గెహ్లాట్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారా ?

Mon Sep 26 2022 10:19:52 GMT+0530 (India Standard Time)

Is Ashok Gehlot Blackmailing?

రాజస్ధాన్ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే అందరికీ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అఖిల భారత కాంగ్రెస్ కమిటి అధ్యక్ష పదవికి గెహ్లోట్ పోటీచేయబోతున్నారు. గెలిచిన తర్వాత అధ్యక్ష పదవితో పాటు రాజస్ధాన్ సీఎంగా కూడా కంటిన్యు అవ్వాలన్నది గెహ్లాట్ ఉద్దేశ్యం.ముఖ్యమంత్రి పదవిని ఎట్టి పరిస్ధితుల్లోను వదులుకోకూడదని అందులోను బద్ధశతృవైన సచిన్ పైలెట్ ను అసలు కుర్చీలో కూర్చోనివ్వకూడదన్నది ఆలోచన.

ఈ విషయాలపై చర్చించేందుకే ఆదివారం రాత్రి సీఎల్పీ సమావేశం ఏర్పాటుచేశారు. అయితే సమావేశం జరగనేలేదు. కారణం ఏమిటంటే మంత్రులు ఎంఎల్ఏల్లో ఎవరూ సమావేశానికి రాలేదు. ఎందుకంటే గెహ్లాట్ నే సీఎంగా కూడా కంటిన్యు చేయించాలని ఆయన మద్దతుదారులు డిమాండ్లు మొదలుపెట్టారు. ఒకవేళ ఒకరికి ఒకే పదవి అనే సూత్రాన్ని కచ్చితంగా అమలు చేయాల్సిందే అంటే గెహ్లాట్ సూచించిన నేతకే సీఎం కుర్చీ అప్పగించాలని డిమాండ్లు మొదలుపెట్టారు.

ఇందులో భాగంగానే అధిష్టానంపై ఒత్తిడి పెంచటంలో భాగంగా గెహ్లాట్ వర్గంలోని 92 మంది ఎంఎల్ఏలు రాజీనామాలు చేశారు.  సీఎల్పీ సమావేశానికంటే ముందే ఎంఎల్ఏలు తమ రాజీనామాలను మంత్రి శాంతీ ధారీవాల్  కు అప్పగించారట. 92 మంది ఎంఎల్ఏలు రాజీనామాలు సమర్పించారంటేనే ఇదొక బలప్రదర్శనగా చూడాలి.

ఇది పూర్తిగా గెహ్లాట్ వ్యూహంలో భాగంగానే జరిగిందని తెలిసిపోతోంది. అధిష్టానంపై తనకు అనుకూలంగా మైండ్ గేమ్ అమలు చేస్తున్నట్లు అర్ధమవుతోంది.

రాజస్ధాన్ ఎంఎల్ఏల్లో సచిన్ పైలెట్ వర్గంలో ఎంతమందున్నారో స్పష్టంగా తెలీటంలేదు. ఇపుడు సచిన్ కు వ్యతిరేకంగా రాజీనామా చేయటానికి ఎంఎల్ఏలు సిద్ధపడినట్లే రేపు సచిన్ మద్దతుదారులు కూడా రాజీనామాలకు సిద్ధపడితే ఏమవుతుంది ? జరుగుతున్న పరిణామాలను సచిన్ తో పాటు ఆయన వర్గం జాగ్రత్తగా గమనిస్తోంది. అధిష్టానం గనుక గట్టిగా ఉండకపోతే మధ్యప్రదేశ్ లో జరిగినట్లే  చేజేతులా ప్రభుత్వాన్ని కూల్చేసుకున్నట్లే అవుతుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.