చంద్రబాబుది సెల్ఫ్ గోలేనా ?

Sun Oct 24 2021 17:00:01 GMT+0530 (IST)

Is Chandrababu a self goal

ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని ఢిల్లీకి వెళ్ళటం చంద్రబాబునాయుడు సెల్ఫ్ గోలేనా ? ఇపుడిదే అంశంపై పార్టీలోనే చర్చ జరుగుతోంది. టీడీపీ నేత పట్టాభి సీఎంను పట్టుకుని నోటికొచ్చినట్లు తిట్టారు. దాంతో వైసీపీ నేతలు టీడీపీ ఆఫీసులపై దాడులుచేశారు. వెంటనే మరుసటి రోజు చంద్రబాబు రాష్ట్రబంద్ కు పిలుపిచ్చారు. అయితే బంద్ ఫెయిలైంది. దాంతో వెంటనే 36 గంటల దీక్ష చేశారు. సోమవారం ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. తమ పార్టీ కార్యాలయాలపై దాడులు జరిగిన దగ్గర నుండి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఫెయిలైంది కాబట్టి రాష్ట్రపతి పాలన పెట్టాలనే డిమాండ్లను పదే పదే చేస్తున్నారు.ఇంతటితో ఆగితే బాగానే ఉండేది. ఎందుకంటే తమ పార్టీ ఆఫీసులపై ఎందుకు దాడి జరిగిందనే విషయాన్ని తన మద్దతు మీడియాలో ఎక్కడా కనబడకుండా చంద్రబాబు జాగ్రత్తలు తీసుకున్నారు. అందుకనే టీడీపీ ఆఫీసులపై దాడి జరిగిందని మాత్రమే మొదటినుండి సదరు మీడియా హైలైట్ చేస్తోంది. రాష్ట్రం వరకు చంద్రబాబు అండ్ కో ఏమి మాట్లాడినా లాజిక్కులతో సంబంధంలేకుండా అచ్చేసే మీడియా ఉంది కాబట్టి పర్వాలేదు. అదే ఢిల్లీకి వెళితే సీన్ మొత్తం రివర్సవ్వటం ఖాయం.

ఇపుడు రాష్ట్రపతితో భేటీలో చంద్రబాబు తమ పార్టీ కార్యాలయాలై దాడులు జరిగినట్లు చెబుతారు. లా అండ్ ఆర్డర్ ఫెయిలైంది కాబట్టే  రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తారు. టీడీపీ ఆపీసులపై వైసీపీ నేతలు ఎందుకు దాడి చేశారని రాష్ట్రపతి అడిగితే చంద్రబాబు ఏమని సమాధానం చెబుతారు ? రాష్ట్రంలో చెప్పినట్లు నోటికొచ్చింది చెప్పేందుకు లేదు. ఎందుకంటే ఏపీలో ఏమి జరిగింది ? ఏమి జరుగుతోందో తెలుసుకోలేనంత అమాయకుడు కాదు రాష్ట్రపతి. ఎందుకంటే ఆయన కూడా పూర్తిస్ధాయి పొలిటీషియనే. ఆయనకు కూడా రాజకీయాలు బాగానే తెలుసు.

దాడుల విషయంలో రాష్ట్రపతి గవర్నర్ డీజీపీలను అడిగితే ఏమి జరిగిందనే విషయాన్ని పూసగుచ్చినట్లు వివరిస్తారు. దాడులకు మూలకారణమైన పట్టాభి వీడియోలను కూడా పంపుతారు. అలాగే నరేంద్రమోడినో లేకపోతే అమిత్ షా తో భేటీ జరిగితే అక్కడ కూడా ఇదే విషయం చర్చకు వస్తుంది. అప్పుడు వాళ్ళ ప్రశ్నలకు చంద్రబాబు ఏమని సమాధానం చెబుతారు ? చంద్రబాబు చెప్పిన మాటలను గుడ్డిగా నమ్మేసి ఏపిలో రాష్ట్రపతి పాలన పెట్టేసేంత అమాయకులు వాళ్ళిద్దరు ?

 ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలంటే ముందు క్యాబినెట్లో చర్చ జరగాలి. ఆ తర్వాత హోంశాఖ రిపోర్టివ్వాలి. అప్పుడు మళ్ళీ క్యాబినెట్ సమావేశంలో చర్చించిన తర్వాత రాష్ట్రపతికి సిఫారసు చేయాలి. అంటే రాష్ట్రపతి పాలన విధించటం దాదాపు జరిగేపని కాదని అందరికీ తెలిసిందే. ఎందుకంటే రాష్ట్రపతి పాలన విధించేంత పరిస్ధితులు అసలు ఏపీలో లేనేలేవు. రాష్ట్రంలో ఏమి జరిగిందనే విషయం రాష్ట్ర బీజేపీ నేతలు కూడా జాతీయ పార్టీకి వివరిస్తారు కదా.

ఈ మొత్తం మీద చంద్రబాబు గమనించాల్సిందేమంటే బోసిడీకే అనే పదానికి అర్ధం రాష్ట్రపతి నరేంద్రమోడి అమిత్ షా కు తెలీకుండానే ఉంటుందా ? జగన్మోహన్ రెడ్డిని పట్టాభి తిట్టిన వీడియోలు చూసిన తర్వాత వాళ్ళు చంద్రబాబు మాటలను పట్టించుకుంటారా ? పోనీ ఢిల్లీలో మీడియాను కలిసినపుడైనా హిందీ జర్నలిస్టులు చంద్రబాబును పట్టాభి వీడియోల గురించి ప్రశ్నిస్తే ఏమని సమాధానం చెబుతారు ? సో జరుగుతున్నది చూస్తుంటే చంద్రబాబు అనవసరంగా సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నట్లే అనుమానంగా ఉంది. చూద్దాం ఢిల్లీ పర్యటనలో ఏమి జరుగుతుందో ?