రాహుల్ గాంధీపై సినిమా.. భాజపా కుట్ర!!

Tue Feb 12 2019 12:20:04 GMT+0530 (IST)

Is BJP Conspiracy On Rahul Gandhi Biopic

ప్రస్తుతం పొలిటికల్ బయోపిక్ ల ట్రెండ్ వేడెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ వైయస్సార్ థాక్రే మోదీ జయలలిత వంటి ప్రముఖులపై బయోపిక్ లు వేడెక్కించాయి. ఎన్టీఆర్ బయోపిక్ ఇటీవలే రిలీజై ఫ్లాపైనా వైయస్సార్ బయోపిక్ విజయం సాధించింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ బయోపిక్ ఫ్లాపైనా థాక్రే బయోపిక్ కి చక్కని స్పందన వచ్చింది. ఆ క్రమంలోనే మోదీ బయోపిక్ గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. కోలీవుడ్ లో జయలలితపై ఏకంగా మూడు బయోపిక్ లు తీయడం ఉత్కంఠ పెంచుతోంది.ఇదిలా ఉండగానే కాంగ్రెస్ అధ్యక్షుడు .. యువరాజా రాహుల్ గాంధీ బయోపిక్ అంటూ ఆసక్తికర అప్ డేట్ వచ్చింది. `కామసూత్ర 3డి` ఫేం రూపేష్ పాల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ట్రైలర్ రిలీజైంది. ఈ ట్రైలర్ ఆద్యంతం రాహుల్ ఆహార్యంపై దర్శకుడు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇందిరాగాంధీని గార్డ్ లే తుపాకులతో కాల్చి చంపే సమయంలో ఆ హత్యను చూసిన రాహుల్ లో అంతర్మధనం .. అటుపై చిన్నారిగా అతడు ఎదిగే క్రమం మన్మోహన్ నుంచి పార్టీ పగ్గాలు చేపట్టే క్రమం.. ప్రతిదీ ట్రైలర్ లో ఆవిష్కరించారు. అయితే ఈ ట్రైలర్ నాశిరకంగా ఉందని రాహుల్ గాంధీ ఇమేజ్ ని డ్యామేజ్ చేసేదిగా ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఆసక్తికరంగా ఈ చిత్రానికి భాజపా నాయకులు కొందరు పెట్టుబడులు పెట్టడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది కచ్ఛితంగా కుట్రే నంటూ దర్శకుడు రూపేష్ పై కౌంటర్లు పడుతున్నాయి. అయితే రూపేష్ వెర్షన్ మాత్రం వేరొకలా ఉంది. దిల్లీలో ఒక జర్నలిస్టుగా ఉన్నప్పుడు రాహుల్ గాంధీని చాలా దగ్గరగా చూశాను. ఆయన చుట్టూ ఓ రకమైన నెగెటివిటీ కాన్ స్పిరసీ ఉండేది. ఆయనను పార్టీలోనే ఎవరూ నమ్మేవారు కాదు. పట్టించుకునే పరిస్థితే ఉండేది కాదు. కానీ అంచెలంచెలుగా తాను ఈ స్థానానికి ఎదిగారు. ఎన్నికల్లో గెలిచాక అప్పటివరకూ కనిపించని సహ నాయకులు జనం అతడి చుట్టూ మూగారు.. ఇది రాహుల్ గాంధీ బయోపిక్ కాదు. నిజ జీవితకథను యథార్థంగా చూపిస్తున్నాం అంటూ రూపేష్ చెబుతున్నారు. అయితే భాజపా నాయకులు ఈ బయోపిక్ లో పెట్టుబడులు పెట్టడంపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలో రిలీజ్ కి రానున్న ఈ చిత్రం ఎలాంటి వివాదాల్ని మోసుకు రానుందో నన్న ప్రశ్నకు సరైన సమాధానం లేదు.