోల్ ప్లే చేయటం గమనార్హం. చూస్తుంటే..చంద్రబాబుకు ఫోన్ రాజకీయాలు అంతగా అచ్చిరావట్లేదన్న భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మరీ.. విషయాన్ని చంద్రబాబు ఎప్పటికి గుర్తిస్తారో?