Begin typing your search above and press return to search.

బీజేపీ వ్యూహం మార్చుకుంటోందా ?

By:  Tupaki Desk   |   10 Jun 2023 9:49 AM GMT
బీజేపీ వ్యూహం మార్చుకుంటోందా ?
X
తెలంగాణాలో అధికారంలోకి రావాలన్నది బీజేపీ పట్టుదల. అధికారంలోకి వచ్చేందుకు అన్నివిధాల పరిస్ధితులు అనుకూలంగా ఉన్నాయని స్టేట్ చీఫ్ బండి సంజయ్ పదేపదే చెబుతున్నారు. అయితే ఎక్కడో కొంత మైనస్సులు కనబడుతున్నాయి. వాటిని కూడా భర్తీచేసేస్తే అధికారానికి ఢోకా ఉండదన్ని పార్టీ అగ్రనేతల ఆలోచన. ఇందులో భాగంగానే వ్యూహం మార్చుకున్నట్లు సమాచారం. అదేమిటంటే అర్హత కలిగిన సీనియర్లకు, అసంతృప్తితో ఉన్న గట్టి నేతలకు పదవులను కట్టబెట్టడమేనట.

గడచిన తొమ్మిదేళ్ళుగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. అయితే కేంద్రప్రభుత్వంలో కొన్ని వేల పదవులు భర్తీచేసే అవకాశాలున్నాయి. ప్రభుత్వ రంగసంస్ధల్లో డైరెక్టర్లుగాను, వివిధ బ్యాంకుల పాలకవర్గాల్లాంటి అనేక మార్గాల్లో ఎన్నో పదవులు ఇవ్వవచ్చు.

అయితే బీజేపీ అగ్రనేతలు ఈ విషయంగా ఆలోచించలేదు. పదవుల పందేరంలో ఉత్తరాధి రాష్ట్రాల్లో ఎలాంటి మార్గాన్ని అవలంభిస్తున్నారో తెలీదు కానీ తెలంగాణాకు మాత్రం మొండిచెయ్యే చూపించారు.

తెలంగాణాకు చెందిన సీనియర్ నేతల్లో విద్యసాగర్ రావు, బండారు దత్తాత్రేయ లాంటి కొద్దిమందికి మాత్రమే గవర్నర్ పదవులను కట్టబెట్టారు. ఇదికాకుండా సినియర్లకు నియమించేందుకు చాలా పదవులున్నాయి.

కాబట్టి అలాంటి పదవుల్లో అర్హతకలిగిన సీనియర్లను నియమించటం, పార్టీ పదవులను అప్పగించటం చేయాలని డిసైడ్ అయ్యిందట. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమంటే ఎన్నికలు ఆరుమాసాల్లో వచ్చేస్తోంది. నాలుగున్నరేళ్ళు ఎవరికీ ఎలాంటి పదవులు కట్టబెట్టకుండా చివరి ఆరుమాసాల్లో పదవులు ఇచ్చేస్తే నేతలు పార్టీకి కష్టపడి పనిచేస్తారా ? అన్నదే కీలకమైంది.

ఇపుడున్న పరిస్ధితుల్లో బీజేపీ అధికారంలోకి వచ్చేది అనుమానమే. ఎందుకంటే క్షేత్రస్ధాయిలో పార్టీ బలంగా లేదని అందరికీ తెలుసు. 119 నియోజకవర్గాల్లో ఎన్నికలంటే తక్కువలో తక్కువ 30 నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్ధులుంటే ఉండచ్చంతే. మిగిలిన 89 నియోజకవర్గాల మాటేమిటి ? అందుకనే ఇతర పార్టీల్లోని నేతలకు గాలమేస్తున్నది.

కానీ ఆశించినంతగా నేతలు పెద్దగా రెస్పాండ్ కావటంలేదు. అందుకనే ఏమిచేయాలో దిక్కుతోచటంలేదు. ఇందులో భాగంగానే పార్టీలోని సీనియర్లు ఇతర పార్టీల్లోకి వెళ్ళకుండా పదవులు కట్టబెడితే వచ్చేఎన్నికల్లో గట్టిగా పనిచేస్తారని అగ్రనేతలు అనుకుంటున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.