Begin typing your search above and press return to search.

బీసీ డిక్లరేషన్ రెడీ అవుతోందా ?

By:  Tupaki Desk   |   30 May 2023 10:05 AM GMT
బీసీ డిక్లరేషన్ రెడీ అవుతోందా ?
X
తెలంగాణాలో బీసీలను ఆకట్టుకోవటానికి డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందుకు కర్నాటకలో అనుసరించిన ఫార్ములానే ఇక్కడ కూడా ఫాలో అవ్వాలనే ఆలోచనలో ఉన్నది పార్టీ. బీసీ డిక్లరేషన్ రూపొందించటంలో కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్య, కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ సహకారాన్ని కోరినట్లు తెలుస్తోంది. వాళ్ళు కూడా హైదరాబాద్ రావటానికి సానుకూలంగానే ఉన్నారట. ఇప్పటికే రైతు, యువత డిక్లరేషన్ రూపొందించి ప్రకటించిన విషయం తెలిసిందే.

రైతు డిక్లరేషన్ ప్రకటించేందుకు వరంగల్లో భారీ బహిరంగసభ నిర్వహించి రాహుల్ గాంధీని ఆహ్వానించింది పార్టీ. తర్వాత యూత్ డిక్లరేషన్ ప్రకటించేందుకు ప్రియాంకగాంధీని ఆహ్వానించారు. ఈ రెండు డిక్లరేషన్లను రూపొందించటంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చాలా యాక్టివ్ గా వ్యవహరించారు. రేవంత్ కు రైతువిభాగం, యువజన విభాగం నేతలు మద్దతుగా నిలిచారు.

సిద్ధరామయ్య, డీకేలు హైదరాబాద్ వచ్చినపుడు కర్నాటక ఎన్నికల్లో గెలుపు ఫార్ములాపై డీటైల్డ్ గా సీనియర్ నేతలంతా సమావేశమై చర్చింబోతున్నట్లు సమాచారం.

తెలంగాణాలో బీసీ సామాజికవర్గంలోని యాదవులు, గౌడ్లు చాలా బలంగా ఉన్నారు. ప్రస్తుతం వారిలో అత్యధికులు బీఆర్ఎస్ లో ఉన్నారు. అయితే జనాల్లో వ్యతిరేకత ఎక్కువగా ఉంది కాబట్టి ఎన్నికల సమయానికి బీఆర్ఎస్ ను వదిలేసి కాంగ్రెస్ లో చేరటం ఖాయమని హస్తంపార్టీ నేతలు ఆశిస్తున్నారు. నిజానికి బీఆర్ఎస్ లో ఇపుడున్న గౌడ్, యాదవ నేతల్లో ఎక్కువమంది కాంగ్రెస్, టీడీపీ నుండి వలస వెళ్ళినవారే.

పైగా వీరిలో అత్యధికులకు పార్టీలన్నా, అధినేతలన్నా కమిట్మెంట్ తక్కువనే చెప్పాలి. తమకు పదవులు ఎక్కడ వస్తాయి ? ఏ పార్టీ టికెట్ తీసుకుంటే గెలుస్తాం ? మంత్రిపదవి ఏ పార్టీ ఇస్తుందనేది కీలకమైపోయింది. అంటే ఈ విషయంలో బీసీలు, రెడ్లు, కమ్మోరనే తేడాలేదు. ముందు మనకేంటి ? తర్వాతే పార్టీ అనే విషయంలో చాలామంది నేతలు చాలా క్లియర్ గా ఉన్నారు.

పైగా బీఆర్ఎస్ నేతల్లో ఎక్కువమందిని కేసీయార్ ఏదోరకమైన ఒత్తిడి తెచ్చి పార్టీలోకి లాక్కున్నారు. కాబట్టి నేతల్లో ఎక్కువమందికి కమిట్మెంట్ ఏమీ ఉండదు. కాబట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేస్తుందని అనుకుంటే వెంటనే పార్టీ మారిపోవటం ఖాయం.